Published : 03 Jul 2022 16:58 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తాం: అమిత్‌షా

ప్రతి విషయంలోనూ కాంగ్రెస్‌ పార్టీ ప్రతికూల రాజకీయాలు చేస్తోందని.. ఆ పార్టీ ఎప్పుడూ భ్రమల్లోనే ఉంటుందని భాజపా అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. నగరంలోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ఆయన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 

హైదరాబాద్‌లో మోస్తరు వర్షం

2. రేపు సంచలన ప్రకటన చేస్తా: జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మరింత ముదిరాయి. రేపు సంచలన ప్రకటన చేయనున్నట్లు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ప్రకటించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా పర్యటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చర్చించలేదని.. ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయకుండానే తమతో చర్చించినట్లు ఆయన చెప్పారని ఆరోపించారు. రాజకీయ యుద్ధం చేయాలంటే వ్యూహం ఉండాలన్నారు.

3. కేసీఆర్‌ నుంచి మేం అవినీతి నేర్చుకోవాలా?: కేంద్రమంత్రులు ధ్వజం

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఎనిమిదేళ్ల పాలనపై కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, కిషన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగానూ రాష్ట్ర ప్రజలకు కష్టాలు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. 

Live Blog: భాజపా సభలో ప్రత్యక్షమైన ప్రజాగాయకుడు గద్దర్‌

4. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కాన్వాయ్‌కు ప్రమాదం

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సుఖేందర్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి నల్గొండ వైపు వెళ్తుండగా.. పెద్దఅంబర్‌పేట సమీపంలోకి రాగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి సుఖేందర్‌రెడ్డి క్షేమంగా బయటపడినట్టు సమాచారం.

5. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు: చంద్రబాబు

సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ వేధింపులను తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. సోషల్‌ మీడియా పోస్టుల విషయంలో తెదేపా శ్రేణులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.  గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను అక్రమంగా అదుపులోకి తీసుకొని సీఐడీ వేధించిందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. నోటీసుల పేరుతో అర్ధరాత్రి తలుపులు పగులగొట్టి పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు.

బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

6. ‘ఎక్సైజ్‌’తో పోయింది.. ‘విండ్‌ఫాల్‌’తో వస్తోంది!

ప్రజలపై ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మే నెల ఆఖర్లో పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. దీని వల్ల కేంద్రం భారీ ఎత్తున ఆదాయాన్ని కోల్పోతోంది. అయితే, తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై విధించిన పన్ను; చమురు ఉత్పత్తిపై విధించిన విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌తో.. ఎక్సైజ్‌ సుంకం కోత వల్ల కోల్పోతోన్న ఆదాయంలో దాదాపు మూడొంతులు సర్కార్‌ తిరిగి పొందనుంది.

7. 2002 గోద్రా రైలు దహనం కేసులో నిందితుడికి జీవిత ఖైదు

గోద్రాలో రైలు బోగీలకు నిప్పు పెట్టి 59 మంది కరసేవకుల మరణానికి కారణమైన కేసులో నిందితుడు రఫీక్‌ భతూక్‌కు జీవిత ఖైదు విధించారు. ఈ మేరకు పంచమహల్‌ జిల్లాలోని గోద్రా అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. రఫీక్‌ను 2021లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతడిపై విచారణను వేగవంతం చేశారు.

8. ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను బంధించిన గ్రామస్థులు

జమ్ము కశ్మీర్‌లోని ప్రజల్లో ఉగ్రవాదంపై క్రమంగా చైతన్యం వస్తోంది. తాజాగా ఆదివారం రెయిసీ జిల్లాలోని టక్సన్‌ గ్రామంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను గ్రామస్థులు బంధించి పోలీసులకు అప్పగించారు. వీరిలో లష్కరే కమాండర్‌ తాలిబ్‌ హుస్సేన్‌ కూడా ఉన్నాడు. ఇతను రాజౌరీ జిల్లాకు చెందినవాడు. ఇటీవల ఆ జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుళ్ల వెనుక ఇతడి హస్తం ఉంది. 

9. ఆసియా నాటో ఏర్పాటుకు అమెరికా సాకులు..!

ఆసియాలో నాటో తరహా సైనిక కూటమి ఏర్పాటుకు అమెరికా యత్నాలు చేస్తోందని ఉత్తరకొరియా విమర్శించింది. ఇటీవల దక్షిణ కొరియా, జపాన్‌లతో అమెరికా సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడాన్ని తప్పుపట్టింది. సైనిక కూటమి ఏర్పాటు ప్రణాళికలో ఇదొక భాగమని  ఆరోపించింది.

10. మామ మండలి ఛైర్మన్‌.. అల్లుడు అసెంబ్లీ స్పీకర్‌

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసనమండలి, అసెంబ్లీ స్పీకర్‌గా మామ, అల్లుడు ఎన్నికై రికార్డు సృష్టించారు. శిందే వర్గం మద్దతుతో స్పీకర్‌గా ఎన్నికైన భాజపా నేత రాహుల్‌ నర్వేకర్‌.. మండలి ఛైర్మన్‌గా రామ్‌రాజే నాయక్‌ (Ramraje Naik)కు స్వయానా అల్లుడు. అయితే, మామ మాత్రం ఎన్‌సీపీ (నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ)కి చెందిన వ్యక్తి కాగా.. అల్లుడు మాత్రం భాజపా నేత కావడం విశేషం.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని