Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Mar 2023 09:11 IST

1. సభలోనే లేని భవాని.. స్పీకర్‌పై ఎలా దాడి చేస్తారు?

‘‘తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఈ నెల 20న అసలు శాసనసభకే రాలేదు. కానీ ఆమె కూడా స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై దాడి చేసినట్లు ఈ నెల 21న ‘సాక్షి’ పత్రికలో ఫొటో ప్రచురించారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉంటుందా?’’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ‘‘దీనికి బాధ్యులెవరు? జగన్‌మోహన్‌రెడ్డా? భారతిరెడ్డా?’’ అని ప్రశ్నించారు. ఎవర్ని మోకాళ్లపై కూర్చోబెట్టాలో మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మొక్కుబడి తంతుగా ఇంటర్న్‌షిప్‌ వ్యవహారం

ప్రభుత్వం ఎంతో గొప్పగా చెబుతున్న డిగ్రీ ఇంటర్న్‌షిప్‌ మొక్కుబడి తంతుగా మారింది. విద్యార్థుల చదువుకు..వారి ఉపాధికి సంబంధం లేకుండా ఏదో ఒక దాంట్లో ఇంటర్న్‌షిప్‌ కేటాయించేస్తున్నారు. యువత ఆసక్తినీ పట్టించుకోవడం లేదు. విద్యార్థులను సర్దుబాటు చేసేందుకు స్థానికంగా పరిశ్రమలు లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. చిన్నచిన్న బేకరీలు, హోటళ్లు, బ్యూటీపార్లర్లు, ఎంబ్రైడరీ, కుట్టు, అల్లికలు, మండల కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలు ఇలా ఒకటేమిటి ఏది కనిపిస్తే దాంట్లో ఇంటర్న్‌షిప్‌కు పంపిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పన్ను.. ఆదాయం.. వివరాలన్నీ యాప్‌లో

పన్ను చెల్లింపుదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ‘ఏఐఎస్‌ ఫర్‌ ట్యాక్స్‌పేయర్‌’ పేరుతో ఈ యాప్‌ గూగుల్‌ ప్లే, యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉందని బుధవారం ఐటీ విభాగం తెలిపింది. దీన్ని ఉచితంగానే వినియోగించుకోవచ్చు. ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక సమాచార నివేదిక (యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌- ఏఐఎస్‌), పన్ను చెల్లింపుదారు సమాచారం (ట్యాక్స్‌పేయర్‌ ఇన్ఫర్మేషన్‌ సమ్మరీ - టీఐఎస్‌) చూసుకునేందుకు వీలవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. టాస్‌ గెలిచాక తుది జట్టు.. ఐపీఎల్‌లో నిబంధనల మార్పు 

ఐపీఎల్‌ కెప్టెన్లు ఇక టాస్‌ పడ్డాక తుది జట్లను ప్రకటించవచ్చు. ఈ మేరకు నిబంధనల్లో బీసీసీఐ మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం కెప్టెన్లు టాస్‌కు ముందే తుది జట్టు వివరాలను ప్రకటించాలి. ‘‘రెండు జట్ల కెప్టెన్లు.. 11 మందితో కూడి తుది జట్టు, అయిదుగురు సబ్‌స్టిట్యూట్ల వివరాలను టాస్‌ తర్వాత లిఖిత పూర్వకంగా ఐపీఎల్‌ మ్యాచ్‌ రిఫరీకి అందించవచ్చు. ముందు తుది జట్టును వెల్లడించినా.. మ్యాచ్‌ ఆరంభానికి ముందు ప్రత్యర్థి కెప్టెన్‌ అనుమతి లేకుండా మార్పులు చేసుకోవచ్చు’’ అని బీసీసీఐ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కన్నీరే మిగిలింది.. ఆదుకోండి సారూ!

‘ముఖ్యమంత్రి సారూ! ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా నీటి పాలైంది. వాన దేవుడి దెబ్బకు ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. మొక్కజొన్నంతా నేల వాలింది. రూ.లక్షలు పోసి సాగు చేసిన మిర్చి.. రాళ్ల దెబ్బలకు అక్కరకు రాకుండా పోయింది. వరి, కూరగాయలు అన్నీ ఆగమయ్యాయి. మునిగిన మా పంటల్ని చూసి కరుణించండి. మరోసారి పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. మా శ్రమకు తగ్గ పరిహారం ఇచ్చి ఆదుకోండి’ సహాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు ముఖ్యమంత్రికి చేసుకుంటున్న వేడుకోలు ఇది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సైకిల్‌ తొక్కితే బరువు తగ్గొచ్చు..

ఈరోజుల్లో అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగినా... వ్యాయామం చేయడంలో మహిళలు ఇప్పటికీ వెనకబడే ఉన్నారు. సమయాభావం, జిమ్‌కి వెళ్లలేకపోవడం వంటివెన్నో ఇందుకు కారణాలు... ఇలాంటప్పుడు సైక్లింగ్‌ని ఎంచుకుంటే మీరు కోరుకున్న ఫలితాలు వస్తాయంటారు వ్యాయామ నిపుణులు. మరి దాని ప్రయోజనాలు చూద్దామా. వారంలో మూడుసార్లైనా సైకిల్‌ తొక్కి చూడండి. కొలెస్ట్రాల్‌, రక్తపోటు అదుపులో ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పగలు వద్దు.. రాత్రి తవ్వుకోండి!

పక్క చిత్రంలోని పొలం చూశారు కదా! ఒక పక్క సాగు నీటి కాలువ, మరోపక్క డ్రైనేజీ ఉండేది. పంటలు పండే బంగారు భూములు. ఎంచక్కా రాత్రికి రాత్రే చేపల చెరువుగా మారిపోయింది. ఆక్వా జోన్‌, సీఆర్‌జడ్‌ లాంటి నిబంధనలు అవసరం లేదు. మత్స్యశాఖ నుంచి అనుమతులు అవసరం లేదు. రెవెన్యూ శాఖ నుంచి అనుమతి లేదు. కానీ రాత్రికి రాత్రే తవ్వేశారు. ఇక కాలువలకు నీరు విడుదల చేస్తే.. చెరువుల్లో నింపి ఆక్వా కల్చర్‌ సాగు చేయడమే.. రూ.లక్షల్లో లీజుకు ఇవ్వడమే..!  కావాల్సిందల్లా అధికారి పార్టీ నేతల హామీ మాత్రమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. విశాఖ ఉక్కుపై.. నష్టాల నెపమా?

ఏపీలో కేంద్ర ప్రభుత్వ   రంగంలో నడుస్తోన్న అతిభారీ పరిశ్రమ విశాఖ ఉక్కు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కల్పవృక్షంలాంటి పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. తాజాగా పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికల్లోనూ ‘విశాఖ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల దేశవ్యాప్తంగా ఉక్కు రంగంలో 2.1% మేర ఉత్పత్తి తగ్గింది’ అని పేర్కొనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇది మినీ వ్యానా.. బస్సా!

పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు పరుగెడుతున్నాయి. ఏమాత్రం వాహనం అదుపు తప్పినా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకునే వారు కరవయ్యారు. వాడరేవు-పిడుగురాళ్ల రహదారిలో మినీ వ్యానులో ఎక్కిన ప్రయాణికులను గమనిస్తే ‘ఇంత మంది ఎలా సాధ్యం’ అనే అనుమానం కలగకమానదు. ప్రధాన రహదారిలో పెద్ద సంఖ్యలో పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు వెళుతున్నా అధికారుల తనిఖీలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇంటి పన్నులో చెత్త అనుసంధానం

కర్నూలు నగర వాసులపై భారం మోపేందుకు కార్పొరేషన్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కచ్చితంగా చెత్త పన్ను వసూలు చేయాలన్న లక్ష్యంతో ఆస్తి పన్నులో అనుసంధానం చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. నగర పరిధిలో 52 వార్డుల్లో ఆరు లక్షల జనాభా ఉంది. నిత్యం 181 టన్నుల చెత్త పోగవుతోంది. ఇంటింటి సేకరణ బాధ్యత ఏజెన్సీకి అప్పగించారు.. 91 ఆటోలు సమకూర్చారు. ప్రతి ఇంటికి మూడు ప్లాస్టిక్‌ డబ్బాలు ఇచ్చారు. తడి, పొడి, హానికారక వ్యర్థాలు అందులో వేసి ఉదయం వేళ వీధుల్లోకి వచ్చే ఆటోలకు ఇవ్వాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు