Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Oct 2021 09:19 IST

1. నేటి నుంచే గెజిట్‌ అమలు

కృష్ణా, గోదావరి నదులపై గుర్తించిన ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి గురువారం నుంచి గెజిట్‌ అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులు ఈ మేరకు ప్రక్రియను అమలు చేయనున్నాయి. గెజిట్‌లో పేర్కొన్న ప్రాజెక్టులన్నింటికీ  బదులు రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మతి తెలిపే ప్రాజెక్టుల బాధ్యతలను మొదటి దశలో స్వీకరించనున్నాయి. ఇప్పటికే సమావేశాల్లో ప్రతిపాదించి తీర్మానించిన జాబితాను రెండు రాష్ట్రాలకు అందజేశాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3 నెలలు రాష్ట్రాల పరిధిలోనే

2. 24 వారాల తర్వాతా గర్భస్రావానికి అనుమతి

అసాధారణ పరిస్థితుల్లో గర్భం దాల్చిన మహిళలు 24 వారాల తర్వాత కూడా గర్భస్రావం చేయించుకునేందుకు కేంద్రం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన వైద్య మండలి ప్రత్యేక అనుమతితో ఇద్దరు వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అబార్షన్‌ చేయించుకునే వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గర్భస్రావానికి ఇదివరకు ఉన్న 20 వారాల గడువును పెంచింది. లైంగిక దాడికి గురైనవారు, అత్యాచార బాధితులు, రక్త సంబంధంగల (ఇన్‌సెస్ట్‌)వారితో గర్భం దాల్చినవారు,..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అరుణాచల్‌లో ఉపరాష్ట్రపతి పర్యటనపై చైనా అభ్యంతరం

భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఇటీవల అరుణాచల్‌ప్రదే శ్‌లో పర్యటించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ఏకపక్షంగా, అక్రమంగా భారత్‌ ఏర్పాటు చేసిన అరుణాచల్‌ రాష్ట్రానికి మేమెప్పుడూ గుర్తింపునివ్వడం లేదు. మా ఆందోళనను భారత్‌ గుర్తించాలని, సరిహద్దు వివాదాన్ని క్లిష్టతరం చేసే చర్యల్ని చేపట్టకూడదని కోరుతున్నాం. పరస్పర విశ్వాసాన్ని, ద్వైపాక్షిక బంధాలను బలహీనపరిచే ఎలాంటి పనులూ చేయకూడదని కోరుకుంటున్నాం’’ అని చైనా ప్రకటించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సింగరేణికి కేంద్రం షాక్‌

బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ సింగరేణికి షాక్‌ ఇచ్చింది. నాలుగేళ్లుగా తమ ఏరియాల్లోని పలు బ్లాకులను కేటాయించాలని సింగరేణి చేస్తున్న విజ్ఞప్తులను తోసిరాజని వేలంలో చేర్చింది. దేశవ్యాప్తంగా 88 బ్లాకుల వేలంపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటన జారీ చేసింది. ‘కోల్‌మైన్స్‌ స్పెషల్‌ ప్రొవిజన్స్‌ యాక్టు-2015’, ‘మైన్స్‌, మినరల్స్‌ (డెవలప్‌మెంట్, రెగ్యులేషన్‌) యాక్టు-1957’ ప్రకారం వేలం వేస్తున్నట్లు పేర్కొంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సరకు రవాణాకు ‘ఆర్టీసీ లారీ’లు

5. Cricket: ప్లంబర్‌కు రూ.కోటి.. ‘డ్రీమ్‌ 11’తో వరించిన అదృష్టం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. ఓ ప్లంబర్‌ జీవితాన్నే మార్చేసింది. రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడయ్యాడు. అంతా క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌ డ్రీమ్‌ 11 మాయ. అక్టోబరు 10న.. చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌పై బెట్‌ వేయగా.. అదృష్టం తలుపుతట్టింది. ఏకంగా.. రూ.కోటి సొంతమైంది. అతడే బిహార్‌లోని కటిహార్‌ జిల్లా మనిహారీకి చెందిన బబ్లూ మండల్‌. బబ్లూ.. హంస్‌వర్‌ గ్రామంలో ప్లంబింగ్‌ పనులు చేసేవాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అప్పుడు జేఆర్‌డీ టాటా... ఇప్పుడు ఆరోహీ..

ఆమె వయసు పాతికేళ్లే. సాధించినవన్నీ ప్రపంచరికార్డులే. లైట్‌ స్పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో వేల కిలోమీటర్లు ప్రయాణించి రెండు మహా సముద్రాలను ఒంటరిగా దాటేసింది. ఈనెల 15న మరో రికార్డుకు సన్నద్ధమవుతోంది ఆరోహీ పండిట్‌. ఆ సాహసమేంటో  తెలుసుకుందాం..  సరిగ్గా 89 ఏళ్లక్రితం.. అంటే 1932, అక్టోబరు 15. ఆ రోజు టాటా ఎయిర్‌ సర్వీసెస్‌ విమానంలో కరాచీ నుంచి ముంబయికి చేరుకుని అప్పట్లో వార్తల్లోకెక్కారు ‘ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సివిల్‌ ఏవియేషన్‌’గా పేరొందిన జేఆర్‌డీ టాటా.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఏం కాదు అనుకుంటే.. ముప్పే

కరోనా కాస్త నెమ్మదించడంతో.. అది మనల్ని వీడిపోయిందని అపోహ పడుతున్న కొందరు ఆ లక్షణాలు కనిపిస్తున్నా పరీక్షలు చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వైరల్‌ జ్వరమనే భ్రమలో ఉండిపోతున్నారు. జ్వరం, జలుబే కదా ఏమవుతుందనే భావన ఒక్కోసారి తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు పడిపోయి చివరికి ఐసీయూలో చేరాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో రోజూ పది మంది వరకు తీవ్ర కరోనా లక్షణాలతో చేరుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: కణాల్లోకి చొచ్చుకెళ్లకుండా కరోనా వైరస్‌కు అడ్డుకట్ట!

8. దిల్లీ నెత్తిన సిక్స్‌ ఫైనల్‌కు కోల్‌కతా

బంతులు 25.. చేయాల్సిన  పరుగులు 13.. చేతిలో ఉన్న వికెట్లు 8. సమీకరణం ఎంతో తేలిగ్గా ఉంది. కోల్‌కతా చాలా ధీమాగా ఉంది. స్టేడియం ప్రశాంతంగా ఉంది. ఫలితం తేలిపోయిందని ప్రేక్షకులు టీవీలు కట్టేసే పనిలో ఉన్నారు. అప్పుడే నితీశ్‌ రాణా ఔటయ్యాడు. ఎవరిలోనూ చలనం లేదు. తర్వాతి ఓవర్లో   2 పరుగులే వచ్చాయి. క్రీజులో బాగా కుదురుకున్న గిల్‌ ఔటయ్యాడు. అయినా   ఏమవుతుందిలే అని కోల్‌కతా అభిమానుల్లో ధీమా! ఆ తర్వాతి ఓవర్లో వచ్చింది ఒక్క పరుగే.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమ్మ చిరునామా

గుళ్లో విగ్రహానికి, ఇంట్లో పటానికి పూజలు చేస్తాం, నివేదనలు సమర్పిస్తాం. అంతే తప్ప అమ్మవారి అసలు రూపురేఖలేంటో, ఆ చల్లనితల్లి జాడేమిటో మనకు తెలీదు. భక్తిగా అర్చిస్తూ, కష్టాన్నీ సుఖాన్నీ చెప్పుకునే మన ఆరాధ్యదైవం అమ్మ చిరునామా ఎక్కడో, ఆ తల్లి తత్వమేంటో తెలుసుకుందాం... మేరుపర్వతం మధ్యశిఖరంపై గల శ్రీమన్నగరానికి నాయకురాలిగా చింతామణి గృహంలో, పంచ బ్రహ్మాసనంపై అమ్మ ఆసీనురాలై ఉంటుందని ‘దేవీ భాగవతం’ చెబుతోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆసుపత్రుల్లోనూ రూ.5కే ఆహారం!

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకుల కోసం అయిదు రూపాయలకే ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దవాఖానాల పరిధిలో ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. వాటిలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనాలను కలిపి కేవలం రూ.15లకే అందజేయనున్నారు. ఈ ప్రక్రియలో ఇప్పటికే ప్రసిద్ధికెక్కిన ‘హరే కృష్ణ మూవ్‌మెంట్‌’ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Telugu Akademi Scam: భయంతో రూ.80 లక్షలు కాల్చేశా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని