Published : 19 May 2022 16:58 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

1. 9,168 గ్రూప్-4 పోస్టులు.. భర్తీ ప్రక్రియపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సమీక్ష

తెలంగాణలో గ్రూప్-1, పోలీసు ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై దృష్టి సారించింది. గ్రూప్-4 విభాగంలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా గ్రూప్-4 నోటిఫికేషన్‌పై టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, అధికారులు, సంబంధిత శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.

2. పైశాచిక ఆనందం పొందుతున్న వ్యక్తికి గుణపాఠం చెబుతాం: చంద్రబాబు

వైకాపా పాలనలో వేధింపులు, అప్పులు విపరీతంగా పెరిగాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నిత్యావసరాల ధరల పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని దెబ్బతీయాలని ఎన్నో కుట్రలు చేశారన్న చంద్రబాబు.. తప్పుడు కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు గురువారం కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశ సభలో ఆయన మాట్లాడారు.


Video: సీపీఎస్‌ రద్దు తర్వాతే మా గడపకు రావాలంటూ ఇంటి ముందు బోర్డు పెట్టిన ఉపాధ్యాయుడు


3. తెరాసతో తెగదెంపులు.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు

తెలంగాణ ఉద్యమకారుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి తెరాసతో తెగదెంపులు చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం వారు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీ వెళ్లిన ఓదెలు దంపతులు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. అనంతరం ఓదెలు దంపతులకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

4. సంక్షోభాల వేళ.. ప్రపంచానికి భారత్‌ ఓ ఆశాదీపం

ప్రపంచ వ్యాప్తంగా అశాంతి, ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ ప్రపంచానికి భారత్‌ ఓ ఆశాదీపంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ ఖ్యాతి పెరుగుతుందన్న ఆయన.. పురాతన సంప్రదాయాన్ని అనుసరిస్తూ నవ భారత నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటు చేసిన ‘యువ శివిర్‌’ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న మోదీ.. యువతను ఉద్దేశించి ప్రసంగించారు.

5. వారం వ్యవధిలో 20 లక్షల కేసులు.. 7 లక్షల మంది క్వారంటైన్‌లో..!

ఉత్తరకొరియాలో కరోనా ఉగ్రరూపం చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. వారం క్రితం ఆ దేశం మొదటి కేసును ధ్రువీకరించింది. ఈ లోపే కేసుల సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరింది. గురువారం ఒక్కరోజే 2,62,270 మందిలో కొవిడ్ లక్షణాలు కనిపించాయి. ఒక మరణం సంభవించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దాంతో మృతుల సంఖ్య 63కు  చేరింది. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. ఏప్రిల్ చివరి నుంచి ఇప్పటివరకూ 1.98 మిలియన్ల మందిలో జ్వరం లక్షణాలు కనిపించాయి.


Andhra news: మానవత్వం చాటుకున్న ఏపీ మంత్రి రజని


6. మార్కెట్లను ముంచేసిన ‘మాంద్యం’ భయం..!

సగటు మదుపరి కోటానుకోట్ల సంపద ఆవిరైంది..! దలాల్‌స్ట్రీట్‌ గురువారం ఎరుపురంగ పులుముకుంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా వెల్లువెత్తిన అమ్మకాలను సూచీలను కూలదోశాయి. ఫలితంగా బలమైన ప్రతిఘటన స్థానాలను దాటుకుని మరీ నిఫ్టీ పతనమైంది. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఏకంగా 1400 పాయింట్లు పతనమవ్వగా.. నిఫ్టీ 15,800 దిగువకు పడిపోయింది.ఈ ఒక్కరోజే బీఎస్‌ఈలో నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ ఏకంగా రూ.7లక్షల కోట్ల మేర తరగిపోయింది.

7. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు.. 15 ఏళ్ల చరిత్రలో అపూర్వం

లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్ రాహుల్ ప్రస్తుతం జరుగుతోన్న భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. అతడు వరుసగా ఐదో సీజన్‌లోనూ 500 పైచిలుకు పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 2008లో ఈ టోర్నీ ప్రారంభమవ్వగా ఎవ్వరూ ఇలా ఇన్నేళ్లు వరుసగా అన్ని పరుగులు సాధించలేదు. దీంతో రాహుల్‌ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఈ సీజన్‌లో అతడు ఇప్పటికే 14 మ్యాచ్‌లు ఆడగా.. 135.26 స్ట్రైక్ రేట్‌తో 537 పరుగులు చేశాడు.

8. ఇక నా ఓటు రిపబ్లికన్లకే : ఎలాన్‌ మస్క్‌

ప్రపంచ పరిణామాలపై నిత్యం స్పందించే ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. ఇటీవల అమెరికా రాజకీయాలపై తన స్వరం పెంచుతున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికలను ప్రస్తావించిన ఆయన.. క్రితం ఎన్నికల్లో తాను డెమొక్రాట్‌లకు ఓటు వేసినప్పటికీ ఈసారి మాత్రం రిపబ్లికన్లకే ఓటు వేస్తానని స్పష్టం చేశారు. డెమొక్రాట్‌లు అంటే సౌమ్యంగా ఉండేవారని.. అందుకే గతంలో వారికి ఓటు వేశానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న జోబైడెన్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎలాన్ మస్క్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.


Video: కళ్లలో హానికారక పదార్థాలు పడితే ఏం చేయాలి..?


9. నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు

పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు జైలు శిక్ష పడింది. 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో ఆయనకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 1988లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన కేసులో సిద్ధూను రూ.1000 జరిమానాతో విడిచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది.

10. బైడెన్‌ పర్యటనకు కిమ్‌ అణుపరీక్ష ముప్పు..!

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఆసియాలో తలపెట్టిన పర్యటన శ్వేతసౌధంలో టెన్షన్‌ పెంచుతోంది. ఆయన ఈ పర్యటనలో భాగంగా జపాన్‌, దక్షిణ కొరియాలను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ జాక్‌ సులేవాన్‌ విలేకర్లతో మాట్లాడుతూ ‘‘మా ఇంటెలిజెన్స్‌ నుంచి నమ్మకమైన సమాచారం ఉంది. దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్ష లేదా అణు పరీక్ష జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ రెండు జరగవచ్చు. అధ్యక్షుడి పర్యటన సమయంలో గానీ, తర్వాత గానీ ఇవి జరిగే అవకాశం ఉంది’’ అని ఆయన ఉత్తర కొరియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని