Updated : 04 Jul 2022 16:55 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షల తేదీలు విడుదల

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. ఆగస్టు 7న ఎస్సై, ఆగస్టు 21న కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఎస్సై రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 30 నుంచి, కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి బోర్డు వైబ్‌సైట్‌ www.tslprb.inలో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది.

Turkey: టర్కీ అదుపులో రష్యా ధాన్యం రవాణా నౌక

2. మోదీ పర్యటనలో నల్ల బెలూన్లతో నిరసన.. పలువురి అరెస్టు

ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో నల్ల బెలూన్లను ఎగరవేయడంపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. మోదీ గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సమయంలో నల్ల బెలూన్లను ఎగరవేయడంపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ విజయ్‌పాల్‌ నేతృత్వంలో విచారణ ప్రారంభించారు. గన్నవరం పోలీసు స్టేషన్‌లో పలువురు పోలీసు అధికారులతో డీఎస్పీ సమీక్షించారు. 

3. ఆ వీర దంపతుల కుమార్తెకు ప్రధాని మోదీ పాదాభివందనం

అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భీమవరం వచ్చారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మి దంపతుల కుమార్తె పసల కృష్ణభారతికి ప్రధాని పాదాభివందనం చేశారు. ఆమె తల్లిదండ్రులు దేశం కోసం చేసిన త్యాగాన్ని ఆయన ప్రశంసించారు.

4. భాజపా నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదు: హరీశ్‌రావు

భాజపా నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదని.. చెప్పిన అబద్ధాలే మళ్లీ మళ్లీ చెబుతున్నారని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో భాజపా నిర్వహించిన విజయ సంకల్ప సభలో నీళ్లు, నియామకాల విషయంలో కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్పందించారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయం వేదికగా కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు.

5. నేనేం మాట్లాడినా పార్టీ కోసమే.. త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తా: జగ్గారెడ్డి

పార్టీ నుంచి వెళ్లాలనుకుంటే తనను ఆపేదెవరని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ప్రశ్నించారు. తానేం మాట్లాడినా పార్టీ మంచి కోసమేనని, పార్టీ లైన్‌లోనే ఉంటానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ‘కొన్ని ప్రచార మాధ్యమాలు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. త్వరలో మళ్లీ అన్ని విషయాలు వెల్లడిస్తా. నేను ఎవరికీ భయపడను. నేను అనుకున్నదే మాట్లాడతా. పార్టీ కోసం కలిసి పనిచేస్తా’’ అని వెల్లడించారు.

6. ఆ లిస్టులో నా పేరు లేదంటే ఆశ్చర్యపోయా: రఘురామ

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతికి ప్రధాని నరేంద్రమోదీ భీమవరం రావడం గర్వకారణమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రధాని వచ్చినపుడు సభకు వెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందని.. తనను అక్కడికి వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని విమర్శించారు. కొన్ని విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలానే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురామ మాట్లాడారు.

7. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం.. పవార్‌ సంచలన వ్యాఖ్యలు..!

మహారాష్ట్ర(Maharashtra)లో ఏర్పడిన కొత్త అధికార కూటమిపై ఎన్‌సీపీ(NCP) అధినేత శరద్ పవార్(Sharad Pawar) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఆరునెలల్లో కొత్త ప్రభుత్వం కూలిపోవచ్చని, మధ్యంతర ఎన్నికలు రావొచ్చంటూ వ్యాఖ్యానించారు. ముంబయిలో నిన్న సాయంత్రం తన పార్టీ నేతలతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాలను అంచనా వేశారు.

8. కొత్త ప్లాన్‌ల పేరిట టారిఫ్‌లు పెంచేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌!

బీఎస్‌ఎన్‌ఎల్‌(BSNL) ఇటీవల మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. నిశితంగా పరిశీలిస్తే నిజానికి అవి పూర్తిగా కొత్తవి కావు. ఇంతకు ముందు కూడా ఈ ప్లాన్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్ చేసేది. కానీ, ప్రయోజనాలు మాత్రం భిన్నంగా ఉండేవి. ప్రస్తుతం, ఈ ప్లాన్‌లతో అందించే ప్రయోజనాలు ఇంతకు ముందు వినియోగదారులు పొందిన దానికంటే తక్కువగా ఉండటం గమనార్హం.

9. టార్గెట్‌ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!

మహారాష్ట్రలో భాజపా రాజకీయ ప్రణాళికలో ఇప్పటి వరకూ చూసింది కేవలం ట్రైలరే. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీ భారీ వ్యూహాన్నే అనుసరిస్తోంది. దీనిలో భాగంగా శివసేనను చీల్చి రెబల్స్‌కు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించింది. దేవేంద్ర ఫడణవీస్‌ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించేలా అధినాయకత్వం ఒప్పించింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రులుగా చేసిన వారు తర్వాత సాధారణ మంత్రులుగా చేసిన సందర్భాలున్నాయి. 

10. ఈ ఏడాది స్టార్టప్‌లలో 60 వేల ఉద్యోగాల కోత!

ప్రపంచవ్యాప్తంగా అలుముకుంటున్న ఆర్థిక మాంద్యం భయాలు అంకుర సంస్థల్ని (Start Ups) తీవ్రంగా కలవరపెడుతున్నాయి. నిధుల కొరత ఈ కంపెనీలను ఇప్పుడు వేధిస్తున్న ప్రధాన సమస్య. దీంతో నిర్వహణ భారాన్ని తగ్గించుకునే దిశగా చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. ఈ ఏడాది మొత్తంగా భారత్‌లోని అంకుర సంస్థలు 60 వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ఓ ప్రముఖ నివేదిక అంచనా వేసింది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని