Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Aug 2022 14:13 IST

1. లావాదేవీలన్నీ ప్రైవేటువే అయినపుడు.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఎక్కడిది?

రాజధాని ఎక్కడొస్తుందో ప్రజా బాహుళ్యంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో భూముల లావాదేవీలు జరిగినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అది కూడా లావాదేవీలన్నీ ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగినప్పుడు అందులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనడానికి ఏమీ లేదంది. ఈ కేసులోని పూర్వాపరాలను హైకోర్టు కూలంకషంగా పరిశీలించాకే తీర్పు చెప్పిందని, ఆ తీర్పులో ఎక్కడా తప్పులు లేవని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* విశాఖ స్టీల్‌లో 100% వాటాలు అమ్మేస్తున్నాం: కేంద్రం

2. Bird flu: భారత్‌లో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం 

బర్డ్‌ ఫ్లూతో 11 ఏళ్ల బాలుడు దిల్లీ ఎయిమ్స్‌లో చనిపోయాడు. దీంతో బాలుడికి చికిత్స అందించిన వైద్యులు, సిబ్బంది ఐసోలేషన్‌కు వెళ్లారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే రిపోర్ట్‌ చేయాలని వైద్యనిపుణులు వారికి సూచించారు. భారత్‌లో బర్డ్‌ ఫ్లూ వచ్చి వ్యక్తి చనిపోవడం ఇదే తొలిసారి. హర్యానాకు చెందిన సుశీల్‌ అనే బాలుడు న్యుమోనియా, లుకేమియా లక్షణాలతో ఈ నెల 2న  దిల్లీ ఎయిమ్స్‌లో చేరాడు. దీంతో పరీక్షించిన వైద్యులు మొదట కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Maglev train: నేలమీద విమానం!

 గంటకు 600 కి.మీ.ల వేగంతో పరుగులు తీసే అత్యాధునిక మాగ్లెవ్‌ రైలును చైనా మంగళవారం ఆవిష్కరించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఇదేనని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. తూర్పు చైనా ప్రాంతంలోని షిడాంగ్‌ ప్రావిన్స్‌ కిండావ్‌ నగరంలో ఈ సరికొత్త మాగ్లెవ్‌ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. అక్టోబర్‌ 2016లో ప్రారంభించిన మాగ్లెవ్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా అయస్కాంత-వాయుస్తంభన ప్రోటోటైప్‌ రైలును గంటకు 600 కి.మీ. వేగంతో ప్రయాణించేలా 2019లో రూపొందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నా పేరు BMM 310.. నా ఇల్లు ఇండియా!

4. పోస్ట్‌మేన్‌ సాయంతోనూ.. ఆధార్‌తో ఫోన్‌ నంబరు అనుసంధానం

ఇక పోస్ట్‌మేన్‌ సహాయంతోనూ ఇంటి వద్దే ఆధార్‌ కార్డులపై మొబైల్‌ నంబర్లను అనుసంధానం చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌(ఐపీపీబీ) ద్వారా పోస్ట్‌మేన్‌లకు ఆధార్‌ కార్డుదారుల మొబైల్‌ నంబర్లను అప్‌డేట్‌ చేసేందుకు ప్రత్యేకంగా అనుమతి ఇచ్చారు. 650 ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లలో 1.46 లక్షల మంది పోస్ట్‌మేన్లు, గ్రామీణ్‌ డాక్‌ సేవక్స్‌ (జీడీఎస్‌) నెట్‌వర్క్‌ ద్వారా ఈ సేవ అందుబాటులో ఉంటుంది. పోస్ట్‌మేన్‌ సహాయంతో ఇంటివద్దనే ఎవరైనా తమ ఫోన్‌ నంబరును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చని ఐపీపీబీ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వీళ్లు తక్కువేం కాదు

ఈసారి ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం తెచ్చే క్రీడలు అనగానే షూటింగ్‌, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, ఆర్చరీ లాంటివి ముందు వరుసలో ఉంటాయి. కానీ టోక్యోలో  తక్కువ అథ్లెట్లను బరిలో దింపుతున్న కొన్ని క్రీడలు ఉన్నాయి. అథ్లెట్లు తక్కువే కదా అని వీటిని తీసి పారేయలేం..! పతకం పట్టుకురాగల సత్తా ఉన్న క్రీడాకారులు ఇందులో ఉన్నారు. రియో ఒలింపిక్స్‌లో భారీ అంచనాలతో బరిలో దిగి.. మూడు ప్రయత్నాల్లో విఫలమై ఒత్తి చేతులతో వెనుదిరిగింది వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను. కానీ మళ్లీ ఒలింపిక్స్‌కు వచ్చేసరికి ఈ మణిపురి లిఫ్టర్‌ బాగా మెరుగైంది. ఈసారి పతకం తెస్తానని బలంగా నమ్ముతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అనుకోకుండా దీపక్‌

6. అశ్లీల చిత్రాల దందాతో రూ.లక్షల ఆర్జన

అశ్లీల చిత్రాల కేసులో సోమవారం అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా వ్యవహారంలో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. బ్రిటన్‌లోని తన సమీప బంధువు ప్రదీప్‌ బక్షితో కలసి కుంద్రా అశ్లీల చిత్రాల దందాను నిర్వహిస్తున్నట్లు వాట్సప్‌ గ్రూప్‌ చాటింగ్‌, ఈ-మెయిళ్ల ద్వారా వెల్లడైందని ముంబయి పోలీసులు తెలిపారు. ప్రదీప్‌ బక్షికి బ్రిటన్‌లో కెన్రిన్‌ అనే నిర్మాణ సంస్థ ఉంది. దాని ఆధ్వర్యంలో హాట్‌షాట్స్‌ అనే యాప్‌ను నిర్వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రముఖులకు కార్‌చిచ్చు

విదేశీ రాయబారుల పేరుతో దిగుమతి చేసుకున్న ఖరీదైన కార్ల కుంభకోణం గుట్టురట్టు చేసేందుకు ముంబయి డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్‌ మాంటె కార్లో’లో హైదరాబాద్‌లోని ప్రముఖులకు ఉన్న సంబంధాలు బయటపడుతున్నాయి. ముంబయి అధికారుల సమాచారం ప్రకారం హైదరాబాద్‌ డీఆర్‌ఐ అధికారులు సోమవారం మలక్‌పేట ప్రాంతంలో ఖరీదైన ‘నిస్సాన్‌ పెట్రోల్‌’ కారును స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Supreme Court: ఇక మేం చేతులెత్తేయాల్సిందే

8. ఇంటర్‌లో ఈసారి అంతర్గత పరీక్షలు!

ఒకవేళ కరోనా మూడో దశ సంభవించి వచ్చే వేసవిలో నిర్వహించాల్సిన పరీక్షలు జరపడానికి వీల్లేని పరిస్థితి ఉంటే.. అప్పుడు రెండో సంవత్సరం విద్యార్థులకు ఏ ప్రాతిపదికన మార్కులు ఇస్తారు?.. ఇప్పటికే విద్యార్థులకు తొలి ఏడాది పరీక్షలు జరపకుండా రెండో ఏడాదికి ప్రమోట్‌ చేశారు. ఈ క్రమంలోనే పదో తరగతి మాదిరిగా ఇంటర్‌ విద్యార్థులకు అంతర్గత పరీక్షలను జరిపితే ఇబ్బంది ఉండదని ఇంటర్‌బోర్డు భావిస్తోంది. బహుళ ఐచ్ఛిక(మల్టిపుల్‌ ఛాయిస్‌) రూపంలో అంతర్గత పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో జరిపితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో బోర్డు ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వారికి ఏడాదికి 100 రోజుల సెలవులు..

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని విభాగాల సాయుధ బలగాల సిబ్బందికి ఏడాదికి 100 రోజుల పాటు కుటుంబ సభ్యులతో గడిపేందుకు సెలవులు మంజూరు చేయాలన్న ప్రతిపాదన అమలుపై హోంమంత్రిత్వ శాఖ నివేదిక కోరింది. తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, సమస్యాత్మక భూభాగాల్లో విధులు నిర్వహించే సాయుధ సిబ్బందికి తగిన విశ్రాంతి కల్పించే ఉద్దేశంతో ఏడాదికి 100 రోజుల సెలవులు మంజూరు చేయాలని 2019 అక్టోబరులో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రతిపాదించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ధరలు విమానం మోత!

10. కథలు రెడీ కుదరాలి జోడీ

మా సినిమా స్క్రిప్టు దశలో ఉంది. మా సినిమా సెట్స్‌పై ఉంది, లేదంటే నిర్మాణానంతర పనుల్లో ఉందనే మాటలు చిత్ర పరిశ్రమలో తరచూ వినిపించేవే. అలా కథానాయికల ఎంపిక కసరత్తుల్లో ఉండే సినిమాల జాబితా కూడా చాంతాడంత. కథలు సిద్ధంగా ఉంటాయి. నాయకులూ పచ్చజెండా ఊపేస్తారు. ఎప్పుడంటే అప్పుడు సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు నిర్మాత ఎదురు చూస్తుంటాడు. కానీ కథానాయిక ఎంపికే ఎంతకీ పూర్తవ్వదు. అలా జోడీ కుదరక నెలలు నెలలు వాయిదాలు పడే సినిమాలు ఎక్కువే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని