Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం...

Updated : 05 May 2022 17:02 IST

1. ఆ స్కూల్స్‌ నుంచే పదోతరగతి పేపర్ల లీక్‌: సీఎం జగన్‌

రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేసేందుకే పదో తరగతి పేపర్లు లీక్‌ చేస్తున్నారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నారాయణ, శ్రీచైతన్య స్కూల్స్‌ నుంచే పేపర్ల లీకులు అయ్యాయని చెప్పారు. తిరుపతిలో ‘జగనన్న విద్యాదీవెన’ నిధులను సీఎం విడుదల చేశారు. గత ప్రభుత్వాలేవీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదని.. ఇప్పుడు తాము ఇస్తున్నామని చెప్పారు. ఇవన్నీ తట్టుకోలేకే తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

2. తెలంగాణ, మహారాష్ట్రలో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర..!

దేశవ్యాప్తంగా పలు చోట్ల భీకర పేలుళ్లకు ముష్కరులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు తెలంగాణకు తరలించేందుకు యత్నించిన నలుగురు ఖలీస్థానీ ఉగ్రవాదులను ఈ ఉదయం అరెస్టు చేశారు. వీరికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ, పంజాబ్‌, హరియాణా పోలీసులు సంయుక్త అంతర్రాష్ట్ర ఆపరేషన్‌ చేపట్టారు.

ఉక్రెయిన్‌ సైన్యం సెల్ఫ్‌ గోల్‌.. చమురు క్షేత్రం బుగ్గిపాలు..!

3. విశాఖలో చంద్రబాబు పర్యటన.. ఎండాడ వద్ద అడ్డుకున్న పోలీసులు

తెదేపా అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం విశాఖ నగరంలో పర్యటిస్తున్న ఆయన.. రుషికొండ వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అనుమతి నిరాకరించారు. రుషికొండలోని హరిత రిసార్ట్స్‌ పరిశీలనకు బయల్దేరగా ఎండాడ జంక్షన్‌ వద్ద చంద్రబాబు బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై తెదేపా అధినేత వాహన శ్రేణిని నిలిపేశారు.

4. యాదాద్రి నిర్మాణంలోనూ కేసీఆర్‌ కుటుంబం అవినీతి: రేవంత్‌

ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ఆస్తుల విలువ నిజాం వారసుల సంపదను మించిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతికి అడ్డేలేకుండా పోయిందని విమర్శించారు. గాంధీ కుటుంబంపై ప్రజా గాయకుడు గద్దర్ రూపొందించిన ‘జనం వాయిస్’ దృశ్య కావ్యాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 

5. దుగ్గిరాల ఎంపీపీగా వైకాపా అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక

ఎంతో ఉత్కంఠ రేపిన గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక పూర్తయింది. వైకాపా అభ్యర్థి దానబోయిన రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. ఈ పదవికి ఒకే నామినేషన్‌ వచ్చిందని.. ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ధ్రువపత్రాన్ని రూపవాణికి అందజేశారు.

కుటుంబసమేతంగా చూడదగ్గ థ్రిల్లర్‌..‘భళా తందనాన’: శ్రీవిష్ణు

6. వాజేడులో సీఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ ఆత్మహత్య

ములుగు జిల్లా వాజేడులో సీఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ ఠాక్రే ఆత్మహత్య చేసుకున్నారు. క్యాంపులో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. 1986 బ్యాచ్‌ 39వ బెటాలియన్‌కు చెందిన ఠాక్రె స్వస్థలం మహారాష్ట్రలోని గడ్చిరోలి. ఎస్‌ఐ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.

7. టాటా మోటార్స్‌ నుంచి ఏస్‌ EV... సింగిల్‌ ఛార్జ్‌తో 154 కిలోమీటర్లు

దేశీయ ఆటో మొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ (Tata Motors) తన ఎలక్ట్రిక్‌ వాహన శ్రేణిని విస్తరించుకుంటూ పోతోంది. తాజాగా బాగా ప్రాచుర్యం పొందిన ఏస్‌ మినీ ట్రక్‌.. ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. టాటా ఏస్‌ మినీ ట్రక్‌ను లాంచ్‌ చేసిన 17 ఏళ్ల తర్వాత ఏస్‌ ఎలక్ట్రిక్‌ (Tata Ace EV) వెహికల్‌ను లాంచ్‌ చేసింది. ప్రస్తుతానికి దీని ధరను కంపెనీ వెల్లడించలేదు. వచ్చే త్రైమాసికం నుంచి వీటి డెలివరీలు ప్రారంభమైనప్పుడు ధరను వెల్లడించనున్నారు.

దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు.. కానీ..

8. ఉక్రెయిన్‌కు అండగా వచ్చిన ఆ దేవదూత ఎవరు..?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మంగళవారం ఓ ఆయుధ తయారీ కర్మాగారానికి వెళ్లారు.. ‘మీ కష్టం వేల మంది ఉక్రెయిన్‌ వాసులకు ఆత్మరక్షణ కవచంలా నిలిచింది’ అని అక్కడి సిబ్బందిని పొగడ్తలతో ముంచెత్తారు. జో బైడెన్‌ మాటల్లో కొంత నిజముంది.. ఉక్రెయిన్‌ వాసులు ఆ ఆయుధాన్ని దేవదూతతో పోలుస్తున్నారు. అదే సమయంలో రష్యా ప్రతిష్ఠను అది ధ్వంసం చేస్తోంది. అదే ‘జావెలిన్‌’ ఏటీజీఎం (యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌)..!

9. పిట్టల్లా రాలుతోన్న రష్యా జనరల్స్‌.. కారణం అదేనా..?

ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతోన్న రష్యా.. అదే స్థాయిలో తన సొంత బలగాలను కోల్పోతోంది. ఉక్రెయిన్‌ సేనలు జరుపుతోన్న ప్రతిదాడుల్లో పదుల సంఖ్యలో రష్యా జనరల్స్‌ వరుసగా ప్రాణాలు కోల్పోవడం పుతిన్‌ సేనలకు మింగుడు పడటం లేదు. ఇంత కచ్చితంగా సైనిక నాయకత్వాన్ని ఉక్రెయిన్‌ సేనలు లక్ష్యంగా చేసుకోవడానికి అమెరికా నిఘా వర్గాలు సహాయం చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అమెరికా వార్తా పత్రికల్లో కథనాలు వెల్లడయ్యాయి.

అఖిల భారత స్థాయి అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్రం..!

10. హై హై ‘నాయకా’.. టీ20 లీగ్‌లో పైచేయి ఎవరిదంటే?

జట్టును నడపడం ఒక్కటే కెప్టెన్‌ కర్తవ్యం కాదు.. వ్యక్తిగతంగా రాణిస్తూ టీమ్‌కు అండగా నిలవాలి. సారథిగా మైదానంలో సరైన ప్రణాళికలను అమలు చేసి ఫలితాలను రాబట్టడంతోపాటు జట్టు సభ్యుల్లో భరోసా నింపేలా ఆడితే తిరుగుండదు. మరి ప్రస్తుత టీ20 లీగ్‌లో పది జట్ల నాయకులు ఎలా ఆడుతున్నారు.. టీమ్‌లను ఏ విధంగా నడిపిస్తున్నారో చూద్దాం.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని