Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Jul 2024 17:06 IST

1. ఏపీ, తెలంగాణ నాకు రెండు కళ్లు: సీఎం చంద్రబాబు

ఏపీలో విజయానికి తెలంగాణ తెదేపా శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తెలంగాణ గడ్డపై తెదేపాకు పునర్‌ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అని వ్యాఖ్యానించారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు చంద్రబాబు తొలిసారి వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అందరిదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద ఇస్కాన్‌ టెంపుల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను ఆయన ప్రారంభించారు. అనంతరం స్వామి వారికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు వస్తుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.  జగనన్న మెగా లేఅవుట్‌లో అక్రమాలు.. కొత్త సర్కారు విచారణ!

జగనన్న మెగా లేఅవుట్‌లలో లబ్ధిదారులకు నివాస స్థలాల కేటాయింపు మొదలు.. ఇళ్ల మంజూరు, గుత్తేదారుల ఎంపిక, అప్పగింత, బిల్లుల చెల్లింపు వరకు జరిగిన అక్రమాలన్నీ క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో జగనన్న మెగా లేఅవుట్‌లో జరిగిన అక్రమాలపై కొత్త ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వీడియో కోసం క్లిక్‌ చేయండి 

4. సీఎం చంద్రబాబు ఇంటిచుట్టూ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు చక్కర్లు

ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు ఆ రాష్ట్ర మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పీఎస్‌ఆర్ ఆంజనేయులు యత్నించారు. అపాయింట్‌మెంట్‌ లేదని సీఎంవో అధికారులు చెప్పినా హైదరాబాద్‌లోని సీఎం ఇంటిచుట్టూ చక్కర్లు కొట్టారు. ఆదివారం పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు రెండుసార్లు అక్కడికి వెళ్లారు. అపాయింట్‌మెంట్ లేకపోవడంతో సీఎం ఇంటి గేటుదగ్గరే పీఎస్‌ఆర్‌ను భద్రతా సిబ్బంది వెనక్కి పంపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆ ‘లోన్‌ యాప్‌’తో జాగ్రత్త.. ప్రభుత్వం హెచ్చరిక

ఆన్‌లైన్‌లో అనుమానాస్పద కార్యకలాపాలు, మోసాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. ‘క్యాష్‌ఎక్స్‌పాండ్‌-యూ’ పేరిట ఆన్‌లైన్‌లో రుణాలు అందించే యాప్‌ నకిలీదేనని పేర్కొంది. అంతేకాకుండా ఈ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించామని, యూజర్లు కూడా ఫోన్లలో వెంటనే తొలగించాలని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత

దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గర్వాల్ ప్రాంతంలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో చార్‌ధామ్‌ యాత్రను వాయిదా వేసినట్లు గర్వాల్‌ కమిషనర్‌ వినయ్‌ శంకర్‌ పాండే తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ద్రవిడ్‌కు ‘భారతరత్న’ ఇవ్వడమే సముచితం: సునీల్ గావస్కర్

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రధాన కోచ్‌గా తన మూడేళ్ల పదవీకాలాన్ని ఇటీవలే ముగించాడు. టీ20 ప్రపంచ కప్‌ను రెండోసారి ముద్దాడాలనే సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఈ క్రమంలో ద్రవిడ్‌ని భారత రత్నతో కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తే బాగుంటుందని క్రికెట్ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ వ్యాఖ్యానించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చిన్నారుల భద్రతపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సాయితేజ్‌ విజ్ఞప్తి.. ఎక్స్‌ వేదికగా పోస్ట్‌!

సోషల్‌ మీడియా ప్రమాదకరంగా మారిందని, పిల్లల ఫొటోలు/వీడియోలు పోస్ట్‌ చేయడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని నటుడు సాయి దుర్గా తేజ్‌ తల్లిదండ్రులకు సూచించారు. ‘‘కొన్ని మానవ మృగాల నుంచి పిల్లలను రక్షించుకోవాలని పేరెంట్స్ అందరికీ నా విజ్ఞప్తి. మీ పిల్లల ఫొటోలు, వీడియోలను నెట్టింట పోస్ట్‌ చేసేటప్పుడు కాస్త ఆలోచించండి’’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జగన్నాథుడి రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు

ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్ర కోలాహలం నెలకొంది. ఆ రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో పూరీ కిక్కిరిసిపోయింది. జై జగన్నాథ్, హరిబోల్‌ నామస్మరణతో అక్కడి వీధులన్నీ మార్మోగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మైనర్ల చేతిలో అశ్లీల కంటెంట్‌.. అడ్డుకట్టకు స్పెయిన్‌ వినూత్న ఆలోచన!

స్పెయిన్‌లో అశ్లీల చిత్రాల వీక్షణ అధికమైనట్లు ‘డేల్ ఉనా వుల్టా’ అనే స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. 15 ఏళ్ల కంటే తక్కువ వయసు వారిలో సగం మంది అశ్లీల చిత్రాలను వీక్షిస్తున్నట్లు తేలింది. దీన్ని అడ్డుకునేందుకు ‘కార్టెరా డిజిటల్‌ బీటా’ యాప్‌ను తీసుకొస్తున్నారు. దీని ద్వారా వయసు ధ్రువీకరిస్తారు. 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారికి యాక్సెస్‌ లభించదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని