Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 27 May 2022 16:56 IST

1. కార్యకర్తలకు కష్టం వస్తే అర్ధరాత్రైనా సరే వస్తా : బాలకృష్ణ

శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండలో ఇటీవల వైకాపా వర్గీయుల దాడిలో గాయపడ్డ తెదేపా కార్యకర్తలను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తమ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్‌ అంటూ వైకాపా నేతలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. తెదేపా కార్యకర్తలకు కష్టం వస్తే అర్ధరాత్రైనా సరే వస్తానని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.

2. అల్లర్లు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా.. కావాలని చేసిన పనా..? : జీవీఎల్‌

రాష్ట్రంలో వైకాపా చేతగానితనంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం స్టిక్కర్లు అతికించుకునే పని చేస్తోందని ఎద్దేవా చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘అల్లర్లు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా.. కావాలని చేసిన పనా?.. యాత్ర పేరుతో స్పీకర్‌ రాజకీయ వ్యాఖ్యలు చేయడం తగదు. స్పీకర్‌ పదవికి రాజీనామా చేసి.. వ్యాఖ్యలు చేసుకోవచ్చు’’ అన్నారు.

టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు షాకిచ్చేలా చైనా ప్రణాళికలు

3. కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు: సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రూ.7,300 కోట్లతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. మన బస్తీ - మన బడి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ బషీర్‌బాగ్‌ అలియా పాఠశాలలో జరుగుతున్న పనులను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పరిశీలించారు.

4. కేసీఆర్‌, మోదీ మధ్య రాజకీయ అవగాహన: జగ్గారెడ్డి

ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనలపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర సమస్యలు అడిగే బాధ్యత సీఎంకు లేదా అని ప్రశ్నించారు. ప్రధానిని ప్రశ్నించే అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్ ఆ పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రజల ముందే ప్రధానిని నిలదీశారన్నారు.

5. సుదీర్ఘ టోర్నీతో శారీరకంగా, మానసికంగా ఇబ్బందే: డుప్లెసిస్

లీగ్‌ స్టేజ్‌లో టాప్‌-2లో చోటు దక్కించుకోకుంటే ఫైనల్‌ చేరడం చాలా కష్టమని బెంగళూరు కెప్టెన్‌ ఫా డుప్లెసిస్‌ అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఈసారి మెగా టోర్నీ రెండు నెలలకుపైగా సాగడంతో అటు శారీరకంగా ఇటు మానసికంగా ఇబ్బందేనని తెలిపాడు. అయితే, ఇంత సుదీర్ఘ టోర్నీ ఆడటం వల్ల చివరి దశకు చేరుకునేసరికి పరిస్థితులకు అలవాటు పడ్డామని చెప్పాడు.

సాయంత్రం వేళల్లో వీధి బాలలకు విద్యా బోధన చేస్తున్న యువ ఇంజనీర్‌ 

6. భారత మార్కెట్‌లోకి ఎల్‌జీ రోలబుల్‌ ఓఎల్‌ఈడీ టీవీ

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జీ ఇండియా(LG india) తాజాగా మడతబెట్టగలిగే ఓఎల్‌ఈడీ టీవీ(Rollable television)ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎల్‌జీ సిగ్నేచర్‌ ఆర్‌ ఓఎల్ఈడీ (LG Signature R OLED)గా దీనికి నామకరణం చేసింది. దీంతో పాటు, 97 అంగుళాల టెలివిజన్‌ సహా విస్తృత శ్రేణిలో సరికొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. వీటిల్లో సిగ్నేచర్‌ ఆర్‌ ఓఎల్‌ఈడీ(Signature R OLED) అన్నింటికన్నా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

7. నా రహస్య పత్రాలను సీబీఐ తీసుకెళ్లింది: కార్తీ ఆరోపణలు

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు సోదాల పేరుతో తనకు చెందిన అత్యంత రహస్య వ్యక్తిగత పత్రాలను స్వాధీనం చేసుకున్నారని కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపించారు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి చెందిన పేపర్లను కూడా సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఇది పూర్తిగా తన పార్లమెంటరీ హక్కులను ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కార్తీ లేఖ రాశారు.

అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ తెచ్చారు: చంద్రబాబు

8. గత పాలనలో సాంకేతికతపై ఉదాసీనత.. డ్రోన్‌ ఫెస్టివల్‌ ప్రారంభోత్సవంలో మోదీ

ప్రభుత్వ పాలనలో 2014 ముందువరకు సాంకేతిక వినియోగంపై ఉదాసీనత ఉండేదని.. దీని కారణంగా పేదలు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నష్టపోయారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. టెక్నాలజీని ఒక సమస్యగా చూశారని, అది పేదలకు వ్యతిరేకమని ముద్ర వేసే ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపించారు. దిల్లీలో శుక్రవారం 'భారత్ డ్రోన్ మహోత్సవ్- 2022'ను ప్రారంభించిన ప్రధాని.. అనంతరం ఈ మేరకు ప్రసంగించారు.

9. Ukraine Crisis: ఎదురుదాడికి ఆయుధాలివ్వండి..!

రష్యాపై పోరాడేందుకు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను ఇవ్వాలని అమెరికాపై ఉక్రెయిన్‌ ఒత్తిడి తెస్తోంది. ముఖ్యంగా మల్టిపుల్‌ లాంఛ్‌ రాకెట్‌ వ్యవస్థ (ఎంఎల్‌ఆర్‌ఎస్‌)లను అందజేయాలని కోరుతోంది. డాన్‌బాస్‌పై రష్యా దాడులను తట్టుకోవాలంటే ఇవి తప్పనిసరి. ఇప్పటికే పశ్చిమ దేశాలు ఎం777 హోవిట్జర్లను ఉక్రెయిన్‌కు సరఫరా చేశాయి. వాటిని తూర్పు ఉక్రెయిన్‌లో పోరాటానికి ఉపయోగిస్తున్నారు. 

10. ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్‌ చిట్‌.. సమీర్‌ వాంఖడేపై చర్యలకు ఆదేశాలు..!

క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్‌ చిట్‌ లభించిన నేపథ్యంలో ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడే దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు