Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం..

Published : 05 Jun 2022 16:57 IST

1. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలు వర్షం రాకతో కాస్త ఉపశమనం పొందారు. జీడిమెట్ల, సూరారం, బహదూర్‌పల్లి, నేరేడ్‌మెట్‌ మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బేగంపేట, చిలకలగూడ, మారేడ్‌పల్లిలో వర్షం కురిసింది. కీసరలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

Web Stories: మీ పాస్‌వర్డ్‌ భద్రమేనా?

2. భారీస్థాయిలో కర్బన ఉద్గారాలకు ఆ దేశాలే కారణం : మోదీ

అభివృద్ధి చెందిన దేశాలు అత్యధికంగా కర్బన ఉద్గారాలకు కారణమవుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘సేవ్‌ సాయిల్‌ (Save Soil) ఉద్యమం’ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందన్నారు. పెట్రోల్‌లో పదిశాతం ఇథనాల్‌ కలపాలనే లక్ష్యాన్ని భారత్‌ ఐదు నెలల ముందుగానే సాధించిందని మోదీ ప్రకటించారు.

 రైలు ప్రయాణికులకు ఇక ఆ టెన్షన్‌ అక్కర్లేదు.. ఈ ఫీచర్‌ మీకోసమే!

3. కేంద్ర నిధులపై కేసీఆర్‌తో చర్చకు సిద్ధం: ఈటల

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం వెలవెలబోతోందని.. అందులో పాల్గొనేందుకు అధికారులు ముఖం చాటేస్తున్నారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. సర్పంచులకు 14, 15వ ఆర్థిక సంఘం నిధులే తప్ప మిగతా నిధులు రావడం లేదని చెప్పారు. కేంద్రం ఇచ్చే నిధులపై సీఎం కేసీఆర్‌తో అయినా, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో అయినా చర్చకు సిద్ధమని ఈటల స్పష్టం చేశారు. 

Video: పిల్లలకు పాఠాలు చెప్పిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..!

4. ఇతర పార్టీలతో కలవాలా? వద్దా? అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది: పురందేశ్వరి

ఏపీలో జనసేనతో పొత్తు యథావిధిగా కొనసాగుతోందని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. రెండు పార్టీలూ సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీలతో కలవాలా?వద్దా? అనేది భాజపా జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని పురందేశ్వరి అన్నారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పురందేశ్వరి మాట్లాడారు.

5. రేపే ఏపీ టెన్త్‌ ఫలితాలు.. విడుదల చేయనున్న మంత్రి బొత్స

ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్‌ దేవానంద్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత www.eenadu.netలో చూడొచ్చు.

Extra Jabardasth: ఇంతకీ రష్మికి జరిగిన అన్యాయం ఏమిటి..?

6. జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌.. రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వండి: గవర్నర్‌ ఆదేశం

జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచార ఘటన అంశంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. దీనిపై అనేక మీడియా రిపోర్టులను పరిశీలించానని.. ఈ దుర్ఘటన అత్యంత బాధ కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డిని గవర్నర్‌ తమిళిసై ఆదేశించారు.

7. ఒడిశాలో కొలువుదీరిన నూతన మంత్రివర్గం.. మంత్రులుగా 21 మంది ప్రమాణం

ఒడిశాలో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. 21 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 13 మంది కేబినెట్‌ మంత్రులుగా, 8 మంది సహాయ మంత్రులు (ఇండిపెండెంట్‌ ఛార్జి)గా కొలువుదీరారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా సీనియర్లు, యువతకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే బిజు జనతా దళ్ (BJD) నేతలు జగన్నాథ్ సరక, నిరంజన్ పూజారి, రణేంద్ర ప్రతాప్‌ సహా మరో ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. 

8. బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 40 మంది మృతి

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. చిట్టగాంగ్‌ ప్రాంతంలోని ఓ షిప్పింగ్‌ కంటైనర్‌ డిపోలో భారీ రసాయన పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందినట్లు సమాచారం. 300 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారులు చెబుతున్నారు.

9. పోలవరం నిధులు మింగేసిన జగన్‌ జైలుకెళ్లడం ఖాయం: దేవినేని ఉమా

పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన డబ్బుల్ని ప్రభుత్వ పెద్దలు మింగేశారని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమా ఆరోపించారు. దీనికి కారణమైన సీఎం జగన్‌ జైలుకెళ్లడం ఖాయమన్నారు. ఇందులో పోలవరం, రంపచోడవరం ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ అనంతబాబు హస్తం ఉందన్నారు. పోలవరం ఎత్తు తగ్గించుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందంటూ తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటనను ముఖ్యమంత్రి జగన్‌ ఎందుకు ఖండించలేదని నిలదీశారు.

10. ఏకంగా ఎనిమిది క్షిపణుల ప్రయోగం!

క్షిపణి పరీక్షల్లో ఉత్తర కొరియా మరోసారి తన దూకుడును ప్రదర్శించింది. ఆదివారం ఏకంగా ఎనిమిది స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. నాలుగేళ్ల తర్వాత అమెరికా, దక్షిణ కొరియాలు నిర్వహించిన మొదటి సంయుక్త సైనిక విన్యాసాలు ముగిసిన మరుసటిరోజే ఈ ప్రయోగాలు చేపట్టడం గమనార్హం. ఈ ఏడాది మొదటినుంచే కిమ్‌ ప్రభుత్వం క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని