Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Jun 2024 17:06 IST

1. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటిబ్లాక్‌లోని తన ఛాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచుతాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్‌ అందిస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. దిల్లీలో గురువారం ఆయన కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రికార్డు సమయంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తి: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

తనకు అప్పగించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంపూర్ణ న్యాయం చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. దిల్లీలోని రాజీవ్‌ గాంధీ భవనలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. రికార్డు సమయంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను పూర్తి చేసి విమానాలను ల్యాండ్‌ చేస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా

వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సహా మరో నాలుగు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌.. గడువు మరోసారి పొడిగింపు

ఆధార్‌ (Adhaar) వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. దీంతో ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 2024 జూన్‌ 14తో గడువు ముగియనుండగా.. సెప్టెంబర్‌ 14 వరకు పెంచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ట్రాయ్‌ కొత్త సిఫార్సులు.. ఫోన్‌ నంబర్‌కూ ఇక ఛార్జీ..?

టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) కొత్త సిఫార్సులకు సిద్ధమైంది. ఫోన్‌ నంబర్‌కు, ల్యాండ్‌లైన్‌ నంబర్‌కు ఛార్జీలు వసూలు చేయాలనుకుంటోంది. అదే జరిగితే మొబైల్‌ ఆపరేటర్ల నుంచి తొలుత ఈ ఛార్జీలు వసూలు చేస్తే.. ఆయా కంపెనీలు యూజర్ల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దిండుతో ఊపిరాడకుండా చేసి.. బంగ్లా ఎంపీ హత్య కేసులో కీలక వివరాలు

వ్యక్తిగత పర్యటన నిమిత్తం కోల్‌కతాకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజిమ్‌ అనార్‌ హత్య కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. అతడు అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన వెంటనే ఇద్దరు వ్యక్తులు అతని ముఖానికి దిండు అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. యడియూరప్పను అరెస్టు చేయవచ్చు: కర్ణాటక మంత్రి

కర్ణాటక భాజపా అగ్రనేత బీఎస్‌ యడియూరప్ప (BS Yediyurappa)ను పోక్సో కేసులో అవసరమైతే అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి జి.పరమేశ్వర గురువారం వెల్లడించారు. సీఐడీ దీనిపై నిర్ణయం తీసుకొంటుందని పేర్కొన్నారు. బుధవారం అధికారులు ఆయనకు సమన్లు పంపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. న్యూయార్క్‌ స్టేడియం వద్ద బుల్డోజర్లు.. కూల్చివేతకు రంగం సిద్ధం!

టీ20 ప్రపంచ కప్‌ టోర్నీకి సహ ఆతిథ్య దేశంగా యూఎస్‌ఏ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మెగా సంగ్రామం కోసం న్యూయార్క్‌లో తాత్కాలికంగా స్టేడియాన్ని నిర్మించారు. ఈ మైదానంలో భారత్‌ మూడు మ్యాచ్‌లు ఆడింది. తాజాగా యూఎస్‌ఏతో మ్యాచ్‌ అనంతరం ఆ వేదికను తొలగించేందుకు బుల్డోజర్లను సిద్ధం చేసి ఉంచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మెట్లపైనే కాలిపోయిన మృతదేహాలు.. కువైట్‌ అగ్నిప్రమాదంలో భయానక దృశ్యాలు

కువైట్‌ (Kuwait)లోని మంగాఫ్‌లో ఉన్న భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటన మృతుల్లో 42మంది భారతీయులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మెట్లపై కాలిపోయిన మృతదేహాలు కనిపించాయని స్థానిక మీడియా వెల్లడించింది. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీలో నుంచి దూకి గాయపడ్డారని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని