Updated : 06 Jul 2022 17:15 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. డోలో-650 తయారీ సంస్థపై ఐటీ దాడులు..

పాపులర్‌ ఔషధం డోలో-650 (Dolo-650) తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌పై (Micro Labs) ఐటీ శాఖ సోదాలు జరిపింది. బెంగళూరులోని రేస్‌ కోర్స్‌ రోడ్డులోని ఆ కంపెనీ కార్యాలయంలో దాదాపు 20మంది అధికారుల బృందం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో జరిపిన ఈ దాడుల్లో కార్యాలయంలో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అలాగే, దిల్లీ, సిక్కిం, పంజాబ్‌, తమిళనాడు, గోవాలతో పాటు దేశవ్యాప్తంగా 40 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపింది.

వంటగ్యాస్‌ మంట.. ఏడాదిలో రూ.244 పెంపు

2. ఆంధ్రప్రదేశ్‌లో అద్దె బస్సులకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌లో 659 అద్దె బస్సులు ప్రవేశ పెట్టేందుకు ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. 9 ఏసీ స్లీపర్, 47 నాన్‌ ఏసీ, 6 ఇంద్ర, 46 సూపర్ లగ్జరీ, 22 అల్ట్రా డీలక్స్, 70 ఎక్స్‌ప్రెస్, 208 అల్ట్రా పల్లె వెలుగు, 203 పల్లె వెలుగు, 39 మెట్రో ఎక్స్‌ప్రెస్, 9 సిటీ ఆర్డినరీ బస్సులకు టెండర్లు పిలిచింది. ఆసక్తి ఉన్నవారు MSTC ఈ కామర్స్ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. నేటి నుంచి ఈ నెల 27 వరకు బిడ్లు దాఖలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. apsrtc.ap.gov.in వెబ్‌సైట్‌లో టెండర్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించారు.

గల్లంతైన జాలర్ల ఆచూకీ కనిపెట్టడండి: సీఎస్‌కు చంద్రబాబు లేఖ

3. నెలకు ఒక్క లీడర్‌నైనా భాజపాలోకి తీసుకొస్తా: విశ్వేశ్వర్‌రెడ్డి

‘భాజపాలో సరైన కమిటీలో నాకు అవకాశం కల్పించారు. నెలకి ఒక్క లీడర్‌ను అయినా పార్టీలోకి తీసుకొస్తా’ అని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టేందుకు అవకాశం లేదన్నారు. ఇతర పార్టీలకు తెరాసను ఢీకొట్టే సత్తా లేదని.. కేసీఆర్‌ను అడ్డుకోవడం భాజపాకే సాధ్యమని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసి సన్మానించారు. 

4. దోచుకున్న ప్రతి రూపాయీ ప్రజలు కక్కిస్తారు: యనమల

అవార్డుల పేరుతో వాలంటీర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.485.44 కోట్లు దోచిపెడుతోందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఇప్పటికే ప్రకటనల ద్వారా సొంత పత్రిక సాక్షికి ఈ మూడేళ్లలో రూ.280కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేశారని ఆక్షేపించారు. ఈ మేరకు సీఎం జగన్‌పై పలు విమర్శలు చేశారు. ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

5. కోహ్లీ, స్మిత్‌లను దాటేసిన రూట్‌ 

భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జో రూట్‌.. తాజాగా మరో రికార్డును అధిగమించాడు. భారత్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌లతో సమానంగా రూట్‌ 27 సెంచరీలు చేశాడు. అయితే బర్మింగ్‌హామ్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శతక్కొట్టి తన కెరీర్‌లో 28వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ప్రస్తుత ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా నిలిచాడు.

6. ‘కాళీ’ వివాదం.. మహువాపై కేసు నమోదు..!

మతపరమైన వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. ఒక సినిమా పోస్టర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆమెను అరెస్టు చేయాలని భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కోల్‌కతాలో నిరసన చేపట్టడమే కాకుండా టీఎంసీ నుంచి ఆమెను సస్పెండ్‌ చేయాలని ఆందోళన చేపట్టారు.

7. రెండో వివాహం చేసుకోబోతోన్న సీఎం భగవంత్‌ మాన్‌!

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. గురువారం ఆయన రెండో వివాహం చేసుకోబోతున్నారు. డా.గుర్‌ప్రీత్‌ కౌర్‌ అనే మహిళతో చండీగఢ్‌లో పరిమిత సంఖ్యలో అతిథుల సమక్షంలో మాన్‌ వివాహం జరగనున్నట్టు సమాచారం. భగవంత్‌ మాన్‌కు ఇది రెండో వివాహం. గతంలో ఆయనకు ఇంద్రప్రీత్‌ కౌర్‌తో  వివాహం జరిగినప్పటికీ ఆరేళ్ల క్రితమే ఇద్దరూ విడిపోయారు. 

8. త్వరలో బంగారు నాణేలు ముద్రించనున్న జింబాబ్వే..!

భయంకరమైన ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్న జింబాబ్వే ఓ సంచలన నిర్ణయం తీసుకొంది. ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు ఏకంగా బంగారు నాణేలను ముద్రించాలని నిర్ణయించింది. దీంతోపాటు వచ్చే ఐదేళ్లలో అమెరికా డాలర్‌ను కరెన్సీగా వాడాలనే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం 190శాతాన్ని మించిపోవడంతో ఇటీవల అక్కడి కేంద్ర బ్యాంక్‌ వడ్డీ రేట్లను రెండు రెట్లు పెంచింది. 

9. సిడ్నీకి జల గండం..!

ఆస్ట్రేలియాలోని అందాల నగరం సిడ్నీ తరచూ వరదల్లో మునుగుతోంది . ఈ నగరం ఉన్న ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్రం గత 18 నెలల్లో నాలుగు భయంకరమైన జలప్రళయాలను చూసింది. పెరుగుతున్న వాతావరణ మార్పులకు భౌగోళిక పరిస్థితులు ఆజ్యం పోయడంతో సిడ్నీవాసులు వరదల తాకిడి నుంచి కోలుకోలేకపోతున్నారు. ఆస్ట్రేలియా వరదలు కేవలం స్థానికులకు మాత్రమే ఆందోళనకరం కాదు.. అవి ప్రపంచానికే ఓ హెచ్చరిక..!

10. మరింత సంక్షోభంలో బోరిస్‌ సర్కారు.. మరో ఇద్దరు మంత్రుల రాజీనామా

బ్రిటన్‌లో బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వం మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రధాని జాన్సన్‌పై విశ్వాసం కోల్పోయామని చెబుతూ నిన్న ఇద్దరు సీనియర్‌ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు మంత్రులు కూడా వైదొలిగారు. శిశు, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విల్ క్విన్‌ బుధవారం ఉదయం ట్విటర్‌ వేదికగా తన రాజీనామాను ప్రకటించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts