Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Published : 17 Apr 2022 16:59 IST

1. నెల్లూరు కోర్టులో చోరీ.. పాత సామాన్ల దొంగల పనే: ఎస్పీ విజయరావు

నెల్లూరు కోర్టు సముదాయంలో జరిగిన చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేశామని జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాలు సహా పూర్తి ఆధారాలతో కేసును ఛేదించామని చెప్పారు. దొంగలు కోర్టులో సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు తీసుకుని మిగతా పేపర్లను పడేశారని తెలిపారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు దర్యాప్తు వివరాలను ఎస్పీ వెల్లడించారు. 

ఈత చెట్టెక్కిన బండి సంజయ్‌

2. నెల్లూరు వైకాపాలో మరింత ముదిరిన వర్గపోరు.. వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు!

ఇటీవల మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణతో నెల్లూరు వైకాపాలో మొదలైన వర్గపోరు మరింత ముదిరింది. మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ వ్యవహారశైలి రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఈరోజు తొలిసారి జిల్లాకు వస్తుండగా.. అదే సమయంలో కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించేందుకు అనిల్‌ ఏర్పాట్లు చేయడంతో నెల్లూరు నగరంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. 

3. తెలంగాణలో 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు!

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. 

కొత్త జంటకు కొవ్వొత్తులు, విసనకర్రల బహుమతి

4. ఆహ్వానాలు అందినవారే ఆవిర్భావ సభకు రావాలి: కేటీఆర్‌

నగరంలోని హెచ్ఐసీసీ వేదికగా ఈనెల 27న జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానాలు అందిన ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరుకావాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మిగతా శ్రేణులు ఆరోజు గ్రామాలు, పట్టణాల్లో తెరాస జెండాలు ఆవిష్కరించాలని కోరారు. తెరాస ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌తో కలిసి కేటీఆర్‌ పరిశీలించారు.

5. 3 రోజుల్లో దేశం దాటిన ₹4500 కోట్లు!

అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్ల పెంపును వేగంగా చేపట్టనుందన్న సంకేతాల నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (FPI) అప్రమత్తమయ్యారు. గతవారం భారత స్టాక్‌ మార్కెట్ల నుంచి రూ.4,500 కోట్లు విలువ చేసే స్టాక్స్‌ను విక్రయించి నికర విక్రేతలుగా నిలిచారు. రెండు రోజుల వరుస సెలవుల కారణంగా మార్కెట్లు కేవలం గతవారంలో మూడు రోజులు మాత్రమే పనిచేశాయి. 

6. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 40లక్షల భారతీయులు మృతి..!

కరోనా విజృంభణ సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దేశంలో 40లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ప్రపంచ వ్యాప్త కొవిడ్‌ మరణాలను బహిర్గతం చేయాలన్న డబ్ల్యూహెచ్‌వో ప్రయత్నాలకు భారత్‌ అడ్డుపడుతోందంటూ ‘న్యూయార్క్‌ టైమ్స్‌’లో ప్రచురితమైన కథానాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసిన రాహుల్‌ గాంధీ.. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

వేసవికాలంలో పాటించాల్సిన జాగ్రత్తలు..

7. సరిహద్దులకు సమీపంలో చైనా మొబైల్‌ టవర్లు..!

వాస్తవాధీన రేఖ వద్ద చైనా వేగంగా నిర్మాణాలు చేపడుతోంది. తాజాగా పాంగాంగ్‌ సరస్సుపై చేపట్టిన అక్రమ వంతెన నిర్మాణం తుది దశకు చేరింది. మరో వైపు  మూడు మొబైల్‌ టవర్లను కూడా ఎల్‌ఏసీ వద్ద ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ విషయాన్ని చుషూల్‌ కౌన్సిలర్‌ కొంచెక్‌ స్టాంజిన్‌ వెల్లడించారు. ‘‘ చైనా దళాలు పాంగాంగ్‌ సరస్సుపై వంతెన నిర్మాణం తర్వాత హాట్‌స్ప్రింగ్స్ వద్ద మూడు మొబైల్‌ టవర్లను నిర్మించాయి’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

8. గావస్కర్‌, కృష్ణమాచారి.. రవిశాస్త్రి ఫేవరెట్‌ బ్యాటింగ్‌ పార్ట్‌నర్‌ ఎవరంటే?

టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి తాజాగా తన ఫేవరెట్‌ బ్యాటింగ్‌ భాగస్వామి పేరు వెల్లడించాడు. 1983 ప్రపంచకప్‌ విజేత జట్టులోని ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల పేర్లను తన ముందు ఉంచితే ఒకర్ని మాత్రమే ఎంచుకున్నాడు. ఓ క్రీడాఛానల్‌తో ముచ్చటించిన సందర్భంగా..‘కృష్ణమాచారి శ్రీకాంత్‌, సునీల్‌ గావస్కర్’ ఇద్దరి మధ్యా ఎవరితో ఎక్కువ బ్యాటింగ్‌ చేయడం ఎంజాయ్‌ చేశారు’ అని శాస్త్రిని అడగ్గా.. గావస్కర్‌ పేరు చెప్పాడు.

Web Stories: చిత్రం చెప్పే విశేషాలు..!

9. మేరియుపొల్‌లో పరిస్థితి అమానవీయం

‘మాస్క్‌వా’ యుద్ధ నౌక నీట మునిగిన ఘటనతో తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొంటున్న రష్యా.. ఉక్రెయిన్‌ నగరాలపై మళ్లీ దాడులను ముమ్మరం చేసింది. ముఖ్యంగా కీవ్‌తోపాటు మేరియుపొల్‌ వంటి నగరాలపై క్షిపణి దాడులతో తెగబడుతోంది. ఈ నేపథ్యంలో వేల మంది సామాన్యులు చిక్కుకుపోయిన మేరియుపొల్‌ నగర ప్రజలను రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

10. కీవ్‌లోని సైనిక కర్మాగారాన్ని ధ్వంసం చేశాం: రష్యా

ఉక్రెయిన్‌పై పోరును రష్యా మరింత తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే పలు నగరాలను సర్వనాశనం చేసిన మాస్కో సేనలు.. ఇప్పుడు మళ్లీ రాజధాని కీవ్‌పై దృష్టి సారించాయి. ఉక్రెయిన్‌ సైన్యం తమపై దాడులకు పాల్పడుతోందని రెండు రోజుల క్రితం ఆరోపించిన రష్యా దీనికి ప్రతీకారం తీర్చుకోక తప్పదని బెదిరించిన విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే కీవ్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. కీవ్ వెలుపల సైనిక కర్మాగారంపై తాజాగా దాడి చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని