Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 09 Jul 2024 16:59 IST

1. ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు: సీఎం చంద్రబాబు

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ‘‘ఐదేళ్లలో విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. గత ఐదేళ్లలో ప్రజలపై రూ.32,166 కోట్ల ఛార్జీల భారం మోపారు. విద్యుత్‌ రంగంలో రూ.49,596 కోట్లు అప్పులు చేశారు’’అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. క్రికెటర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు టీమ్‌ ఇండియా జెర్సీని బహూకరించారు. టీ20 ప్రపంచకప్ సాధించినందుకు సిరాజ్‌ను సీఎం అభినందించారు. సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో రూ.5.4లక్షల కోట్లతో రుణప్రణాళిక: ఎస్‌ఎల్‌బీసీ ఆమోదం

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే 2024-25 సంవత్సరానికి గానూ రూ.5.4లక్షల కోట్లతో రుణ ప్రణాళికను ఎస్‌ఎల్‌బీసీ విడుదల చేసింది. అందులో రూ.3.75లక్షల కోట్లు ప్రాధాన్య రంగాలకు కేటాయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఉగ్రదాడులకు ప్రతీకారం తప్పదు.. భారత్‌ వార్నింగ్‌

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల పర్యటకుల వాహనంపై దాడి ఘటనను మరువకముందే మరో ఘాతుకానికి పాల్పడ్డారు. కఠువా జిల్లాలో సైనిక వాహనంపై చేసిన మెరుపుదాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత రక్షణ మంత్రిత్వశాఖ.. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదుల అంతు చూస్తామని హెచ్చరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పుతిన్‌తో మోదీ ఆలింగనం.. తీవ్రంగా స్పందించిన జెలెన్‌స్కీ

భారత ప్రధాని నరేంద్రమోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. ఆయనకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రత్యేకంగా ఆతిథ్యమిచ్చారు. వీరిద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ పరిణామాలపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. పుతిన్‌తో మోదీ భేటీ తమను నిరాశపర్చిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రాణించిన సూచీలు.. మరోసారి సరికొత్త గరిష్ఠాలకు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి.  ముఖ్యంగా బ్లూచిప్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు సూచీలను నడిపించింది. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 80,397.17, నిఫ్టీ 24,433.20 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. హాథ్రస్‌ తొక్కిసలాటకు కారణమేంటీ? సిట్‌ నివేదిక ఏం చెప్పిందంటే..!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం విస్తృత విచారణ జరిపింది. తొక్కిసలాటకు నిర్వాహకులదే బాధ్యత అని, స్థానిక యంత్రాంగం కూడా ఉదాసీనంగా వ్యవహరించిందని సిట్‌ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్‌.. 13న ఈ సర్వీసులు పనిచేయవ్‌!

ప్రైవేటు రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC bank) జులై 13న సిస్టమ్‌ అప్‌గ్రేడ్‌ చేపడుతోంది. శనివారం ఉదయం 3 గంటల నుంచి ఆ రోజు సాయంత్రం 4.30 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఆ సమయంలో కొన్ని సర్వీసులు అందుబాటులో ఉండవని బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రిటైర్మెంట్‌పై డేవిడ్ వార్నర్‌ యూ టర్న్‌.. ఆ టోర్నీలో మాత్రమే ఆడతాడట

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్‌పై యూ టర్న్‌ తీసుకున్నాడు. ఆసీస్‌ తరఫున మరోసారి ఆడాలని ఉందంటూ వార్నర్‌ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టాడు. అధ్యాయం ముగిసింది అంటూనే సెలక్టర్లు ఎంపిక చేస్తే 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడతానంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అంబానీల ఇంట పెళ్లి భోజనాలు.. మెనూలో ఇవి!

జులై 12న జరగబోయే అంబానీ ఇంట పెళ్లి భోజనాలకు సంబంధించిన మొత్తం మెనూ తెలియదు గానీ, కొంత మాత్రం బయటకి వచ్చింది. టిక్కీ, టమాటా చాట్‌, పాలక్‌ చాట్‌, చనా కచోరి, దహీ పూరి, బనారస్‌ చాట్‌, కుల్ఫీ, ఫలూదా తదితర ఆహార పదార్థాలను అతిథుల కోసం తయారుచేయనున్నారు. వీటిని ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీయే స్వయంగా ఎంపిక చేశారట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు