Updated : 21 May 2022 17:28 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. కేసీఆర్‌తో భేటీ అయిన అఖిలేశ్‌.. తాజా రాజకీయాలపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈ మధ్యాహ్నం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ భేటీ అయ్యారు. దిల్లీలోని కేసీఆర్‌ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఇటీవల జరిగిన ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.

2. అత్యంత నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమం అందాలి: రేవంత్‌రెడ్డి

వరంగల్‌ డిక్లరేషన్‌ ద్వారా రైతులను ఏ విధంగా ఆదుకుంటామో చెబుతున్నామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. రైతు సమస్యలపై చర్చించడంతోపాటు వాటికి పరిష్కారాలు చూపిస్తున్నామని తెలిపారు. వరంగల్‌ జిల్లాలోని ఆత్మకూరు మండలం అక్కంపేటలో కాంగ్రెస్‌ రచ్చబండ కార్యక్రమం నిర్వహించింది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్వగ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి స్థానిక నేతలు ఘనంగా స్వాగతం పలికారు.


Video: ఏదో చెప్పాలనుకొని ఏదేదో మాట్లాడేసిన మంత్రి రోజా!


3. రైతులకు సాయంపై భాజపా, కాంగ్రెస్‌వి చిల్లర రాజకీయాలు: నిరంజన్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు సాయం చేయాలనుకోవడంపై కాంగ్రెస్, భాజపా చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. దిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో మరణించిన వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ చేస్తున్న సాయంపై విపక్షాల విమర్శలను నిరంజన్‌రెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

4. లండన్‌ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఉందా?: యనమల

అనుమతి ఇవ్వకపోయినా సీఎం జగన్‌ లండన్ వెళ్లడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఉందా? లేక దావోస్‌కు వెళ్లేందుకు మాత్రమే అనుమతించిందా అని ప్రశ్నించారు. లండన్‌కు అనుమతిస్తే అధికార పర్యటనలో ఎందుకు చేర్చలేదని నిలదీశారు. షెడ్యూల్‌లో లేని లండన్‌లో ఎందుకు దిగాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దండుకున్న సంపద దాచుకోడానికే లండన్ వెళ్లారనే అనుమానం ప్రజల్లో బలంగా ఉందని ఆరోపించారు.

5. మే-జూన్‌లో వేసవి ప్రత్యేక రైళ్లు ఇవే..

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక సర్వీసులను నడుపుతుండగా.. మే, జూన్‌ మాసాల్లో నడిపే రైళ్ల జాబితాను తాజాగా విడుదల చేసింది. సికింద్రాబాద్‌, చిత్తూరు, హైదరాబాద్‌, తిరుపతి, బెంగళూరు కంటోన్మెంట్‌, ఎర్నాకుళం, చెన్నై, మదురై, శ్రీకాకుళం, రామేశ్వరం, గోరఖ్‌పూర్‌, జైపూర్‌, విశాఖ, కటక్‌ నుంచి పలు ప్రాంతాల నుంచి నేటి నుంచి నడపబోయే ప్రత్యేక రైలు సర్వీసుల వివరాలను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.


AP News: పలుకూరులో పోటాపోటీగా వైకాపా, తెదేపా నేతల రోడ్డు నిర్మాణం


6. ‘టెట్‌’ వాయిదా కుదరదు: మంత్రి సబిత

తెలంగాణలో టెట్‌ పరీక్ష నిర్వహించే రోజే ఆర్‌ఆర్‌బీ పరీక్ష ఉన్నందన.. టెట్‌ను వాయిదా వేయాలని మంత్రి కేటీఆర్‌కు ఓ అభ్యర్థి ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీంతో కేటీఆర్‌ ఆ ట్వీట్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫార్వర్డ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సబిత స్పందిస్తూ.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో టెట్‌ వాయిదా కుదరదు. అన్ని అంశాలను, ఇతర పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకున్నాకే టెట్‌ పరీక్షపై నిర్ణయం తీసుకున్నాం’’ అని తెలిపారు.

7. వ్యాక్సిన్లు ఇస్తామన్నా.. కిమ్‌ పట్టించుకోవట్లేదు: జో బైడెన్‌

ఉత్తరకొరియాలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. నిత్యం లక్షల మంది జ్వరంతో బాధపడుతున్నారు. అసలే ఆరోగ్య వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్న కిమ్‌ రాజ్యంలో మహమ్మారి మరింత వ్యాప్తి చెందితే ప్రాణనష్టం ఏ మేర ఉంటుందోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ కట్టడికి తక్షణమే వ్యాక్సిన్లు పంపిణీ చేయాలని సూచిస్తున్నారు. అయితే కరోనా టీకాలపై ముందు నుంచీ వ్యతిరేకత చూపిస్తోన్న అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్.. ఇప్పుడు వైరస్‌ ఉద్ధృతి పెరిగినప్పటికీ వ్యాక్సిన్ల కోసం ముందుకు రాకపోవడం గమనార్హం.

8. ఆరోజు నాకేమైందో తెలియదు: మహేశ్‌బాబు

‘సర్కారువారి పాట’ సూపర్‌సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. ఆ సినిమాకి అభిమానుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌కు ఆయన ఎంతగానో ఆనందిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన కీర్తిసురేశ్‌, దర్శకుడు పరశురామ్‌తో కలిసి పలువురు యూట్యూబర్లతో చిట్‌చాట్‌ నిర్వహించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చారు. కర్నూలులో జరిగిన విజయోత్సవ సభ గురించి మాట్లాడారు. ఆ రోజు స్టేజ్‌పై డ్యాన్స్‌ చేయడంపై పెదవివిప్పారు.


Video: వైకాపా నేత మోసం.. రైతుకు వచ్చిన పరిహారం దారి మళ్లింపు


9. ఎన్‌ఎస్‌ఈ కో లొకేషన్‌ కేసు.. బ్రోకర్లపై సీబీఐ దాడులు

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో కో-లొకేషన్‌ వ్యవహారానికి సంబంధించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసుతో సంబంధమున్న బ్రోకర్లపై దాడులకు దిగింది. దిల్లీ, నోయిడా, ముంబయి, గాంధీనగర్‌, గురుగ్రామ్‌, కోల్‌కతాలోని 12 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే కేసు వ్యవహారంలో సీబీఐ ఇటీవల ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ, మాజీ గ్రూపు ఆపరేటింగ్‌ అధికారి ఆనంద్‌ సుబ్రమణియన్‌ను అరెస్టు చేసి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

10. మొన్న ఆటగాళ్ల మద్దతు.. నేడు ఇంకో అడుగు ముందుకేసిన బెంగళూరు యాజమాన్యం

ఇవాళ ముంబయి, దిల్లీ జట్ల మధ్య కీలక మ్యాచ్‌ జరగనుంది. ముంబయికి పెద్దగా ఉపయోగం లేకపోయినా దిల్లీకి చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ మ్యాచ్‌ ఫలితంతోనే బెంగళూరు ప్లేఆఫ్స్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. తమ జట్టు సభ్యులందరూ ముంబయికే మద్దతు ప్రకటిస్తున్నామని ఇప్పటికే ఆ జట్టు సారథి డుప్లెసిస్‌తోపాటు టాప్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ వెల్లడించిన విషయం తెలిసిందే. గుజరాత్‌పై విజయం సాధించిన అంనంతరం డుప్లెసిస్‌, కోహ్లీ మాట్లాడారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని