Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 Jun 2021 09:17 IST

1. తల్లికి టీకా.. బిడ్డకూ రక్ష

పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్ల వారి పిల్లలకు కూడా యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని, ఇది వ్యాక్సిన్‌ వల్ల కలిగే అదనపు ప్రయోజనమని ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ స్పష్టం చేశారు. ఇన్‌యాక్టివేటెడ్‌ వ్యాక్సిన్‌ను గర్భిణులకు ఇవ్వడం సురక్షితంగానే భావిస్తున్నామన్నారు. వ్యాక్సిన్‌ వేసుకోనివారికంటే వేసుకొన్న వారిలో పరిస్థితి తీవ్రరూపం దాల్చి ఆసుపత్రిలో చేరిన, ఐసీయూలోకి వెళ్లిన వారి సంఖ్య చాలా తక్కువని తమ అధ్యయనంలో తేలిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నీడ లేని వారికి గృహదానం!

2. ఏడాదైంది.. ఏదీ ఆత్మ నిర్భర్‌?

కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్‌ భారత్‌ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఏడాదవుతున్నా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు ఎలాంటి సాయం అందలేదని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. రాష్ట్ర తయారీ రంగానికి వెన్నెముకగా నిలుస్తున్న ఎంఎస్‌ఎంఈలకు ప్యాకేజీ ద్వారా లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వపరంగా గట్టి ప్రయత్నాలు చేసినా ఫలించలేదన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Corona: బ్రిటన్‌లో ‘డెల్టా’ పడగ

కరోనా వైరస్‌లో ఆందోళనకరమైన డెల్టా వేరియంట్‌ వల్ల బ్రిటన్‌లో కొవిడ్‌-19 కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. 11 రోజులకోసారి ఈ సంఖ్య రెట్టింపవుతోంది. కరోనాలో మిగతా రకాలను తోసిరాజని.. ప్రధాన రకంగా డెల్టా మారిన నేపథ్యంలో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ ఏడాది మే 20 నుంచి జూన్‌ 7 వరకూ నిర్వహించిన లక్ష స్వాబ్‌ పరీక్షల ఆధారంగా ఇంపీరియల్‌ కాలేజీ లండన్‌ శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. ఏప్రిల్‌ నుంచి కొవిడ్‌ బాధితులు ఆసుపత్రిపాలు కావడం ఎక్కువైందని వారు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* AP News: నిద్ర మత్తే నిండా ముంచింది!

4. ఒక్కో మెట్టూ ఎదుగుతూ..

మైక్రోసాఫ్ట్‌లో అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ-ఛైర్మన్‌ స్థాయికి చేరారు సత్యనాదెళ్ల.. 2014లో ఆయన సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి) బాధ్యతలు చేపట్టే నాటికి మొబైల్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ సెర్చ్‌ మార్కెట్లలో మైక్రోసాఫ్ట్‌ పరిస్థితి గొప్పగా లేదు. మైక్రోసాఫ్ట్‌ ప్రధాన ఉత్పత్తి (ఫ్లాగ్‌షిప్‌ ప్రోడక్ట్‌) అయిన విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ పరిస్థితుల్లో సత్య నాదెళ్ల సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. సత్వరం వృద్ధి సాధించే లక్ష్యంతో కొత్త వ్యాపార విభాగాలపై దృష్టి సారించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మూడేళ్ల ప్రతిభ ఆధారంగా 12వ తరగతి గ్రేడులు

రద్దైన సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల తుది ఫలితాల వెల్లడికి అనుసరించే మూల్యాంకన విధానానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. 13 మంది నిపుణుల కమిటీ తయారు చేసిన మూల్యాంకన కమిటీ నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఎస్‌ఈ గురువారం సమర్పించింది. సీఐఎస్‌సీఈ కూడా తన మదింపు విధానాన్ని తెలిపింది. ఫలితాలను జులై 31లోపు ప్రకటిస్తామని తెలిపింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మార్కెట్లో పుస్తకాల్లేవ్‌

6. కొట్టేస్తుందా కోహ్లీసేన

దాదాపు రెండేళ్ల ప్రయాణం.. ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు.. ఎన్నో అపురూప విజయాలు.. మధ్యలో కరోనా విసిరిన సవాళ్లు..! ఎట్టకేలకు కోహ్లీసేన ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశాన్ని వన్డేల్లోనూ, టీ20ల్లోనూ జగజ్జేతగా నిలిపిన టీమ్‌ఇండియా.. సుదీర్ఘ ఫార్మాట్లోనూ కోట్ల అభిమానుల ఆశలను నెరవేర్చేందుకు బరిలోకి దిగనుంది. మొట్టమొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నేటి నుంచే. అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న భారత్‌ టైటిల్‌ కోసం.. అంతే బలంగా ఉన్న న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. సౌథాంప్టన్‌లో రసవత్తర సమరం ఖాయం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. High Court: అలాంటి సహజీవనం చట్ట వ్యతిరేకం

ఓ వివాహిత మరొక వ్యక్తితో సహజీవనం చేయడం హిందూ వివాహ చట్టానికి వ్యతిరేకమని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. తాము సహజీవనం చేస్తున్నామని, కుటుంబ సభ్యులు దాడి చేయకుండా రక్షించాలని కోరుతూ ఓ వివాహిత, ఆమె ప్రియుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ వ్యాఖ్య చేసింది. ప్రశాంతంగా సాగుతున్న తమ జీవితంలో భర్తగానీ, ఇతరులుగానీ ఇబ్బందులు కలిగించకుండా చూడాలని పిటిషనర్‌ కోరారు. ఈ పిటిషన్‌ను కొట్టివేసిన జస్టిస్‌ కౌశల్‌ జయేంద్ర ఠాకెర్‌, జస్టిస్‌ దినేశ్‌ పాఠక్‌లతో కూడిన ధర్మాసనం వారికి రూ.5000 జరిమానా విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* 43 ఏళ్ల వివాదం.. 24 ఏళ్లకు న్యాయం

8. బైడెన్‌ బలహీనుడు కాదు.. తెలివైన వ్యక్తి: పుతిన్‌

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అనుభవజ్ఞుడైన నాయకుడని జెనీవా శిఖరాగ్ర సదస్సులో చెప్పిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. గురువారం మాస్కోలో అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. బైడెన్‌తో చర్చించడం అంత సులభం కాదని అన్నారు. ప్రతీ విషయంపైనా ఆయనకు అవగాహన ఉందని పేర్కొన్నారు. ‘‘తాను సాధించాల్సిందేంటో బైడెన్‌కు బాగా తెలుసు. ఆ పనిని ఆయన చాలా తెలివిగా చేస్తారు’’ అని పుతిన్‌ పొగిడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల నేడు

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీ పోస్టులు, వాటి భర్తీకి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ రూపకల్పన కొలిక్కి వచ్చింది. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ ఆ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అవకాశం ఉన్న పోలీసు, విద్యా, వైద్య శాఖల్లో పోస్టుల వివరాలు, ఇతర ప్రభుత్వశాఖల్లో ఖాళీల వివరాలను పేర్కొనడంతో పాటు వాటిని ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు? నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల చేస్తారు? వాటి రాత, మౌఖిక పరీక్షలు ఎప్పుడు ఉంటాయనే స్పష్టమైన వివరాలన్నీ క్యాలెండర్‌లో పేర్కొంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* పదవీ విరమణకు సిద్ధంగా...

10. కరోనా పరీక్షల గ్రాఫ్‌ పెంచే గ్రాఫీన్‌!

అద్భుత పదార్థం గ్రాఫీన్‌ను ఉపయోగించి కరోనా వైరస్‌ను గుర్తించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు ఒక విధానాన్ని కనుగొన్నారు. దీని ద్వారా కరోనాయే కాకుండా, దానికి సంబంధించిన వేరియంట్లను అత్యంత కచ్చితత్వంతో, వేగంగా, చౌకలో గుర్తించేందుకు వీలవుతుందని వారు తెలిపారు. షికాగోలోని ఇలినోయి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన చేసింది. గ్రాఫీన్‌కు విశిష్ట లక్షణాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక పరమాణువంత మందాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల గ్రాఫీన్‌ ఫలకం సాధారణ పోస్టల్‌ స్టాంపు కన్నా వెయ్యి రెట్లు పలుచగా ఉంటుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని