Updated : 29 Jun 2022 20:19 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఆల్‌ టైమ్‌ కనిష్టానికి రూపాయి.. 79కి చేరిన విలువ!

రూపాయి పతనం కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే దీని విలువ రోజు రోజుకూ దిగజారుతోంది. తాజాగా రూపాయి (Rupee value) విలువ జీవిత కాల కనిష్ఠానికి చేరింది. గురువారం స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి డాలరుతో రూపాయి విలువ 79.04కి పతనమైంది.  విదేశీ మదుపరుల అమ్మకాలు కొనసాగుతుండడం, ముడి చమురు ధరల పెరగుదుల, ద్రవ్యోల్బణం వంటివి రూపాయి క్షీణతకు కారణమని నిపుణులు చెబుతున్నారు. 

2. భాజపాలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి?

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి భాజపాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు. వీరు దాదాపు గంటపాటు సమావేశం అయ్యారు. కాగా, జూలై 1వ తేదీన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో భాజపాలో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. 

3. బల పరీక్షలో నెగ్గేది మేమే.. ఎవరూ ఆపలేరు: ఏక్‌నాథ్‌ శిందే

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు (Maharastra politics) శరవేగంగా మారుతున్నాయి. గురువారం తమ బలాన్ని నిరూపించుకోవాలంటూ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ సీఎం ఉద్దవ్‌ ఠాక్రేను (Uddhav Thackeray) ఆదేశించడంతో అక్కడి పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.  ఈ నేపథ్యంలో శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్‌ శిందే ( Eknath Shinde) కీలక వ్యాఖ్యలు చేశారు.  

4. దోస్త్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది..

తెలంగాణలో ఇంటర్‌ ఉత్తీర్ణులై డిగ్రీలో చేరే విద్యార్థుల కోసం దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు. జులై 1 నుంచి 30 తేదీ వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు చేపడతామని అధికారులు వెల్లడించారు. జులై 6 నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 6న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరనుంది.

5. ఉద్యోగుల ఖాతాల్లో నగదు ఏమైంది?.. ఇంకా స్పష్టత ఇవ్వని ఆర్థికశాఖ

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు ఆర్థిక శాఖ అధికారులను కలిసినా స్పష్టత రాకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. ఇవాళ ఉదయం సచివాలయంలో ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రావత్‌, సత్యనారాయణను ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు కలిసి సమస్యను వివరించారు.

6. జులై 4 డెడ్‌లైన్‌.. ఇదే చివరి నోటీస్: ట్విటర్‌కు కేంద్రం హెచ్చరిక

నూతన ఐటీ నిబంధనలు (IT Rules) పాటించేందుకు గానూ ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్ ట్విటర్‌ (Twitter)కు కేంద్ర ప్రభుత్వం ‘చివరి’ అవకాశం కల్పించింది. జులై 4వ తేదీలోగా కేంద్రం జారీ చేసిన ఆదేశాలన్నింటినీ ట్విటర్‌ పాటించాలని తెలిపింది. లేదంటే ఆ సంస్థ మధ్యవర్తిత్వ హోదా కోల్పోతుందని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆ సంస్థకు తాజా నోటీసులు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు బుధవారం వెల్లడించాయి.

7. తప్పుడు నిర్ణయాలతో పోలవరం నిర్మాణంలో జాప్యం: షెకావత్‌కు చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని తెదేపా అదినేత చంద్రబాబు మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు చంద్రబాబు లేఖ రాశారు. వైకాపా ఏకపక్ష నిర్ణయాలతోనే ప్రాజెక్టుకు సాంకేతికంగా నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. పోలవరం నిర్మాణం సత్వర పూర్తికి సహకరించాలని కోరారు. 

8. అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. 6 రోజుల్లోనే 1.83లక్షల మంది నమోదు

త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌ (Agnipath)’ పథకానికి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా భారత వాయుసేనలో (Indian Air Force​) నియామకాల కోసం జూన్‌ 24న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలుకాగా.. ఆరు రోజుల వ్యవధిలోనే లక్షా 83 వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5న ముగుస్తుందని.. ఆసక్తి గల అభ్యర్థులు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

9. ‘పుతిన్‌ ఓ మహిళే అయితే’.. రష్యా అధ్యక్షుడిపై బ్రిటన్‌ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు!

ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం (Ukraine Crisis) కొనసాగిస్తున్న రష్యాపై ప్రపంచ దేశాలు మండిపడుతూనే ఉన్నాయి. ఓవైపు ఉక్రెయిన్‌కు సాయం చేస్తూనే మరోవైపు రష్యాపై ఆంక్షలు విధిస్తూ పుతిన్‌ సేనను కట్టడి చేసేందుకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ (Boris Johnson) రష్యా అధ్యక్షుడి (Vladimir Putin)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

10. ‘పాత్రికేయుల్ని జైలుపాలు చేయొద్దు’.. జుబైర్ అరెస్టుపై స్పందించిన ఐరాస

ప్రముఖ జర్నలిస్టు, ఆల్ట్ న్యూస్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాకుడు మొహమ్మద్‌ జుబైర్‌ అరెస్టుపై అంతర్జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. పాత్రికేయులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వాతావరణం ఉండాలని ఐక్యరాజ్య సమితి(UN) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వెల్లడించారు. వారు వ్యక్తపరిచిన విషయాలపై వారిని జైలు పాలు చేయొద్దని సూచించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని