Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 11 May 2022 17:38 IST

1. కేరళలో టమాటో ఫ్లూ.. ఈ వైరస్‌ లక్షణాలేంటీ?

కేరళలో కొత్త రకం వైరస్‌ కలకలం రేపుతోంది. అంతుచిక్కని టమాటో ఫ్లూ కారణంగా అనేక మంది చిన్నారులు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ఈ వైరస్‌ బారిన పడుతున్నారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇప్పటివరకు 80 మందికి పైగా చిన్నారులకు టమాటో ఫ్లూ సోకినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఈ వైరస్‌ సోకిన పిల్లల్లో శరీరంపై చాలా చోట్ల బొబ్బలతో వస్తాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, బలహీనత, డీహైడ్రేషన్‌ వంటి లక్షణాలు ఉంటాయి.

video: ఒకే ఇంట్లో 90 నల్లతాచులు..

2. స్థిరాస్తి వ్యాపారిగా సీఎం కేసీఆర్‌: ఈటల రాజేందర్‌

ధరణి వెబ్‌సైట్‌ రైతుల పట్ల శాపంగా మారిందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. భూదాన్‌, ల్యాండ్ సీలింగ్‌ భూములపై కేసీఆర్‌ కన్ను పడిందని విమర్శించారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రైతులను మోసం చేస్తూ భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. అలా సేకరించిన భూములను ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ స్థిరాస్తి వ్యాపారిగా మారిపోయారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.

3. జగన్‌ పాలనలో తీవ్ర సంక్షోభంలోకి వ్యవసాయ రంగం: అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని.. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని అచ్చెన్నాయుడు విమర్శించారు. 

4. బాలీవుడ్‌ వ్యాఖ్యల దుమారం... స్పందించిన మహేశ్‌ టీమ్‌!

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకి అన్ని భాషలు సమానమేనని ఆయన టీమ్‌ స్పష్టం చేసింది. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘మేజర్‌’ మరికొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం అనంతరం ఓ జాతీయ న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్‌పై మహేశ్‌ చేసిన కామెంట్స్‌ అంతటా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

అసని తుపాను ప్రభావం.. కారు మబ్బుల ప్రకృతి చిత్రం..

5. గడప గడపలో ప్రజాగ్రహం.. మంత్రులకు నిరసన సెగ

‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి నిరసన సెగ ఎదురవుతోంది. కర్నూలు జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరాంను హత్తిబెళగల్‌లో వివిధ అంశాలపై ప్రజలు నిలదీశారు. ఆలూరు- హత్తిబెళగల్‌ ప్రధాన రహదారి ఎప్పుడు నిర్మిస్తారని ప్రశ్నించారు. అలాగే తమకు అమ్మఒడి ఎందుకు ఇవ్వడం లేదని కొందరు మహిళలు మంత్రిని అడిగారు. దీంతో సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు.

6. రిపోర్టింగ్‌ చేస్తుండగా జర్నలిస్టు తలపై తుపాకీతో కాల్చి..

పాలస్తీనా.. ఇజ్రాయెల్‌ మధ్య ఘర్షణలు నానాటికీ తీవ్రంగా మారుతున్నాయి. జెనిన్‌లోని ఆక్రమిత్ వెస్ట్‌ బ్యాంక్‌ పట్టణంలో ఇజ్రాయెల్‌ దళాలు చేపట్టిన దాడుల్లో అల్‌ జజీరాకు చెందిన ఓ ప్రముఖ రిపోర్టర్‌ మృతిచెందారు. అయితే ఆమెను అతి దారుణంగా హత్య చేశారంటూ అల్‌ జజీరా ఆరోపిస్తోంది. పాలస్తీనాకు చెందిన షిరీన్‌ అబు అఖ్లే అల్‌ జజీరా సంస్థలో రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. 

7. కోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌..!

మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కోర్టును ఆశ్రయించారు. 15 రోజుల పాటు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దిల్లీ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. అబుదాబీలో త్వరలో జరగబోయే ఐఫా అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు జాక్వెలిన్‌ ఈ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పాటు నేపాల్‌, ఫ్రాన్స్‌ దేశాలకు కూడా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

‘గబ్బర్‌సింగ్‌’ చేయనన్న పవన్‌కల్యాణ్‌.. టైటిల్‌కు స్ఫూర్తి ఆయనే!

8. చైనా కొవిడ్ జీరో వ్యూహాన్ని వదిలేస్తే.. కేసుల సునామే..!

కరోనా పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనా.. వైరస్ కట్టడికి జీరో కొవిడ్ వ్యూహాన్ని అనుసరిస్తూ, అగచాట్లు పడుతోంది. స్వల్పస్థాయిలో కేసులు వచ్చినా.. కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్‌ విధిస్తుండటంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తున్నారు. ఇప్పుడు గనుక చైనా తన ఈ దీర్ఘకాలిక వ్యూహాన్ని విడిచిపెడితే.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ సునామీలా విజృంభిస్తుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దాని ఫలితంగా 16 లక్షల మరణాలు నమోదవుతాయని అంచనా వేసింది.

9. అటల్‌జీ.. మీ ధైర్యం అమోఘం..!

నేషనల్ టెక్నాలజీ డేను పురస్కరించుకొని ప్రధాని నరేంద్రమోదీ.. శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. 1998లో పొఖ్రాన్‌లో అణు పరీక్షలు విజయంతం కావడానికి దోహదపడిన వారి ప్రతిభను ప్రశంసించారు. అలాగే ఆనాటి సంఘటనల సమాహారమైన వీడియోను షేర్ చేశారు. ‘1998లో పొఖ్రాన్ అణుపరీక్షలు విజయవంతమయ్యేలా వారు చేసిన కృషికి అభినందనలు. ఈ సమయంలో అత్యుత్తమ ధైర్యం, రాజనీతిజ్ఞతను ప్రదర్శించిన అటల్ బిహారీ వాజ్‌పేయీ నాయకత్వాన్ని గర్వంగా స్మరించుకుందాం’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. 

10. అప్పుడు 107 కేజీలు ఉండేవాడిని.. చెన్నై తీసుకుంటుందని అనుకోలేదు: తీక్షణ

చెన్నై జట్టులో నమ్మదగ్గ స్పిన్నర్లలో శ్రీలంక క్రికెటర్‌ మహీశ్ తీక్షణ ఒకడు. పవర్‌ప్లే ఓవర్లలోనూ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయగల సమర్థుడు. అయితే, చెన్నై జట్టులోకి రాకముందు తన కెరీర్‌ ఎలా ఉందో తీక్షణ వివరించాడు. ‘అండర్‌-19 ఆడే సమయంలో 107 కేజీల బరువు ఉండే వాడినని, దీంతో చాలా కష్టపడి బరువు తగ్గించుకున్నా. మరోసారి ఫిట్‌నెస్‌ టెస్టులో ఫెయిల్‌ అయితే వాటర్‌ బాటిల్స్‌ను మోసుకెళ్లాల్సి వస్తుందని అప్పుడే అనుకున్నా. అందుకే ఆత్మవిశ్వాసంతో కృషి ఇలా మీ ముందున్నా’ అని చెప్పాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని