Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Jun 2021 11:52 IST

1. Covishield: 45 వారాల విరామంతో ప్రయోజనం

కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య విరామం గురించి తాజా అధ్యయనమొకటి కీలక అంశాలను వెల్లడించింది. రెండు డోసుల మధ్య 45 వారాల వ్యవధి ఉంటే.. వ్యక్తుల్లో రోగ నిరోధకత స్పందన మరింత మెరుగ్గా కనిపిస్తున్నట్లు తేల్చింది. ఈ వ్యాక్సిన్‌ మూడో డోసును కూడా తీసుకుంటే యాంటీబాడీల స్థాయులు ఇంకా ఎక్కువగా వృద్ధి చెందుతున్నాయని నిర్ధారించింది. భారత్‌లో ప్రస్తుతం కొవిషీల్డ్‌ డోసుల మధ్య విరామాన్ని 12-16 వారాలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: కరోనా కాకున్నా అనుమానించాల్సిందే

2. కేంద్రానికి కృష్ణాబోర్డు లేఖలు

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన, శ్రీశైలం జలవిద్యుత్‌ ప్రాజెక్టు వద్ద తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి అంశాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖలు రాసింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పనులను తమ కమిటీ పరిశీలిస్తుందని.. నోడల్‌ అధికారిని నియమించాలని ఏపీ ప్రభుత్వాన్ని బోర్డు ఇప్పటికే కోరింది. వివిధ కారణాలతో అది సాధ్యపడలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పదిలోని 30% + ఇంటర్‌ ప్రథమలోని 70%వెయిటేజీతో ద్వితీయ ఫలితాలు

ఇంటర్మీడియట్‌ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఇంటర్‌ రెండో ఏడాది ఫలితాలకు.. ప్రథమ సంవత్సరం మార్కులతో పాటు పదో తరగతి మార్కులను పరిగణనలోకి తీసుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్కుల మదింపునకు నియమించిన ఛాయరతన్‌ కమిటీ రెండు, మూడు రోజుల్లో నివేదికను ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శికి సమర్పించనున్నట్లు సమాచారం. ఇంటర్‌ రెండో ఏడాది విద్యార్థులు 2019లో పది, 2020లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలను రాశారు. ఈ రెండింటిని కలిపి రెండో ఏడాది మార్కులను ఖరారు చేయాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 4.5 సెకన్లలో 100కి.మీ వేగం

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఇండియా నవీకరించిన రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ ఎస్‌వీఆర్‌ను మంగళవారం దేశీయ విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.2.19 కోట్లు (ఎక్స్‌-షోరూమ్‌). ఈ ఎస్‌యూవీ 5 లీటర్‌ సూపర్‌ ఛార్జ్‌డ్‌ వి8 పెట్రోల్‌ ఇంజిన్‌తో రూపొందింది. 423 కిలోవాట్ల సామర్థ్యం, 700 ఎన్‌ఎం టార్క్‌తో 4.5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. ‘ఈ కారును బ్రిటీష్‌ ఇంజినీరింగ్‌ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యున్నత ప్రమాణాలతో విలాసవంతంగా రూపొందించామ’ని జేఎల్‌ఆర్‌ ఇండియా ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ సూరి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అడవుల్లోనూ ఇట్టే పటేస్తుంది!

5. AP News: అనుకున్నదొకటి.. అయ్యిందొకటి!

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోని ప్రజా రవాణాశాఖ (పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ -పీటీడీ) ఉద్యోగులుగా గత ఏడాది జనవరి 1న విలీనం చేయడంతో వారంతా సంబరపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తమకు మేలు కలుగుతుందని భావించారు. అయితే ఆర్టీసీలో ఇంతకాలం ఉన్న ప్రయోజనాలను తొలగించగా, సర్వీసు నిబంధనల ఉత్తర్వులతో వేలసంఖ్యలో ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో 52 వేలమంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Vaccine: చైనా టీకా.. చిన్నారులపై భేష్‌

కొవిడ్‌-19 నివారణకు చైనా అభివృద్ధి చేసిన ‘కరోనా వ్యాక్‌’ టీకా.. 3-17 ఏళ్ల వయసు వారికి సురక్షితమని, వారిలో బలమైన యాంటీబాడీ స్పందనను అది కలిగిస్తుందని తాజా అధ్యయనం పేర్కొంది. దీని వివరాలు తాజాగా ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌ ఇన్‌ఫెక్షస్‌ డిసీజెస్‌ జర్నల్‌’లో ప్రచురితమయ్యాయి. సినోవ్యాక్‌ లైఫ్‌ సైన్సెస్‌ సంస్థ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించి మొదటి, రెండో దశల్లో భాగంగా 550 మంది చిన్నారులు, కౌమారప్రాయులపై ప్రయోగాలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కరోనా జాడను పసిగట్టే మాస్కు

7. TS News: సుపారీ కిల్లర్‌.. విజయవాడ

పూర్వ పరిచయం లేని వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా జట్టుకట్టి జంట హత్యలకు పాల్పడి ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ నెల 18న మంచిర్యాల బృందావనం కాలనీకి చెందిన తల్లి పూదరి విజయలక్ష్మి(47), కుమార్తె రవీనా(26)లను హత్య చేయగా విచారణలో పోలీసులకు విస్తుగొలిపే విషయాలు దృష్టికొచ్చాయి. ఆయుధాలు అమ్ముతామని, హత్యలు, కిడ్నాప్‌లూ చేసిపెడతామని యూట్యూబ్లో వెల్లడించడం ఈ కేసులో కీలకాంశం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. AP News: విశాఖపట్నంలో ‘అసైన్డ్‌’ దందా!

విశాఖ నగరంతోపాటు సమీప మండలాల్లో భూములకు విలువ పెరుగుతున్నా కొద్దీ కొందరు నేతల ప్రలోభాలూ ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం పలువురి దృష్టి ప్రధాన మార్గాలకు సమీపంలో ఉన్న భూములపై పడింది. వాటిని తమ చేతుల్లోకి తీసుకొని రైతులను ముందుంచి సొమ్ము చేసుకోవాలన్న వ్యూహం కనిపిస్తోంది. ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రణాళికలు రచిస్తోంది. మరో వైపు మధ్య, అల్పాదాయ వర్గాల కోసం (ఎంఐజీ, ఎల్‌ఐజీ) ప్లాట్లు విక్రయించడానికి లేఅవుట్లు అభివృద్ధి చేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

డ్రోన్‌ దాడి లష్కరే ఉగ్రవాదుల కుట్రే!

9. Usain Bolt: బోల్ట్‌ మెచ్చినోడు.. బోల్ట్‌ను మించినోడు

ఉసేన్‌ బోల్ట్‌ లాంటి దిగ్గజమే తాను ఆధిపత్యం చలాయించిన  రేసులో తన తర్వాత గెలవబోయేది అతడే అంటూ ఓ యువ స్ప్రింటర్‌ను కొనియాడాడు. ఇంకో అథ్లెట్‌.. ఉసేన్‌ బోల్ట్‌ అండర్‌-18, అండర్‌-20 విభాగాల్లో నెలకొల్పిన రికార్డులను అలవోకగా బద్దలు కొట్టేసిన కుర్రాడు. టోక్యో ఒలింపిక్స్‌ ముంగిట ట్రాక్‌ వైపు క్రీడాభిమానులను ఆకర్షిస్తున్నది ఈ యువ రేసర్లే. వారి పేర్లు ట్రేవాన్‌ బ్రోమెల్‌, ఎరియాన్‌ నైటన్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కొత్త విండోస్‌ తెరుస్తారా?

ఎంతో ఉత్కంఠ రేపిన విండోస్‌ 11 ఎట్టకేలకు ఆవిష్కృతమైంది. కొత్త డిజైన్‌, వినూత్నమైన ఫీచర్లు, మెరుగైన నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకేసారి ఎన్నో పనులు చేసుకునేలా ఎక్కువ డెస్క్‌టాప్‌లను సృష్టించుకోవటానికి, వీటి మధ్య తేలికగా మారటానికి వీలుండటంతో పాటు సరికొత్త మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌, ఆండ్రాయిడ్‌ యాప్‌లను సపోర్టు చేయటం వంటి మార్పులెన్నింటినో కలబోసుకొని వచ్చింది. మైక్రోసాఫ్ట్‌ చరిత్రలోనే అత్యంత అధునాతమైన, సమగ్రమైన ఆపరేటింగ్‌ సిస్టమ్‌గా పరిగణిస్తున్న దీని విశేషాలేంటో చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సగం మంది ఉద్యోగులకు అప్పుల భారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని