Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Updated : 28 Apr 2022 17:06 IST

1. పేదలకు మంచి చేద్దామంటే అడ్డుకుంటున్నారు: జగన్‌

‘‘పేదలకు మంచి చేద్దామంటే ప్రతిపక్షాలు, మీడియా అడ్డుకుంటున్నాయి. పేదల ఇళ్లు, ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలు, మూడు రాజధానులు సహా అన్నింటికీ అడ్డంకులు సృష్టిస్తున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు కూడా రానివ్వకుండా అడ్డు తగులుతున్నారు’’ అని సీఎం జగన్‌ అన్నారు. ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా పైడివాడ అగ్రహారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ మేరకు సీఎం మాట్లాడారు.

Video: వాటర్‌ ప్యాకెట్లలో నీరు సురక్షితమేనా..?

2. జన్వాడ ఫాంహౌస్‌పై వాస్తవాన్ని ప్రజాకోర్టు తేల్చాలి: రేవంత్‌రెడ్డి

జన్వాడ ఫాంహౌస్‌ కేసులో హైకోర్టు తీర్పుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘‘జన్వాడ ఫాంహౌస్‌ డ్రోన్ కేసులో కేటీఆర్‌కు హాని తలపెట్టానని నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఫాంహౌస్‌లో కేటీఆర్ ఉంటున్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. జన్వాడ ఫాంహౌస్‌ తనది కాదని కేటీఆర్‌ కోర్టులో చెప్పారు. కేటీఆర్‌ వాదనకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. జన్వాడ ఫాంహౌస్‌పై వాస్తవాన్ని ప్రజాకోర్టు తేల్చాలి’’ అని  ట్వీట్‌ చేశారు.

3. తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Video: కోకాకోలాపై ఎలాన్‌ మస్క్‌ కన్ను!

4. తాండూరు తెరాసలో ‘పొలిటికల్‌ హీట్‌’

వికారాబాద్‌ జిల్లా తాండూరులో సీఐ రాజేందర్‌రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం అక్కడి తెరాస రాజకీయాల్లో మరింత ‘హీట్‌’ పుట్టించింది. ఈ విషయంలో అధికార పార్టీకే చెందిన మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి పరస్పరం విమర్శలు చేసుకున్నారు. మరోవైపు సీఐపై మహేందర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు కూడా నమోదైంది.

5. ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు కన్నుమూత

బాలాజీ హేచరీస్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. పశు వైద్యుడిగా వృత్తిని ప్రారంభించిన ఆయన.. కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి అపార కృషి చేశారు. ఉమ్మడి ఏపీలో తొలితరం పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. ఏపీ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

కిడ్నీలపై షుగర్‌ దాడి.. డయాబెటిక్‌ నెఫ్రోపతి

6. రేవంత్‌ కార్యక్రమానికి హాజరుకావడం లేదు: కోమటిరెడ్డి

నల్గొండలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రేపు తలపెట్టిన కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. తన నియోజకవర్గంలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నందున వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పటిష్ఠంగా ఉందని.. వేరే నేత వచ్చి సమీక్ష జరపాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ బలహీనంగా ఉన్నచోట సమావేశాలు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. 

7. ‘వెంటనే సీఎం పదవి ఇస్తారా లేదా?’

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మరో కుదుపు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్‌ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లేదంటే పంజాబ్‌లో మాదిరిగానే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని చెప్పినట్లు తెలుస్తోంది. 

8. పసిడికి ‘ధరా’ఘాతం.. 18శాతం తగ్గిన గిరాకీ

అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల కారణంగా ఇటీవల పసిడి ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే, ఇది విక్రయాలపై ప్రభావం చూపించింది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో దేశంలో బంగారం గిరాకీ 18శాతం తగ్గింది. ఈ మేరకు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) గురువారం వెల్లడించింది. 2022 తొలి త్రైమాసికంలో బంగారం డిమాండ్‌ ట్రెండ్‌పై డబ్ల్యూజీసీ నివేదిక విడుదల చేసింది. 

9. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం పదేళ్లు కొనసాగొచ్చు..!

రెండు నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధం 10 సంవత్సరాల పాటు కొనసాగొచ్చంటూ యూకే విదేశాంగ సెక్రటరీ లిజ్‌ ట్రస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ దాడిలో పుతిన్ విజయం సాధిస్తే.. ఐరోపాలో భయంకరమైన దుస్థితి, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

10. జాతీయ భాషపై చర్చ.. పార్టీలతో సంబంధం లేకుండా సుదీప్‌కు మద్దతు

కన్నడ స్టార్ సుదీప్‌, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌ల మధ్య జాతీయ భాషపై జరిగిన చర్చ విషయంలో కర్ణాటక నేతలు స్పందిస్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్‌ బొమ్మై సహా ప్రముఖ నాయకులందరూ సుదీప్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ‘భాషల వల్లే రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇచ్చారు. సుదీప్ అన్న మాటలు సరైనవే. అందరూ వాటిని గౌరవించాలి’ అంటూ బొమ్మై అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు