Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Published : 25 Apr 2022 16:55 IST

1. యాదాద్రి శివాలయ ఉద్ఘాటనలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయం ఉద్ఘాటన మహాక్రతువును వైభవంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ సతీసమేతంగా ఈ క్రతువులో పాల్గొన్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయ ఉద్ఘాటనకు ఐదు రోజులుగా ఆగమశాస్త్ర రీత్యా మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించిన విషయం తెలిసిందే. 

ఈడీ విచారణకు సహకరిస్తాం: ఎక్సైజ్‌ డైరెక్టర్‌ సర్ఫరాజ్

2. ఏ ప్రాతిపదికన ఇలా చేశారు?.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ధార్మిక పరిషత్‌లో సభ్యుల సంఖ్యను తగ్గించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించింది. ధార్మిక పరిషత్‌లో సభ్యుల సంఖ్యను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ పాలెపు శ్రీనివాసులు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. 

3. పీకేను కాంగ్రెస్‌లో చేర్చుకుంటారా.. లేదా..?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైన సమయంలో తెరాసతో పీకే భేటీ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో ప్రశాంత్‌ కిశోర్‌ చేరిక, ఆయనకు అప్పగించాల్సిన బాధ్యతలపై ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. పీకేను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలా..? పార్టీ పునరుద్ధరణకు ఆయన చేసిన ప్రతిపాదనలను అంగీకరించాలా వద్దా..? అన్నదానిపై సీనియర్లు చర్చించినట్లు సమాచారం.

Video: కాళ్లలో వాపులు కనిపిస్తున్నాయా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

4. తెరాసతో తెగదెంపులకే కేసీఆర్‌తో పీకే భేటీ: రేవంత్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌తో ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్‌ సారథి ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) భేటీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెరాసతో తెగదెంపులు చేసుకునేందుకే పీకే కేసీఆర్‌ను కలిశారని చెప్పారు. ఇక తెరాస, ఐప్యాక్‌తో పీకేకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. తాను ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రాష్ట్రానికి వచ్చి తనతో ఉమ్మడి ప్రెస్‌మీట్‌ పెట్టే రోజు దగ్గర్లోనే ఉందని రేవంత్‌ చెప్పారు.

5. కమిటీ నివేదిక తర్వాతే పీకే విషయంలో నిర్ణయం: భట్టి విక్రమార్క

రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్‌ కిశోర్ విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఒక కమిటీ వేసిందని.. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. భాజపా ఎప్పుడూ తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంటుందని.. కాంగ్రెస్‌లో ఎవరూ ఎలాంటి గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదన్నారు. 

Video: ‘సర్కారు వారి పాట’.. ఫ్యాన్స్‌కు పండగే పండగ: ప్రకాశ్‌

6. 800 మందిపై అత్యాచారాలు జరిగితే ఒక్కరికీ న్యాయం చేయలేదు: చంద్రబాబు

మహిళలపై నేరాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని.. 800 మందిపై అత్యాచారాలు జరిగితే ఒక్కరికీ న్యాయం చేయలేదని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. పార్టీ ముఖ్యనేతలతో తెదేపా అధినేత చంద్రబాబు వ్యూహకమిటీ సమావేశం నిర్వహించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. ప్రభుత్వ వైఫల్యంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని ప్రణాళికలు సిద్ధం చేయాలని సమావేశంలో తీర్మానించారు. 

7. పీకే వ్యూహాలు తెలంగాణలో వర్కవుట్‌ కావు: లక్ష్మణ్‌

దేశంలో ఎన్నిపార్టీలు ఏకమైనా ప్రధాని మోదీని ఏమీ చేయలేరని.. మూడోసారి కూడా కేంద్రంలో భాజపాదే అధికారమని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే), సీఎం కేసీఆర్‌ వ్యూహాలు తెలంగాణలో వర్కవుట్‌ కావని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

దేశంలో కరోనా నాలుగో వేవ్ ప్రవేశించిందా?

8. ‘మా ప్రభుత్వాన్ని రద్దుచేసిన మర్నాడే.. ‘వాంఖడే’లో క్రికెట్‌ మ్యాచ్‌ ఎంజాయ్‌ చేశాం’!

మత ప్రదేశాల్లో లౌడ్‌ స్పీకర్లు, హనుమాన్‌ చాలీసా పఠనం వంటి వ్యవహారాలపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌ భాజపాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోయాక కొందరు వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. సోమవారం పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పవార్‌.. అక్కడ మీడియాతో మాట్లాడారు. 

9. వీసీల నియామకాలకు తమిళనాడు కొత్త బిల్లు.. గవర్నర్ అధికారాల్లో కోత..!

విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్శిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి సోమవారం ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు.

10. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని రష్యా పట్టణంలో భారీ పేలుడు

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని రష్యా నగరం బ్రయాన్స్క్‌లో సోమవారం తెల్లవారుజాము భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో చమురు డిపో ఉంది. ఆ ప్రాంతంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. రష్యాలోని చమురు సరఫరా కంపెనీ ట్రాన్స్‌నెఫ్ట్‌కు సంబంధించిన పైప్‌లైన్లు కూడా అక్కడ ఉన్నట్లు భావిస్తున్నారు.

 యుద్ధ లక్ష్యాల్లో రష్యా విఫలం.. ఉక్రెయిన్‌దే విజయం..! 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని