Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Updated : 10 Oct 2021 17:06 IST

1. ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్‌

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 3 గంటల వరకు కొనసాగింది. పోలింగ్‌ సమయం పూర్తైన తర్వాత అప్పటికే క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. మా ఎన్నికల్లో 600కు పైగా ఓట్లు పోలైనట్లు అంచనా. గతంలో పోల్చితే ఈసారి పోలింగ్‌ శాతం పెరిగింది. 

MAA Elections: లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

2. న్యాయవృత్తి టీ20 అంత సులభం కాదు: ఏపీ సీజే

న్యాయవృత్తి టీ20 అంత సులభం కాదని టెస్టు క్రికెట్‌లా సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడే ఓపిక ఉండాలని ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి అన్నారు. బదిలీపై ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుకు వెళుతున్న ఆయనకు సహచర న్యాయమూర్తులు, బార్‌ కౌన్సిల్‌ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలో వివక్షకు గురవుతున్న చాలా మందికి వాళ్ల హక్కుల గురించి తెలియని పరిస్థితి ఉందన్నారు.

3. ప్రత్యేక బస్సులకు అదనపు ఛార్జీల్లేవు: సజ్జనార్‌

దసరా పండుగ సందర్భంగా నడిపే బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. గడిచిన ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల మంది ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిందన్నారు. ప్రయాణికుల సౌకర్యం, వారి భద్రతే ధ్యేయంగా ఆర్టీసీ సేవలు అందిస్తోందని వెల్లడించారు

4. కడప నుంచి ఫ్లైట్స్‌ పునరుద్ధరణకు చర్యలు చేపట్టండి: చంద్రబాబు

కడప నుంచి ఇతర ప్రాంతాలకు విమాన సర్వీసులు పునరుద్ధరించేందుకు ఏపీ సీఎం జగన్‌ చర్యలు తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు. అందరికీ విమానయానం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ ‘ఉడాన్‌’ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో టైర్‌-2, టైర్‌-3 నగరాల మధ్య విమాన సర్వీసులుఏర్పాటు చేసినట్లు చంద్రబాబు గుర్తు చేశారు.

5. లఖింపుర్‌ ఖేరి ఘటనపై.. రాష్ట్రపతిని కలిసేందుకు కాంగ్రెస్‌ సిద్ధం!

లఖింపుర్‌ ఖేరి ఘటనకు సంబంధించిన వాస్తవాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వివరించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల బృందం రాష్ట్రపతిని కలవనున్నట్లు తెలిపింది. ఇందుకోసం అనుమతి కోరుతూ రాష్ట్రపతి భవన్‌ తాజాగా లేఖ రాసింది. మరోవైపు లఖింపుర్‌ ఖేరి ఘటనను రెండు వర్గాల మధ్య యుద్ధంగా మార్చే ప్రయత్నం జరుగుతోందంటూ భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు కథనాలు అనైతికమైనవి, అత్యంత ప్రమాదకరమైనవి అన్నారు

6. దేశంలో విద్యుత్‌ సంక్షోభం.. అవన్నీ అనవసర భయాలే..!

దేశంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడడంతో విద్యుత్‌ సంక్షోభం ఎదుర్కోబోతున్నట్లు వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. విద్యుత్‌ సంక్షోభంపై అనవసర భయాందోళనలు సృష్టించబడ్డాయని స్పష్టం చేసింది. కేవలం గెయిల్ (GAIL), డిస్కం సంస్థల మధ్య సమాచారలోపం వల్లే ఇలాంటివి ఏర్పడినట్లు పేర్కొంది. 

పార్లమెంటు పాత భవనం సురక్షితం కాదు

7. 13వ విడత భారత్‌-చైనా కోర్‌కమాండర్స్ భేటీ

సరిహద్దు వివాదంపై చర్చించేందుకు భారత్‌-చైనా సైనిక జనరల్స్‌ నేడు భేటీ అయ్యారు. వీరి సమావేశం తూర్పు లద్దాఖ్‌లోని ఎల్‌ఏసీకి చైనా వైపు మాల్డో బోర్డ్‌ పోస్టు వద్ద జరుగుతోంది. ఈ వివాదంపై ఇరు దేశాల సైనికాధికారులు భేటీ అవ్వడం ఇది 13వ సారి. నేటి ఉదయం 10.30కు ఈ చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చల్లో 14వ కోర్‌కు కమాండర్‌గా వ్యవరిస్తున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మేనన్‌ భారత్‌ తరపున పాల్గొన్నారు. ఇటీవల చైనా బలగాలు భారత్‌లో చొరబాట్లకు ప్రయత్నించడంపై ఈ చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉంది.

8. రష్యాలో కూలిన విమానం.. 19 మంది దుర్మరణం

రష్యాలో తేలికపాటి విమానం కూలిపోయింది. తతర్‌స్థాన్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 19 మంది మరణించారు. ప్రమాద సమయంలో విమానంలో 22 మంది ఉన్నారు. వీరిలో 19 మరణించగా.. ముగ్గురు గాయపడినట్లు సమాచారం. రష్యాకు చెందిన ఎల్‌-410 తేలికపాటి విమానం 20 మంది స్కైడైవింగ్‌ క్లబ్‌ సభ్యులు, ఇద్దరు సిబ్బందితో బయల్దేరింది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. రష్యాకు చెందిన అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.

9. 72 ఐపీఓలు.. రూ.72.87 వేల కోట్ల సమీకరణ!

భారత్‌లో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఐపీఓల శకం నడుస్తోంది. భారత్‌లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 72 కంపెనీలు ఐపీఓకి రాగా.. 9.7 బిలియన్‌ డాలర్లు సమీకరించాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈవై తెలిపింది. ఒక సంవత్సరంలో తొలి తొమ్మిది నెలల్లో ఐపీఓల ద్వారా ఈ స్థాయిలో నిధులు సమీకరించడం గత రెండు దశాబ్దాల్లో ఇదే అత్యధికమని పేర్కొంది.

10. సురేశ్ రైనా మ్యాచ్‌ విన్నర్‌.. అతడుంటే చెన్నై ఫైనల్స్‌ చేరగలదు: గావస్కర్ 

దిల్లీ క్యాపిటల్స్‌తో ఈరోజు జరగనున్న తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో చెన్నై కీలక బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనాను ఆడించాలని టీమ్‌ఇండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ‘రైనా మ్యాచ్‌ విన్నర్‌. దిల్లీ జట్టులో ఆన్‌రిచ్‌ నోర్జే, కగిసో రబాడ, అవేశ్‌ ఖాన్‌ లాంటి పేసర్లు రైనాను ఇబ్బంది పెట్టడానికి చూస్తారు. అయినా, ధోనీసేన అతడిని తుది జట్టులోకి తీసుకోవాలి. ఎందుకంటే రైనాను తీసుకోవడం వల్ల ఆ జట్టు ఫైనల్స్‌ చేరే అవకాశం ఉంటుంది’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని