Top Ten News @ 5 PM

ఈనాడు.నెట్‌లోని  పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 11 Jul 2021 19:04 IST

1. Ts News: ఉద్యోగాల భర్తీపై ఆర్థికశాఖ కసరత్తు

తెలంగాణలో త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో ఖాళీలకు సంబంధించి ఆర్థికశాఖ కసరత్తు కొనసాగుతోంది. శనివారం కొన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించిన ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు.. ఇవాళ మిగతా శాఖల కార్యదర్శులు, అధికారులతో సమావేశమయ్యారు. ఆయా శాఖలు గతంలో సమర్పించిన ఖాళీల వివరాలను మరోసారి సమీక్షిస్తున్నారు.

2. ‘ఆ ఆందోళనకు మావోయిస్టుల మద్దతు’

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు మద్దతిస్తామని మావోయిస్టు విశాఖ తూర్పు డివిజన్‌ కమిటీ కార్యదర్శి అరుణ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం బూటకపు సంస్కరణలు చేస్తోందని ఆమె ఆక్షేపించారు. ఈ మేరకు అరుణ పేరిట ఆడియో టేపు విడుదలైంది.

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై దోపిడీ ముఠా 

3. రేవంత్ చిన్నపిల్లవాడు: కోమటిరెడ్డి

‘‘కాంగ్రెస్‌ను ముందుకు నడిపే సమర్థమైన నేత లేరు. రేవంత్‌ చిన్నపిల్లవాడు. ఆయన గురించి నా దగ్గర మాట్లాడొద్దు. రాజకీయాలపై మాట్లాడనని గతంలోనే చెప్పా. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలి. ప్రజాసమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడతా’’ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటాననని.. పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 

4. ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదు: ఆర్కే

రాంకీ గ్రూప్‌ షేర్లకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఖండించారు. సంస్థలో తన పేరిట ఉన్న 12 వేల షేర్లను ఎవరికీ విక్రయించలేదని చెప్పారు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు సరి చూసుకోవాలన్నారు. ఏనాడు ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదని, పాల్పడబోనని ఆయన స్పష్టం చేశారు.

విప్‌ ఉదయభానును అడ్డుకున్న పోలీసులు

5. Green Mission: వీడియో పంచుకున్న కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు. హరితహారం కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ పరిధిలోని 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, ఓఆర్‌ఆర్‌కు అనుసంధానంగా 19 ఇంటర్ ఛేంజ్‌లను పచ్చనితోరణంగా మార్చిన దృశ్యాలు ఇందులో కనువిందు చేస్తున్నాయి. ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా, మధ్యలో నాటిన మొక్కలు చిగురులు తొడిగి పచ్చగా కలకలలాడుతున్నాయి. 

6. Alpha-Beta: ఒకే మహిళలో రెండు వేరియంట్లు..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి ఒక్కోవ్యక్తిలో ఒక్కో విధమైన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్లు విస్తృత వ్యాప్తి, ఎక్కువ ప్రభావం కలిగి ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో ఓ మహిళలో ఓకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్లు వెలుగు చూడడం కలకలం రేపుతోంది.

7. Padma Awards: అలాంటి వారిపేర్లు పంపండి: మోదీ
పద్మ అవార్డుల కోసం నామినేషన్లు పంపాలని ప్రధాని మోదీ ప్రజలను ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. మారుమూల ప్రాంతాల్లో వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న వారిని గుర్తించి పద్మ అవార్డులకు సిఫార్సు చేయాలని కోరారు. ‘‘భారత్‌లో ప్రతిభ గలవారు అనేక మంది ఉన్నారు. వారంతా క్షేత్రస్థాయిలో విశేష సేవలందిస్తున్నారు. కానీ, వారి గురించి మనం పెద్దగా పట్టించుకోం. అలాంటి వారు మీకు తెలుసా? వారిని మీరు పద్మ అవార్డులకు నామినేట్‌ చేయొచ్చు’’ అని మోదీ రాసుకొచ్చారు.

8. Covid: థర్డ్‌వేవ్‌కు బలమైన సంకేతాలు మొదలు..!

మళ్లీ అదే తప్పు చేస్తున్నాం.. గతంలో కొవిడ్‌ తొలి దశ మందగించాక.. అన్ని ఆర్థిక కార్యకలాపాలు మొదలు పెట్టాం. అదే సమయంలో ప్రజలు కొవిడ్‌ ప్రొటోకాల్‌ను గాలికొదిలేశారు. ఫలితంగా ఉప్పెనలా సెకండ్‌ వేవ్‌ విరుచుకుపడి లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. అంత భయంకరమైన పరిస్థితులు చూసినా జనాల్లో మార్పు రాలేదు. ఒక్కసారి కేసులు తగ్గగానే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

9. UP: జనాభా పెరుగుదలతో ఎన్నో సమస్యలు: యోగి

సమాజంలో అసమానతలు ఏర్పడడంతో పాటు ప్రజలు ఎదుర్కొనే ఎన్నో ప్రధాన సమస్యలకు జనాభా పెరుగుదలే కారణమని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో జనాభా నియంత్రణకు రూపొందించిన నూతన విధాన వివరాలను వెల్లడించిన ఆయన.. 2026 నాటికి రాష్ట్రంలో జనన రేటును ప్రతి వెయ్యి జనాభాకు 2.1శాతానికి తగ్గించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

10. RRR: తీపి కబురు వినిపించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

సినిమా ప్రియులకు ‘ఆర్‌ఆర్‌ఆర్’ బృందం ఓ తీపి కబురు వినిపించింది. ఈ క్రేజీ ప్రాజెక్టును ఎలా చిత్రీకరించారో చూడాలనుకునే వాళ్లకి ఓ సర్‌ప్రైజ్‌ అందించనుంది. ‘రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌’ పేరుతో మేకింగ్‌ వీడియో గ్లింప్స్‌ని జులై 15న ఉదయం 11 గంటలకి విడుదల చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని