Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Sep 2021 09:26 IST

1. వీరతాళ్లు వాళ్లకే!

పిచ్‌లు పేసర్లకు అనుకూలించేలా ఉంటాయి. ప్రత్యర్థి బౌలర్లు వాటిపై చెలరేగిపోతారు. కానీ మన బౌలర్లు మాత్రం పిచ్‌, పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేక చేతులెత్తేస్తుంటారు. ఒకప్పుడు ఇలాంటి మ్యాచ్‌లు ఎన్ని చూశామో! కానీ ఇప్పుడు ప్రత్యర్థి బౌలర్లు వికెట్లు తీయలేక ఆపసోపాలు పడ్డ పిచ్‌ మీద.. నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్‌ జట్టు వికెట్‌ నష్టపోకుండా 100 పరుగులు చేసిన స్థితిలో చివరి రోజు మన బౌలర్లు చేసిన అద్భుతాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇది భారత క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శన అంటే అతిశయోక్తి కాదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అహో భారత్‌

2. విమానంలో చీమల దండు

విమానంలో అదీ అత్యంత ఖరీదైన బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణిస్తే ఎంతో పరిశుభ్రంగా, సౌకర్యంగా ఉంటుందని భావిస్తాం. కానీ అక్కడ చీమల దండు కనిపిస్తే.. ఆ కారణంగా విమానం మూడు గంటలు ఆలస్యంగా బయల్దేరితే ఎలా ఉంటుంది? తమకు ఇలాంటి అనుభవమే ఎదురైనట్లు ఎయిర్‌ ఇండియా విమాన ప్రయాణికులు కొందరు తెలిపారు. దిల్లీ నుంచి లండన్‌కు వెళ్లే విమానం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరాల్సి ఉండగా, టేకాఫ్‌ కావడానికి కాస్త ముందు బిజినెస్‌ క్లాస్‌లో చీమల బారు కనిపించిందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఫైజర్‌ టీకా తీసుకున్న 6 నెలలకు.. 80% తగ్గిపోతున్న యాంటీబాడీలు

ఫైజర్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత... ఆ టీకా ద్వారా శరీరంలో ఉత్పత్తయిన కొవిడ్‌ యాంటీబాడీలు 80% మేర తగ్గిపోతున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది! కేస్‌ వెస్టర్న్‌ రిజర్వ్‌, బ్రౌన్‌ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు సంయుక్తంగా దీన్ని చేపట్టారు. నర్సింగ్‌ హోమ్స్‌లో ఉంటున్న 120 మంది నివాసులు, 92 మంది ఆరోగ్య కార్యకర్తల నుంచి వారు రక్త నమూనాలను సేకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కరోనా వ్యాప్తి ఎప్పుడెక్కువ?

4. Tuck jagadeesh: నానిని అలా అనడం చూసి.. బాధేసింది

‘‘ఓ కథ థియేటర్లకు అనుకుంటే.. దానికి తగ్గట్లుగానే రాయాల్సి ఉంటుంది. ఓటీటీకి అనుకుంటే.. అందుకు తగ్గట్లుగానే మలచుకోవాల్సి ఉంటుంది. థియేటర్‌ కోసం రాసిన కథను ఓటీటీకి ఇవ్వడం కష్టంగానే ఉంటుంది’’ అన్నారు శివ నిర్వాణ. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి  భావోద్వేగభరిత ప్రేమకథా చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడాయన. ఇప్పుడు ‘Tuck Jagadeesh’తో ఓ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రుచి చూపించనున్నారు. Nani కథానాయకుడిగా నటించిన చిత్రమిది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రైవేటుగా భూప్రదక్షిణ!

రోదసియానాన్ని పరిశోధకులకే కాక ఇతరులకూ అందుబాటులోకి తెచ్చే దిశగా అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ స్పేస్‌ఎక్స్‌ ఈ నెల 15న కీలక ప్రయోగాన్ని చేపట్టబోతోంది. ‘ఇన్‌స్పిరేషన్‌4’ ప్రాజెక్టు కింద నిర్వహించే ఈ యాత్రలో తొలిసారిగా నలుగురు పౌరులను అంతరిక్షంలోకి పంపనుంది. అంతరిక్ష పర్యాటకంలో ఇదో మైలురాయి కాబోతోంది. పూర్తిగా ప్రభుత్వేతర, ప్రైవేటు వ్యక్తులతో కూడిన ఒక వ్యోమనౌక మొదటిసారిగా భూమిని చుట్టిరాబోతోంది. క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక ద్వారా కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రెండేళ్లు.. 9 వేల ప్రదక్షిణలు..!

6. బడికి పంపాలా? వద్దా?

పిల్లలను బడికి పంపాలా? వద్దా? ప్రస్తుతం తల్లిదండ్రుల మనసుల్లో మెదలుతున్న ప్రశ్న ఇదే. ఒకవైపు బడుల పునః ప్రారంభం. మరోవైపు కొవిడ్‌-19 మూడో దశ ముంచుకురావొచ్చనే హెచ్చరికలు. ఈ నేపథ్యంలో ఎవరికైనా ఊగిసలాట సహజమే. బడికి పంపకపోతే పిల్లలు చదువుల్లో మరింత వెనకబడి పోతారనే ఆందోళన కొందరిది. పిల్లల ప్రాణాల కన్నా చదువులు ముఖ్యమా? అనే భయం ఇంకొందరిది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Gummanur Jayaram: మంత్రినని ఆలోచించను... నేనే ధర్నాలో కూర్చుంటా!

‘నాలుగు ఖాళీ ట్రాక్టర్లు పట్టుకున్నారట.. వదిలేయండి. లేదంటే అధికారంలో ఉన్న మంత్రిని నేనే ధర్నాకు కూర్చుంటా. మంత్రి... గింత్రని ఏ మాత్రం ఆలోచించను. నాకు నా జనాలు కావాలి. ఇక్కడ ఇంకోసారి పోటీ చేయాల్సింది నేను. ధర్నాకు నన్నే కూర్చునేలా చేస్తారో... లేక వదిలిపెడతారో చూసుకోండి’ అంటూ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కర్నూలు జిల్లా ఆస్పరి ఎస్సైతో చరవాణిలో మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జిల్లాల్లో కొలువుల భర్తీ!

 8. భారత తెల్ల గూఢచారి!

స్వాతంత్య్రోద్యమ సమయంలో భారత్‌కు మద్దతెవ్వరిచ్చినా సహించలేకపోయింది బ్రిటిష్‌ ప్రభుత్వం. చివరకు తమ అధికారులను కూడా శిక్షించేది. మానవతా దృక్పథంతో భారత్‌కు అండగా నిలిచి పింఛన్‌ కోల్పోయారో బ్రిటిష్‌ ఉన్నతాధికారి - మైఖేల్‌ జాన్‌ కారిట్‌! ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ (ఐసీఎస్‌) పాసైన కారిట్‌ కలెక్టర్‌గా 1930లో భారత్‌లో అడుగుపెట్టారు. వచ్చీ రావటంతోనే భారతీయులతో మానసిక బంధం ముడిపడింది. తమ ప్రభుత్వం వారినెంతగా పీడిస్తోందో చూసి బాధపడేవారు కారిట్‌! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Rain: వరుణ దేవుడి కరుణ కోసం.. బాలికల నగ్న ఊరేగింపు!

వర్షాలు కురిపించాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ బాలికలను నగ్నంగా వీధుల్లో తిప్పిన అనాగరిక ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అక్కడి దమోహ్‌ జిల్లాలోని బనియా గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన కంప్యూటర్‌ యుగంలోనూ కొనసాగుతున్న మూఢాచారాలకు అద్దం పడుతోంది. కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ గ్రామంలో ఓ ఆచారాన్ని పాటిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Crime News: చంకలో చిన్నారిని కాటేసిన పాము

10. ఖైరతాబాద్‌ మహాగణపతి సిద్ధం.. ప్రారంభమైన భక్తుల సందడి

 ఖైరతాబాద్‌లో పంచముఖ రుద్ర మహాగణపతి భక్తుల పూజలకు సిద్ధయ్యాడు. రెండు నెలలుగా రాత్రి పగలు పనిచేసిన శిల్పులు వినాయకచవితికి ఐదు రోజుల ముందే పూర్తిచేశారు. అప్పుడే భక్తుల సందర్శన ప్రారంభమైంది. ఇక్కడ ఒక్క అడుగు వినాయకుడితో విగ్రహ ఏర్పాటు ప్రారంభమైంది. రెండేళ్ల కిందట 65 ఏళ్లు నిండిన సందర్భంగా 65 అడుగుల మహా గణపతిని ఏర్పాటు చేశారు. గత ఏడాది కరోనా కారణంగా 11 అడుగులకే పరిమితం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని