Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Updated : 19 Jun 2022 17:03 IST

1. సైన్యంలో సగటు వయసు తగ్గించేందుకే సంస్కరణలు

సైన్యంలో సగటు వయసు తగ్గించేందుకే సంస్కరణలు తీసుకొస్తున్నామని త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అగ్నిపథ్‌పై రెండేళ్లుగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం ఇతర దేశాల సైన్యాలపైనా త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారన్నారు. ‘అగ్నిపథ్‌’పై అనుమానాలను నివృత్తి చేసేందుకు త్రివిధ దళాలకు చెందిన అధికారులు నేడు మీడియా ముందుకు వచ్చారు.

fathers day: నాన్న ఎందుకో వెనకబడ్డాడు.. గుండెల్ని పిండేసే వీడియోలు..!

2. LAC: చైనా ఏకపక్ష యత్నాలకు భారత్‌ అడ్డుకట్ట..!

వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ పరిస్థితిని మార్చేందుకు చైనా చేసే ఏకపక్ష యత్నాలను భారత్‌ ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించదని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ స్పష్టం చేశారు. భారత్‌ భారీ స్థాయిలో దళాలను తరలించి వాస్తవాధీన రేఖవద్ద చైనాను కట్టడి చేసిందన్నారు. 1993, 1996 నాటి ఒప్పందాలను చైనా ఉల్లంఘిచి వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా మార్చాలని యత్నించిందన్నారు. తూర్పు లద్ధాఖ్‌ వివాదంపై ఆయన ఈ మేరకు ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. 

3. మీవల్ల కాదంటే.. మాకు అప్పగించండి: కేటీఆర్‌

దేశాభివృద్ధికి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలను భాజపా ప్రభుత్వం ‘అడ్డికి పావుశేరు’ చొప్పున అమ్ముతుందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలోని సంస్థల్లో పెట్టబడులు ఉపసంహరణ పేరుతో వాటి ఆస్తులను అప్పనంగా అమ్ముతోందని దుయ్యబట్టారు. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌కు కేటీఆర్‌ లేఖ రాశారు.

SpiceJet: గాల్లోనే.. స్పైస్ జెట్ విమానంలో మంటలు

4. నా బిడ్డలపై ప్రమాణం చేస్తా.. ఆ ధైర్యం మీకుందా?: షర్మిల సవాల్‌

వచ్చే ఎన్నికల్లో తాను ఖమ్మం జిల్లా పాలేరు నుంచే పోటీ చేస్తున్నట్లు వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. తనకు బయ్యారం మైనింగ్‌లో వాటా ఉన్నట్లు చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. ఈ విషయంలో తన బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మంత్రిగా ఎటువంటి అవినీతికి పాల్పడలేదంటూ తన బిడ్డలపై ప్రమాణం చేసే ధైర్యం పువ్వాడకు ఉందా? అని ఆమె సవాల్‌ విసిరారు. 

5. ‘విక్రమ్‌’ బాక్సాఫీస్‌ వేట.. రూ.150 కోట్లు ఆ రాష్ట్రం నుంచే‌..!

కమల్‌హాసన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘విక్రమ్‌’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు వసూళ్లు రాబట్టిందని సినీ విశ్లేషకుల అంచనా. ఈ మొత్తం కలెక్షన్స్‌లో సగం అంటే రూ.150 కోట్లు కేవలం తమిళనాడు నుంచే వచ్చాయట. దీంతో ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో ఉన్న ‘బాహుబలి-2’ కలెక్షన్స్‌ రికార్డుని ‘విక్రమ్‌’ బద్దలు కొట్టింది.

Cash: తప్పిపోయిన కొడుకు కోసం సుమ ప్రకటన.. ఎంతమంది హీరోలొచ్చారంటే!

6. Agnipath నిరుద్యోగుల పాలిట అగ్నిబాట : రాహుల్ గాంధీ

సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ (Agnipath) పథకం నిరుద్యోగులను అగ్నిబాటపై నడిచేలా చేసిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగాలపై ప్రధానమంత్రి పదేపదే తప్పుడు ఆశలు కల్పించి వారిని అగ్నిమార్గంలో పయణించేలా చేశారని మండిపడ్డారు. 

7. అగ్నిపథ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండానా?: తేజస్వీ యాదవ్‌

అగ్నిపథ్‌పై యువతకు అనేక సందేహాలు ఉన్నాయని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ అన్నారు. వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చదువుకున్న యువతకు అగ్నిపథ్‌ విధానం ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ వంటిదా? లేక ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాలో భాగంగా దీన్ని తీసుకొచ్చారా? అని నిలదీశారు. ‘వన్‌ ర్యాంక్‌, వన్‌ పెన్షన్‌’ గురించి మాట్లాడిన ప్రభుత్వం ఇప్పుడు ‘నో ర్యాంక్‌, నో పెన్షన్‌’ను అమల్లోకి తీసుకొస్తోందని ఎద్దేవా చేశారు.

8. ఎన్నో మంచి పనులకు రాజకీయ రంగులంటుకుంటున్నాయి: మోదీ

దేశ పౌరుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పనులకు రాజకీయ రంగులు పులుముకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘ఎన్నో మంచి పనులు, సదుద్దేశంతో చేపట్టిన చర్యలు రాజకీయ రంగు పులుముకోవడం మన దేశ దురదృష్టం’ అని వ్యాఖ్యానించారు. దిల్లీలో నిర్మించిన ‘ప్రగతి మైదాన్‌ సమీకృత రవాణా నడవ’ను ప్రారంభించిన ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

9. ఉక్రెయిన్‌లో సుదీర్ఘ యుద్ధం తప్పకపోవచ్చు..!

కొన్నేళ్లపాటు జరగనున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు అండగా ఉండేందుకు పశ్చిమ దేశాలు సన్నద్ధంగా ఉండాలని నాటో చీఫ్‌ జేన్స్‌ స్టాలెన్‌బర్గ్‌ హెచ్చరించారు. ఈ యుద్ధంలో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అదే సమయంలో మాస్కో తన సైనిక లక్ష్యాలు సాధించుకొంటే అంతకు మించిన మూల్యం చెల్లిస్తామన్నారు. 

10. కౌలు రైతుల కుటుంబాలకు పవన్‌ ఆర్థిక సాయం..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్ర ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొనసాగింది. ఏటుకూరు కూడలి, లూలుపురం కూడళ్లలో  యాత్ర సాగింది. ఈ సందర్భంగా పవన్‌ తనదైన శైలిలో ప్రజలకు అభివాదం చేశారు. జై జనసేనాని అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చిమటావారిపాలెం డేగలమూడిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి రూ.లక్ష  సాయం అందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని