Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 27 Feb 2022 16:58 IST

1. ‘ఉక్రెయిన్‌ సంక్షోభానికి అమెరికానే మూల కారణం’

ఉక్రెయిన్‌ సంక్షోభానికి అమెరికానే మూల కారణమని ఉత్తర కొరియా తాజాగా ఆరోపించింది. ఈ మేరకు తన విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో ఓ పోస్ట్‌ను అప్‌లోడ్‌ చేసింది. తన భద్రత కోసం రష్యా చట్టబద్ధమైన డిమాండ్‌ను పట్టించుకోకుండా అగ్ర రాజ్యం సైనిక ఆధిపత్యాన్ని అనుసరించిందని ‘నార్త్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ స్టడీ’లో పరిశోధకుడైన రి జి సాంగ్‌కి చేసిన వ్యాఖ్యానాన్ని ఆ పోస్టులో ప్రస్తావించింది.

తాళ్లే ఆధారం.. మంచు శిఖరమే గమ్యస్థానం

2. కీలక నగరాల్లోకి అడుగుపెట్టిన రష్యా సేనలు

రష్యా సేనలు ఉక్రెయిన్‌లోని కీలక నగరాల్లోకి అడుగుపెట్టాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ అధికారిక వర్గాలే ధ్రువీకరించాయి. ఖర్కీవ్‌, నోవా కఖోవ్‌కాల్లోకి ప్రవేశించాయి. ఖర్కీవ్‌లో పోరాటం జరుగుతుండగా.. నోవా కఖోవ్‌కా నగరాన్ని మాత్రం పూర్తిగా ఆధీనంలోకి తీసుకొన్నాయి. ఖర్కీవ్‌.. ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరం.

3. క్షిపణులు ఎగురుతున్న చోట చర్చలా?

బెలారస్‌లోని గోమెల్‌ నగరంలో శాంతి చర్చలకు సిద్ధమంటూ రష్యా చేసిన ఆఫర్‌ను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించారు. బెలారస్‌లోని పలు ప్రాంతాల నుంచీ రష్యా దాడులు చేస్తోందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తమపై విరుచుకుపడని దేశాల్లో మాత్రమే చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. పోలండ్‌ రాజధాని వార్సా, టర్కీలోని ఇస్తాంబుల్‌, అజర్‌బైజాన్‌ రాజధాని బకూ వంటి ప్రాంతాలు చర్చలకు అనువైనవిగా ఆయన పేర్కొన్నారు.

అదే రష్యాకు అసలైన సవాల్‌..!

4. స్వదేశానికి 709 మంది భారతీయులు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చే ప్రక్రియలో భాగంగా.. హంగరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి 240 మందితో బయలుదేరిన ఎయిర్ ఇండియా మూడో విమానం దిల్లీకి చేరింది. ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి భారత్‌కు 709 మంది చేరుకున్నారు. భారత్ నుంచి రొమేనియాకు రెండు విమానాలు పంపగా.. 219 మందితో శనివారం తొలి విమానం ముంబయి చేరుకుంది. 

5. పరిస్థితులు బాగోలేవు.. ఉక్రెయిన్‌లోనే ఉండండి: చైనా

ఉక్రెయిన్‌లో ఉన్న వారిని తరలించడం ఇప్పుడు అంత సురక్షితం కాదని ఆ దేశంలో ఉన్న తమ పౌరులకు చైనా రాయబారి ఫ్యాన్‌ షియాన్‌రాంగ్‌ తెలిపారు. పరిస్థితులు చక్కబడే వరకు వేచి ఉండాలని కోరారు. ఈ మేరకు వీచాట్‌లో ఓ సుదీర్ఘ వీడియోను ఆదివారం పోస్ట్‌ చేశారు. తాను ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను వదిలి వెళ్లానని.. చైనీయులు అక్కడే చిక్కుకుపోయారని ఆన్‌లైన్‌లో వస్తున్న వార్తల్ని ఫ్యాన్‌ తిప్పికొట్టారు.

6. ఆ రెండు సినిమాలు ఎంతో.. ‘భీమ్లానాయక్‌’ అంతే: కొడాలి నాని

శత్రువులు, మిత్రుల గురించి కాకుండా ప్రజల గురించే సీఎం జగన్‌ ఆలోచిస్తారని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. అధికారం ఇచ్చిన ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలనే దిశగానే ఆయన పనిచేస్తుంటారని చెప్పారు. సినిమాలన్నింటికీ ఒకే రకమైన షరతులు ఉంటాయన్నారు. తమకు ‘అఖండ’, ‘బంగార్రాజు’ చిత్రాలు ఎంతో.. ‘భీమ్లా నాయక్‌’ కూడా అంతేనని స్పష్టం చేశారు.

చిత్రపరిశ్రమను ఇబ్బందులకు గురి చేస్తూ.. ప్రోత్సహిస్తున్నామంటే ఎలా నమ్మాలి?

7. ఐఎన్‌ఎస్‌ విశాఖను జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌

బహుళ దేశాల నౌకాదళ విన్యాస (మిలాన్‌-22) కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం విశాఖ విచ్చేశారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం విశాఖ చేరుకున్న సీఎం... నేరుగా తూర్పు నౌకాదళ కేంద్రానికి వెళ్లారు. నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఐఎన్‌ఎస్‌ -విశాఖ నౌకను జాతికి అంకితం చేశారు. 

8. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరిన చేవెళ్ల ఎంపీ

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేవెళ్ల నుంచి పోటీ చేయాలని తెరాస ఎంపీ రంజిత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. నిన్న పరిగిలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మన ఊరు- మన పోరు’ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి తెరాస నేతలపై  చేసిన విమర్శలను రంజిత్‌రెడ్డి ఖండించారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవుపలికారు. తాను కోడిగుడ్ల వ్యాపారం చేస్తే తప్పా? అని ప్రశ్నించారు.

9. ట్రంప్‌ నోట అదేమాట.. పుతిన్‌ ఈజ్‌ స్మార్ట్‌..!

సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తోన్న రష్యాపై ప్రపంచాధినేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతిచర్యగా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నారు. అయినప్పటికీ అమెరికా మాజీ అధ్యక్షుడు మాత్రం రష్యా అధినేతను పొగడ్తలతో ముంచెత్తుతూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఓ బహిరంగ సమావేశంలో పుతిన్‌ తెలివైనవాడంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ప్రశంసించారు.

10. మరోసారి అరెస్టు చేసేందుకు మఫ్టీలో పోలీసులు: రఘురామ

వైకాపా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించిన తనపై సీఎం జగన్‌ నిఘా పెట్టించారని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. మరోసారి తనను అరెస్టు చేసేందుకు హైదరాబాద్‌లోని ఇంటి వద్ద మఫ్టీలో పోలీసులను పెట్టారన్నారు. పవన్‌ కల్యాణ్‌ సినిమా ‘భీమ్లా నాయక్‌’ను దెబ్బతీసేందుకు కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని