Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 15 May 2022 16:53 IST

1. బ్యాడ్మింటన్‌లో సువర్ణాధ్యాయం.. థామస్‌కప్‌ విజేతగా భారత్

భారత్‌ చరిత్ర సృష్టించింది. చిరస్మరణీయమైన ప్రదర్శనతో థామస్‌కప్‌ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో బలమైన జట్టును ఓడించి బ్యాడ్మింటన్‌లో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. 14సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాపై చారిత్రక విజయాన్ని భారత్‌ నమోదు చేసింది. అద్భుత ఆటతీరులో భారత ఆటగాళ్లు తుదిపోరులో ఇండోనేషియాను ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రత్యర్థి జట్టుపై 3-0 తేడాతో విజయ కేతనాన్ని ఎగరవేశారు.

2. ఇక సినిమాలు చేయను.. రాజకీయాల్లోనే ఉంటా..!

ఇకపై తాను సినిమాలు చేయనని, పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని కోలీవుడ్‌ నటుడు ఉదయనిధి స్టాలిన్‌ ప్రకటించారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘నెంజుకు నిధి’ వేసవి కానుకగా 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ‘ఆర్టికల్‌ 15’కు రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన.. తన కెరీర్‌పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిండు గర్భిణి.. డబ్బుల్లేక 65 కి.మీ నడక.. ఆపై!

3. దిల్లీ అగ్నిప్రమాదం.. 50 మందిని రక్షించిన ఆపద్బాంధవుడు

దేశ రాజధాని దిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 27 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. అయితే, ఆ ప్రమాద సమయంలో ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకోక ముందే ‘ఆపద్బాంధవుడిలా’ వచ్చిన ఓ వ్యక్తి రెస్క్యూ ఆపరేషన్‌ మొదలుపెట్టారు. నిమిషాల వ్యవధిలో భవనం మొత్తం మంటలు వ్యాపించే సరికే దాదాపు 50 నుంచి 55 మందిని రక్షించారు.

4. అబద్ధాల బాద్‌షా.. తెలంగాణకు పనికొచ్చేమాట ఒక్కటీ లేదు: కేటీఆర్‌

తుక్కుగూడలో నిర్వహించిన భాజపా బహిరంగ సభలో కేంద్రహోంమంత్రి అమిత్‌షా చెప్పిన మాటల్లో ఒక్కటీ నిజం లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. పచ్చి అబద్ధాలు, అర్ధసత్యాలు మాట్లాడారని విమర్శించారు. ఆయన అమిత్‌షా కాదని.. అబద్ధాల బాద్‌షా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ అమిత్‌షా చేసిన విమర్శలను తిప్పికొట్టారు.  

అప్పుల లెక్కలు చెప్పలేక సర్కార్‌ సతమతం

5. ‘వడ్డీరేట్లు పెంచడంలో ఆర్‌బీఐ ఆలస్యం చేయలేదు’

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకుగానూ వడ్డీరేట్లను పెంచడంలో ఆర్‌బీఐ ఏమాత్రం ఆలస్యం చేయలేదని ద్రవ్యపరపతి విధాన కమిటీ (MPC) సభ్యురాలు ఆశిమా గోయల్‌ తెలిపారు. కరోనా వైరస్‌ సంక్షోభం నుంచి క్రమంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థలో వచ్చే కుదుపులకు అతిగా స్పందించడం కూడా అంతమంచిది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా పెరిగిన ఆహార, చమురు ధరల పెరుగుదలతో భారత్‌ ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు.

6. అన్ని పథకాలకు కేంద్రమే నిధులిస్తుందనడం హాస్యాస్పదం: హరీశ్‌రావు

అమిత్‌ షా.. అబద్ధాల షా అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. అన్ని పథకాలకు కేంద్రం ప్రభుత్వం నిధులు ఇస్తుందనడం హాస్యాస్పదమన్నారు. నిధులు ఎక్కడ ఇచ్చారో చూపించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రులు ఒక్కొక్కరూ పొంతన లేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంతో రాష్ట్రం సస్యశ్యామలమైందని గడ్కరీ చెబితే.. లాభం లేదని అమిత్‌షా చెప్పడం ఆంత్యరమేంటని ప్రశ్నించారు.

7. త్రిపుర నూతన సీఎంగా మాణిక్‌ సాహా ప్రమాణ స్వీకారం

త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా మాణిక్‌ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఎస్‌ఎన్‌ ఆర్య.. మాణిక్‌ సాహాతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొన్నటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న బిప్లక్‌ కుమార్‌ దేవ్‌ రాజీనామా చేయడంతో భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన మాణిక్‌ సాహాకు సీఎం పదవి వరించిన సంగతి తెలిసిందే.

సగ్గుబియ్యంతో నీరసం పరార్‌..!

8. పుతిన్‌పై తిరుగుబాటుకు యత్నం.. ఉక్రెయిన్‌ మిలిటరీ జనరల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను గద్దె దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉక్రెయిన్‌కు చెందిన సైనిక ఉన్నతాధికారి తెలిపారు. దాన్ని ఎవరూ ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు యుద్ధం కొనసాగిస్తున్న వేళ ‘స్కై న్యూస్‌’కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో మేజర్‌ జనరల్‌ కిరిలో బుదనోవ్‌ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు మధ్యలో యుద్ధం కీలక మలుపు తీసుకొని ఏడాది చివరకు ముగుస్తుందని బుదనోవ్‌ అంచనా వేశారు.

9. రష్యా బలగాల కదలిక అంతంతమాత్రమే.. నాటో డిప్యూటీ చీఫ్‌

ఉక్రెయిన్‌లో రష్యా సైనిక బలగాల పురోగమనం క్షీణిస్తున్నట్లు కనిపిస్తోందని నాటో డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌ మిర్సియా జియోనా అన్నారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ విజయం సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్‌కు మరింత మద్దతు అందించడం, నాటో కూటమిలో చేరికపై ఫిన్లాండ్, స్వీడన్, ఇతర దేశాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు నాటో అగ్ర దౌత్యవేత్తలు ఆదివారం బెర్లిన్‌లో సమావేశం కానున్నారు.

10. శరద్‌ పవార్‌పై పోస్ట్‌! మహారాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి చెంప చెళ్లు

ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌పై అనుచిత పోస్టుల వేడి చల్లారడం లేదు! పవార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ తాజాగా పుణెలో భాజపా మహారాష్ట్ర అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్‌తో ఎన్‌సీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆయన చెంప చెళ్లుమనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు