Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 05 Jul 2022 16:55 IST

1. టీమ్‌ఇండియాపై ఇంగ్లాండ్‌ విజయం.. సిరీస్‌ సమం

టీమ్‌ఇండియాతో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జోరూట్‌ (142 నాటౌట్‌; 173 బంతుల్లో 19x4, 1x6), జానీ బెయిర్‌ స్టో (114 నాటౌట్‌; 145 బంతుల్లో 15x4, 1x6) శతకాలతో అదరగొట్టారు. 109కే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును వీరిద్దరు ఆదుకున్నారు.

ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

2. ‘బైజూస్‌’తో విద్యార్థులకు మెరుగైన విద్య: సీఎం జగన్‌

పేదరికం నుంచి బయటపడాలంటే చదువు అవసరమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ‘జగనన్న విద్యాకానుక’ కిట్లను ఆయన పంపిణీ చేశారు. ‘నాడు-నేడు’ కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. విద్యార్థుల కోసం బైజూస్‌ సంస్థతో ఒప్పందం చేసుకుని యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చామని చెప్పారు.

3. నన్ను హత్య చేయాలని చూశారు: రఘురామ

భీమవరానికి వెళ్తున్న తనను ఆంధ్రా సరిహద్దులో హత్య చేసేందుకు కుట్ర చేశారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా స్థానిక ఎంపీగా అధ్యక్షత స్థానంలో ఉండాల్సిన తనను భీమవరం రాకుండా ఏపీ పోలీసులు కుట్ర చేశారని వ్యాఖ్యానించారు. డీజీ కార్యాలయం నుంచి వెళ్లిన సమాచారం తన వద్ద ఉందని పేర్కొన్నారు. 

4. ప్రకాశం బ్యారేజీ దిగువన ఆనకట్టల నిర్మాణంపై తెలంగాణ అభ్యంతరం

ఆంధ్రప్రదేశ్‌పై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరోమారు ఫిర్యాదు చేసింది. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు ఆనకట్టల నిర్మాణానికి ప్రతిపాదనలపై అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ రెండు లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌, కృష్ణాబోర్డు అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి వీల్లేదని లేఖలో పేర్కొన్నారు. 

5. అమర్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్‌..

రెండున్నరేళ్ల విరామం తర్వాత ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. హిమాలయ ప్రాంతంలో (Himalayas) నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా పహల్గామ్‌ నుంచి వెళ్లేవారికి అనుమతి ఇవ్వడం లేదని.. దీంతో దాదాపు 3వేల మందిని నున్వాన్‌ బేస్‌ క్యాంపు (Base Camp) వద్దే ఆపివేశామని పేర్కొన్నారు. 

6. నుపుర్‌ శర్మ కేసులో.. సుప్రీంకోర్టు ‘లక్ష్మణ రేఖ’ దాటింది..!

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండైన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ‘లక్ష్మణ రేఖ’ దాటిందని.. దాన్ని సరిదిద్దేందుకు తక్షణ చర్యలు అవసరమని కొంతమంది మాజీ న్యాయమూర్తులు, అధికారులు విమర్శించారు. 

7. స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతికలోపం.. కరాచీలో అత్యవసర ల్యాండింగ్‌

స్పైస్‌జెట్‌కు చెందిన మరో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దిల్లీ నుంచి దుబాయ్‌ వెళ్తోన్న స్పైస్‌జెట్‌ ఎస్‌జీ - 11 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫ్యుయల్‌ ఇండికేటర్‌లో సమస్య తలెత్తడంతో విమానాన్ని పాకిస్థాన్‌లోని కరాచీకి దారిమళ్లించారు. కరాచీ ఎయిర్‌పోర్టులో విమానాన్ని సురక్షితంగా దించేశారు. గత 17 రోజుల్లో స్పైస్‌జెట్‌ విమానాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది ఆరోసారి.

8. కరెన్సీ ముద్రణ నిలిపే దిశగా శ్రీలంక

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో స్థానిక ఉద్యోగులకు జీతాలు, ఇతర ప్రభుత్వ ఖర్చుల కోసం కరెన్సీ ముద్రణ మాత్రమే కొనసాగుతోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం భారీగా పెరిగి 60శాతానికి చేరడంతో దీనిని కట్టడి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకొంది. ఆసియాలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న దేశం ఇదే. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలోకి నగదును చొప్పించడం ఆపాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికోసం కొత్తగా కరెన్సీ ముద్రణను నిలపాల్సి వస్తుంది.

9. స్నేక్‌ ఐలాండ్‌పై ఎగిరిన ఉక్రెయిన్‌ పతాకం

నల్ల సముద్రంలోని స్నేక్‌ ఐలాండ్‌పై ఎట్టకేలకు ఉక్రెయిన్‌ పతాకం ఎగిరింది. గత వారం సద్భావన చర్యగా చెబుతూ రష్యా దళాలు ఇక్కడి నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్‌ దక్షిణ మిలటరీ కమాండ్‌ ప్రతినిధి నటాలియా హ్యూమెనియూక్‌ ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ‘‘ అక్కడి సైనిక చర్య పూర్తయింది. ఆ భూభాగం(స్నేక్‌ ఐలాండ్‌) ఉక్రెయిన్‌ పరిధిలోకి వచ్చింది’’ అని పేర్కొన్నారు. రష్యా దళాలను తరిమికొట్టినట్లు చెప్పారు.

10. కీవే నుంచి కె లైట్‌ 250వీ బైక్‌ @ రూ.2.89 లక్షలు

హంగేరీకి చెందిన ద్విచక్రవాహన తయారీ సంస్థ కీవే భారత్‌లో కె-లైట్‌ 250వీ పేరిట కొత్త బైక్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.2.89 లక్షలు (ఎక్స్‌షోరూం). 249 సీసీ ఇంజిన్‌ సామర్థ్యంతో వస్తోన్న ఈ బైక్‌ డెలివరీలు ఈనెల మూడో వారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీన్ని మొత్తం మూడు రంగుల్లో అందిస్తున్నారు. రంగులను బట్టి ధరలు మారతాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని