Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Updated : 03 Jun 2022 10:59 IST

1. హైదరాబాద్‌లో 3 రోజులు ఉండనున్న మోదీ, అమిత్‌షా!

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ వేదిక కానుంది. నగరంలోని హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌ హోటల్‌లో సమావేశాలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయస్థాయి ముఖ్యనేతలు హాజరుకాన్నట్లు తెలుస్తోంది. మూడు రోజులపాటు మోదీ, అమిత్‌షా తదితరులు ఇక్కడే ఉండే అవకాశముంది. 

 మా స్టైల్‌ ఆయన నుంచి వచ్చినవే: కమల్‌ హాసన్‌

2. రేపు దిల్లీకి ఏపీ సీఎం జగన్‌!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రేపు దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా సహా పలువురు మంత్రులను సీఎం కలిసే అవకాశముంది. దావోస్‌ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలపై చర్చించే అవకాశమున్నట్టు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అంశాలు, రాష్ట్రపతి ఎన్నికలపైనా చర్చించే అవకాశముందని తెలుస్తోంది. 

3. హైదరాబాద్‌లో ఈ ఏడాది ముంపు ప్రభావం తగ్గుతుంది: తలసాని

గతంతో పోల్చితే ఈ ఏడాది హైదరాబాద్‌లో ముంపు ప్రభావం తగ్గుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తెలిపారు. వచ్చే ఏడాది వేసవి నాటికి ముంపు ప్రభావం లేకుండా చేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మంత్రి మహమూద్ అలీ, మేయర్‌ విజయలక్ష్మితో కలిసి పట్టణ ప్రగతిపై తలసాని సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో తలెత్తే ఇబ్బందులపైనే పట్టణ ప్రగతిలో ఎక్కువగా దృష్టి సారించామని చెప్పారు.

4. వాణిజ్య పంటలపై రైతులు దృష్టి సారించాలి: నిరంజన్‌రెడ్డి

దేశానికి అన్నం పెట్టే రైతులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వర్షాకాలం సాగు సన్నద్ధతపై నల్గొండలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో నిరంజన్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వాణిజ్య పంటలపై రైతులు దృష్టి సారించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. రాష్ట్రంలో బీడు భూములన్నీ పచ్చగా మారాయని.. తెలంగాణలో గతేడాది 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు.

Karnataka: ఆడవాళ్ల దుస్తులు.. మగవాళ్లు ధరించి..!

5. రుషికొండలో కొత్తగా తవ్విన చోట నిర్మాణాలొద్దు: సుప్రీం

విశాఖలోని రుషికొండ తవ్వకాలకు సంబంధించి ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ హిమాకోహ్లి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. గతంలో రిసార్ట్‌ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టాలని.. కొత్తగా తవ్విన ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలకు చేపట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భవిష్యత్‌ తరాలకు కాలుష్య రహిత వాతావరణం అందించాలని ఈ సందర్భంగా ధర్మాసనం సూచించింది.

6. గాయకుడి మృతి.. బెంగాల్‌ ప్రభుత్వంపై భాజపా విమర్శలు

ప్రముఖ గాయకుడు కేకే ఛాతినొప్పితో కుప్పకూలడానికి ముందు ఆడిటోరియంలోనే అసౌకర్యానికి గురయ్యారని, అక్కడి వేడికి ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. గాలి సరిగా లేకపోవడంతో ఉక్కపోతకు గురైన ఆయన చెమటలు తుడుచుకుంటున్నట్లు కనిపించారు. దానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పుడీ వసతుల లేమి.. రాజకీయ వివాదానికి దారితీస్తోంది. కేకే కచేరీ వేళ కోల్‌కతా యంత్రాంగం తీవ్ర గందరగోళానికి గురైందని భాజపా నేత దిలీప్ ఘోష్ మండిపడ్డారు.

గాయకుడు కేకే హఠాన్మరణంపై అనుమానాలెన్నో..!

7. సోనియా, రాహుల్‌ గాంధీకి ఈడీ సమన్లు..!

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో జూన్‌ 8న దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో సోనియా, రాహుల్‌ స్టేట్‌మెంట్లను రికార్డు చేసేందుకు వారికి సమన్లు జారీ చేసినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.

8. రష్యా ఆయుధం పంజాబ్‌కు ఎలా వచ్చింది..?

గాయకుడు సిద్ధూమూసేవాల హత్య ఇప్పుడు పంజాబ్‌లో గుబులు పుట్టిస్తోంది. తొలుత ఈ హత్యకు ఏకే-47 రైఫిల్‌ వాడినట్లు భావించారు. కానీ, అక్కడ దొరికిన ఖాళీ తూటాలను పరిశీలించి.. రష్యాకు చెందిన ఏఎన్‌-94 రైపిల్‌ను వాడినట్లు తేల్చారు. దీనిని కేవలం రష్యా సాయుధ బలగాలు మాత్రమే వినియోగిస్తాయి. ఐరిష్‌ రిపబ్లిక్‌ ఆర్మీ అనే వేర్పాటువాద దళం వద్ద కూడా ఇవి ఉన్నాయి. ఇప్పుడు పంజాబ్‌లో ఈ రైఫిల్‌ ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది.

9. మే నెలలో జీఎస్టీ వసూళ్లు ఎంతో తెలుసా?

మే నెలకు సంబంధించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022 మే నెలలో దాదాపు 1.41లక్షల కోట్లు మార్కును చేరినట్టు ప్రకటించింది. ఆల్‌టైం రికార్డుగా నమోదైన ఏప్రిల్‌తో పోల్చి చూస్తే వసూళ్లు తగ్గినప్పటికీ.. క్రితం ఏడాది మే నెలతో (రూ.97,821కోట్లు) పోలిస్తే మాత్రం 44శాతం పెరిగినట్టు ఆర్థికశాఖ వెల్లడించింది. 

10. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళ విన్యాసాలకు రంగం సిద్ధం..!

ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా విన్యాసాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు సుదీర్ఘంగా జరగనున్న ఈ యుద్ధ విన్యాసాలకు అమెరికాలోని హోనోలువు, శాన్‌డియాగో వేదికలు కానున్నాయి. ఈ యుద్ధ విన్యాసాల్లో మొత్తం 26 దేశాలు పాల్గొననున్నాయి. నాలుగు క్వాడ్‌ సభ్యదేశాలతోపాటు దక్షిణ చైనా సముద్రంలోని ఐదు దేశాలు దీనిలో పాలుపంచుకోనుండటం విశేషం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని