Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Jul 2021 09:09 IST

1. solar storm: దూసుకొస్తున్న సౌర తుపాను

శక్తిమంతమైన సౌర తుపాను ఒకటి భూమి వైపు వేగంగా దూసుకొస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దాని ప్రభావంతో సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు, జీపీఎస్‌ వంటి సేవలకు ఆటంకం కలిగే అవకాశముందని చెప్పారు. సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుపాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో పుడమి దిశగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని వేగం మరింత పెరిగే అవకాశముందన్నారు. సోమవారం లోపు ఎప్పుడైనా అది మన గ్రహాన్ని తాకొచ్చని అంచనా వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. కంటిచూపు వెక్కిరించినా.. కల సాకారం

ఆమె చిన్ననాటి నుంచే ఆకాశం వైపు ఆసక్తిగా చూసేవారు. అందులోని అంతుచిక్కని రహస్యాల గుట్టు విప్పాలని.. రోదసిలో విహరించాలని కలలు కనేవారు! అందుకే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- ‘నాసా’లో వ్యోమగామి కావాలనుకున్నారు. కానీ కంటిచూపు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఆ అవకాశాన్ని కోల్పోయారు. అయితేనేం..? నిరాశ చెందలేదు. పట్టు విడవలేదు. ఫలితం.. రోదసిలోకి వెళ్లిన భారత సంతతి మూడో మహిళగా తాజాగా రికార్డు సృష్టించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

రోదసి ముంగిట వాలుదాం

3. పూరీ క్షేత్రం.. అంతుచిక్కని రహస్యాలు

పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరీ క్షేత్రానికి ఎన్నో విశిష్టతలున్నాయి. ఈ ఆలయ గోపురంపై ఉండే జెండా... వీచే గాలికి వ్యతిరేక దిశలో కదులుతుంది. గోపురంపైన ప్రతిష్ఠించిన సుదర్శన చక్రం ఎటునుంచి తిలకించినా మన వైపే చూసినట్లు ఉంటుంది. ఈ ఆలయంపై పక్షులు ఎగరకపోవడం ఒక వింత. ఈ ఆలయ గోపురం నీడ సూర్యుడు ఉదయించినా, అస్తమించినా ఎక్కడా కనిపించకపోవడం విశేషం. ఆలయానికి అత్యంత సమీపంలోనే సముద్రం ఉన్నా, ఆలయం లోపల సముద్ర అలల శబ్దాలు వినబడవు. ఇలా ఎన్నో విశిష్టతలు, రహస్యాలు, మహిమలు కలిగిన పూరీక్షేత్రం మానవాళికి వరప్రసాదమే కదా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. 60 గజాల్లోనూ ప్లాట్లు

రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లోని లేఅవుట్‌ నిబంధనలను ప్రభుత్వం పటిష్ఠం చేసింది. స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతికి పురపాలకశాఖ శ్రీకారం చుట్టింది. ప్లాట్ల కనీస విస్తీర్ణాన్ని గతంలోకంటే దాదాపు సగానికిసగం తగ్గించింది. కనీస విస్తీర్ణాన్ని 60 చదరపు గజాలు (50 చదరపు మీటర్లు), కనీస వెడల్పు 20 అడుగులుగా నిర్ధారించింది. రాష్ట్రంలో కొత్త పురపాలక చట్టం, టీఎస్‌-బీపాస్‌ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ మార్పులు చేసింది. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

ఉద్యోగ ఖాళీలు 55 వేలకు పైనే!

5. ఎయిర్‌ అంబులెన్సులో నగరానికి వైద్యురాలు

ఊపిరితిత్తులు పాడైపోయిన స్థితిలో ఉన్న ఓ వైద్యురాలిని చికిత్స కోసం ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా ఆదివారం నగరంలోని కిమ్స్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ ఆసుపత్రి వర్గాల వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలోని రామ్‌మనోహర్‌ లోహియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఆర్‌ఎమ్‌ఎల్‌ఐఎంఎస్‌)కు చెందిన పీజీ రెసిడెంట్‌ వైద్యురాలు డా.శారదాసుమన్‌(32)కు ఏప్రిల్‌ 14న కొవిడ్‌ సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. అప్పటికే ఆమె ఎనిమిది నెలల గర్భవతి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. డ్రైఫ్రూట్స్‌తో... కోట్లు సంపాదిస్తోంది!

‘జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. వాటిని ఎదుర్కొని నిలిస్తేనే విజేతలుగా నిలబడతాం’ అంటోంది చిత్ర. ఉన్నతోద్యోగాన్ని వదిలేసి వ్యాపారంలో అడుగుపెట్టింది. మొదటి అడుగే తడబడినా... బెదిరిపోలేదు. ఆలోచించి అవకాశాల్ని సృష్టించుకుంది. ఆపైనా తన లక్ష్యానికి అవాంతరాలు ఎదురైనా...కుంగిపోలేదు. ప్రతి వైఫల్యాన్నీ... విజయానికి సోపానాలుగా మార్చుకుంది. అనుకున్నది సాధించింది.   డ్రైఫ్రూట్స్‌ వ్యాపారంతో కోట్ల రూపాయల టర్నోవర్‌ని అందుకుంటూ, వందమందికి ఉపాధిని కూడా కల్పిస్తోంది ఈ హైదరాబాదీ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

అప్పుడు చాలా భయపడ్డా

7. పన్నులదే పెద్ద మంట

‘ఈ దాహం తీరనిది.. నీ హృదయం కదలనిది’.. అప్పుడెప్పుడో సినీ కవి రాసిన ఈ వాక్యం పెట్రోలు, డీజిల్‌ మీద పన్నుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి సరిగ్గా సరిపోతుంది.  గత ఏడేళ్లలో పెట్రో రంగం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చిన రాబడి.. రూ.36 లక్షల కోట్లు. కేంద్ర వాటా 67.59%, రాష్ట్రాల వాటా 32.41%. ఈ మొత్తం ఆదాయంలో పెట్రోలు, డీజిల్‌పై కేంద్రానికి ఎక్సైజ్‌ సుంకం, రాష్ట్రాలకు వ్యాట్‌/ అమ్మకపు పన్ను రూపంలో వచ్చే ఆదాయమే రూ.28 లక్షల కోట్ల వరకు ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. Euro cup final: యూరో కప్‌ ఛాంపియన్‌గా ఇటలీ

యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ఇటలీ అదరగొట్టింది. పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో ఇటలీ 3-2 తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచింది. దీంతో 1968 తర్వాత ఇటలీ యూరోకప్‌ను మరోసారి ముద్దాడింది. గత కొన్నేళ్లుగా మెగా టోర్నీలో విఫలమవుతున్న ఇటలీకి ఈ విజయంతో సాంత్వన లభించినట్టైంది. లండన్‌ వేదికగా అభిమానులు కిక్కిరిసిన వెంబ్లే స్టేడియంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

ఏడు పదుల సాహసికుడు బ్రాన్సన్‌

9. ఏసీ బస్సుల్లోనూ డ్రైవర్లకు చెమటలే

టీఎస్‌ ఆర్టీసీలో ఏసీ బస్సు డ్రైవర్లు అదనపు బాధ్యతలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న అధికారులు వారి సౌకర్యార్థం సహాయకులను నియమించకపోవడమే దీనికి కారణమవుతోంది. ఖమ్మం రీజియన్‌లోని ఖమ్మం డిపోలోనే ఇలా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఖమ్మం నుంచి హైదరాబాదుకు, హైదరాబాదు నుంచి ఖమ్మానికి ప్రయాణం చేసే సాధారణ బస్సులతో పాటు పూర్తి ఏసీలో ప్రయాణించేందుకు రాజధాని బస్సులను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. వింత కలలు ఎందుకొస్తాయి?

దినచర్యలో ఎదురయ్యే సంతోషకర లేదా దిగులేసే విషయాలు, ఉద్వేగాలను వ్యక్తం చేయలేక అణచుకోవడం లేదా ఇన్హిబిషన్స్‌ స్వప్నావస్థలో కలల్లా బయటపడతాయి. ఎత్తయిన ప్రదేశం నుంచి పడిపోతున్నట్లు, నీళ్లలో జారిపడుతున్నట్లు వచ్చే కలలు భయాందోళనలు, అభద్రతాభావాలకు సంకేతం. అంటే చెడు జరుగుతుందేమోనన్న భయమన్నమాట. నగ్నంగా ఉన్నానన్న కల తననెవరో అవమానిస్తున్న, సిగ్గువిడిచి చేయకూడని పనులు చేస్తానేమోనన్న భయాన్ని తెలియజేస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

ఫ్రిజ్‌ లేకుండానే కూరలు భద్రం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని