Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Jun 2024 17:03 IST

1. రామోజీరావు సంస్మరణ సభ..

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. రామోజీరావు సంస్మరణ సభకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యక్షప్రసారం కోసం క్లిక్‌ చేయండి 

2. ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్‌కు లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. ‘‘పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్‌కు లేదు. దానికి పునాది వేసింది కేసీఆరే. గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆయన లాక్కున్నారు. ఆ విషయం ఆయనకు గుర్తులేదా?’’ అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కక్ష సాధింపు ఉంటే.. ఇంతకాలం ఆగుతామా?: ఏపీ హోంమంత్రి అనిత

‘రెడ్‌ బుక్‌’ కక్ష సాధింపు చర్యలకు కాదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులపై చట్టపరంగా చర్యలుంటాయని చెప్పారు. తమకు కక్ష సాధింపు ఉంటే.. ఇంతకాలం ఆగుతామా?అని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలం పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం సీఎస్‌గా నీరభ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్

వైకాపా నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గట్టి షాక్‌ తగిలింది. సొంత నియోజవర్గం పుంగనూరులో మున్సిపల్‌ ఛైర్మన్‌ అలీంబాషాతో పాటు 11 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక తెదేపా ఇన్‌ఛార్జ్‌ చల్లా బాబు ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు వెల్లడించారు. త్వరలో వారంతా తెదేపాలో చేరనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో అరెస్టులు మొదలుపెట్టిన సీబీఐ

నీట్‌-యూజీ 2024 పరీక్ష పేపర్‌ లీక్‌ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. దీనికి సంబంధించి అరెస్టులు మొదలుపెట్టింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మనీశ్‌ ప్రకాశ్‌, అశుతోష్‌ను బిహార్‌లోని పట్నాలో అదుపులోకి తీసుకొంది. ఈ కేసులో లీకైన పేపర్‌ను పొందిన విద్యార్థులను మనీశ్‌ తన కారులోనే తరలించినట్లు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రెండేళ్ల తర్వాత దేశంలో తగ్గిన గృహ విక్రయాలు

దేశంలో గృహ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 8 శాతం విక్రయాలు క్షీణించాయి. ఇళ్ల విక్రయాల్లో తగ్గుదల నమోదుకావడం రెండేళ్లలో ఇదే తొలిసారి అని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ అన్‌రాక్‌ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దేశవ్యాప్తంగా బుల్లెట్‌ రైళ్లు.. సాధ్యాసాధ్యాలపై త్వరలో అధ్యయనం..!

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో బుల్లెట్‌ రైళ్ల గురించి ప్రస్తావించారు. ‘‘నా ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుల్లెట్‌ రైల్‌ కారిడార్లను విస్తరించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట్టనుంది. తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో ఇవి జరగనున్నాయి’’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సూచీల రికార్డుల పరుగు.. సెన్సెక్స్‌@ 79000.. నిఫ్టీ@ 24000

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల ర్యాలీ కొనసాగుతోంది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు తర్వాత పుంజుకొని సరికొత్త రికార్డులను తిరగరాశాయి. వరుసగా కొత్త జీవనకాల గరిష్ఠాలను నెలకొల్పుతూ వస్తున్న సూచీలు.. మరో కీలక మైలురాయిని అధిగమించాయి. సెన్సెక్స్ 79 వేలు, నిఫ్టీ 24 వేల పాయింట్ల మార్కును దాటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అందరి దృష్టి రెండో సెమీఫైనల్‌పైనే .. వాతావరణం లేటెస్ట్‌ అప్‌డేట్‌

టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌-2లో భారత్‌-ఇంగ్లాండ్‌ పోటీపడనున్నాయి. మరికొన్ని గంటల్లో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌కు వర్షం గండం పొంచి ఉండటం మరింత ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకు వాతావరణం పొడిగానే ఉన్నా మ్యాచ్‌ ప్రారంభమయ్యేసరికి చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని