Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Jun 2024 17:06 IST

1. పోలవరాన్ని చూస్తే నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి: సీఎం చంద్రబాబు

పోలవరాన్ని జగన్‌ గోదావరిలో ముంచారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్‌ చేసిన నష్టమే ఎక్కువన్నారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతిని రాష్ట్ర ప్రజల ముందుంచిన ఆయన.. పోలవరాన్ని చూస్తే తన కళ్లవెంట నీళ్లొచ్చాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భారాసకు మరో షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే

భారత రాష్ట్ర సమితి (భారాస)కు మరో షాక్‌ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, తెలంగాణ మాజీ స్పీకర్‌, భారాస బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పీవీ సేవలను తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది: మంత్రి కోమటిరెడ్డి

దివంగత ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీ నేత అని చెప్పుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌లో మంత్రి సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తా: తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా

తెదేపా ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి ప్రభుత్వంలో భాగం చేయడమే ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తానన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఏయూ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ రాజీనామా

ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ స్టీఫెన్‌సన్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇన్‌ఛార్జ్‌ రిజిస్ట్రార్‌గా ప్రొ. కిశోర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. గత ఐదేళ్లలో ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి యూనివర్సిటీని భ్రష్టు పట్టించారంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పరీక్షల విధానంలో సంస్కరణలు.. సలహాల కోసం వెబ్‌సైట్‌ ప్రారంభం

పరీక్షల నిర్వహణ విభాగం ఎన్‌టీఏలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం విద్యార్థులు, తల్లిదండ్రులు సూచనలు కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన https://innovateindia.mygov.in/examination-reforms-nta/ వెబ్‌సైట్‌ ద్వారా తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయవచ్చని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సభలో రాహుల్ గాంధీ మైక్‌ మ్యూట్ చేశారు.. కాంగ్రెస్ ఆరోపణలు

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ‘నీట్ పేపర్ లీక్‌’ వ్యవహారంపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. దానికిముందు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఈ అంశం లేవనెత్తగానే మైక్‌ ఆపేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈమేరకు ఎక్స్ (ట్విటర్‌) వేదికగా ఒక వీడియోను షేర్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ₹21 లక్షల కోట్లకు రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌.. తొలి భారతీయ కంపెనీగా చరిత్ర

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ మరోసారి అరుదైన ఘనత సాధించింది. మార్కెట్‌ విలువ పరంగా రూ.21 లక్షల కోట్లతో సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌ నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో ఏకైక టెస్టు.. భారత ఓపెనర్ల సరికొత్త రికార్డు

భారత మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. టెస్టుల్లో తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నమోదు చేసిన ఘనతను ఖాతాలో వేసుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో స్మృతి మంధాన (149), షఫాలీ వర్మ (128*) సెంచరీలు బాదేశారు. దీంతో తొలి వికెట్‌కు 292 పరుగులు (52 ఓవర్లలో) జోడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. సురక్షిత స్థానాలకు వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు ఎమర్జెన్సీ నెలకొంది. దీంతో వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌లు తప్పనిసరిగా బోయింగ్‌ స్టార్‌లైనర్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఐఎస్‌ఎస్‌కు అత్యంత సమీపంలో భారీగా ఉపగ్రహ వ్యర్థాలు సంచరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని