Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Jan 2022 09:09 IST

1. IND vs SA : విరాట్‌ ఒక్కడే..

దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టెస్టులో టీమ్‌ఇండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. మరోసారి భారత్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫామ్‌ లేమిని అధిగమిస్తూ, కొత్త ఏడాదిలో కొత్త ఆశలు రేకెత్తిస్తూ చక్కని ఇన్నింగ్స్‌ ఆడినా.. భారత్‌ 223 పరుగులకే సరిపెట్టుకుంది. పేసర్లు విజృంభించడంతో తొలి రోజు దక్షిణాఫ్రికాదే పైచేయి. ఓ దశలో కాస్త మెరుగైన స్కోరే చేసేలా కనిపించిన భారత్‌.. చివరి సెషన్లో 82 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకుని నిరాశపరిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Vanama Raghava: భూ కబంధుడు

ఎకరాల కొద్దీ అటవీ భూములను కొల్లగొట్టాడు. అసైన్డ్‌ భూములను కబ్జా చేశాడు. ఇవి తాజాగా వెలుగులోకి వచ్చిన వనమా రాఘవ అక్రమాలు. భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలో ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో కటకటాల్లోకి వెళ్లిన నేపథ్యంలో ఆయన బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాలను ఏకరవు పెడుతున్నారు. భూ దందాలు,  అరాచకాలకు పాల్పడ్డాడని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొన్నింటిపై పోలీసులు కేసులు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఖాకీలపై కన్ను

3. Pig Heart Transplant: మనిషికి పంది గుండె

వైద్యశాస్త్రంలో కీలక మైలురాయి చోటుచేసుకుంది. వైద్యులు మొట్టమొదటిసారిగా పంది గుండెను మనిషికి అమర్చారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ మెడికల్‌ సెంటర్‌ నిపుణులు ఈ ఘనత సాధించారు. మరణం ముప్పును ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని కాపాడేందుకు చివరి ప్రయత్నంగా వారు ఈ ప్రయోగాత్మక శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్‌ ముగిసి మూడు రోజులు గడిచాయని, రోగి చక్కగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఇది విజయవంతమైతే అవయవ మార్పిళ్లను విస్తృతంగా చేపట్టడానికి మార్గం సుగమమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. RRR: 20 మండలాలు.. 111 గ్రామాల మీదుగా ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం

ప్రతిష్ఠాత్మక ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)లో ఉత్తర భాగం నిర్మాణానికి భూముల గుర్తింపు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. 158 కిలోమీటర్ల ఈ భాగం.. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో 20 మండలాల్లోని 111 గ్రామాల మీదుగా వెళ్లేలా తాజాగా మార్గాన్ని ఖరారు చేశారు. మొత్తం 4,620 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందనేది ప్రాథమిక అంచనా కాగా.. సంగారెడ్డి జిల్లాలో 1,250, మెదక్‌ జిల్లాలో 1,125 ఎకరాలు అవసరమని గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కనిపించని శత్రువుతో పోరాడుతోంది

కొన్ని సమస్యలు విచిత్రంగా ఉంటాయి. దానికి కొందరు స్పందించే తీరు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాంటిదే డాక్టర్‌ అనుభా మహాజన్‌ కథ. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ అమ్మాయి తనలాంటి వారి కోసం ‘క్రానిక్‌ పెయిన్‌ ఇండియా’ అని సంస్థనే స్థాపించింది. నొప్పి కోసం సంస్థ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా?! అయితే చదవండి... బెంగళూరు మెడికల్‌ కాలేజీలో దంత వైద్యంలో పీజీ చేస్తున్న డాక్టర్‌ అనుభకు మడమలో నొప్పి. చికిత్స, విశ్రాంతి కోసం వారానికోసారి సెలవు తీసుకోవాల్సి వచ్చేది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆధునిక మానవుడికి కలిసొచ్చిన ప్రొటీన్‌

పరిణామక్రమంలో ఆధునిక మానవుడికి ప్రకృతిసిద్ధంగా ఒక రక్షణ లభించింది. వానర జాతి, ఒకప్పుడు భూమిపై సంచరించిన నియాండర్తల్‌ మానవులతో పోలిస్తే మనలోని ఒక ప్రొటీన్‌ మార్పు చెందింది. ఇది వరంలా మారింది. ఫలితంగా ఆధునిక మానవుడికి తీవ్ర వ్యాధుల నుంచి మెరుగైన రక్షణ లభిస్తోందని జర్మన్‌, స్వీడన్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. ఆధునిక మానవులను ప్రత్యేకంగా నిలిపిన అంశాలేంటన్న ప్రశ్న చాలాకాలంగా శాస్త్రవేత్తలను వేధిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈ సినిమా చూస్తే.. పాత రోజులు గుర్తొస్తాయి

‘‘దర్శకుడిగా అన్ని రకాల జానర్లు చేయాలనుకుంటున్నా. ముఖ్యంగా వాస్తవికత నిండిన కథల్ని వాణిజ్యాంశాలతో మిళితం చేసి చెప్పడమంటే నాకెంతో ఇష్టం’’ అన్నారు శ్రీహర్ష కొనుగంటి. ‘హుషారు’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించిన దర్శకుడాయన. ఇప్పుడు నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘రౌడీ బాయ్స్‌’ తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Perni Nani:‘సినిమా’ తప్ప వేరే పనేం లేదా

8. పరికరం..వినూత్నం

ప్రపంచంలోనే అతిపెద్ద సాంకేతిక ప్రదర్శన. వినూత్న పరిజ్ఞానాలు ఆవిష్కృతమయ్యే వేదిక. ఇంట్లో, ఆఫీసుల్లో వాడుకునే అధునాతన పరికరాల మేళా. కన్జ్యూమర్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఏటా నిర్వహించే సీఈఎస్‌ గురించి ఇలా ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఒకపక్క కొవిడ్‌ భయపెడుతున్నా అమెరికాలోని లాస్‌వేగాస్‌లో ఈసారి కొంగొత్త పరికరాల వెల్లువతో ఎంతగానో ఆకర్షించింది. విచిత్రమైన సాధనాలతో అలరించింది. వాటిల్లో మచ్చుకు కొన్ని ఇవీ.. చెవుల్లో ఇయర్‌బడ్స్‌, ఇయర్‌ఫోన్స్‌ ధరించాల్సిన పనిలేదు. తలకు హెడ్‌ఫోన్స్‌ తగిలించుకోవాల్సిన అవసరమూ లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇష్టం లేని శృంగారాన్ని మహిళ నిరాకరించొచ్చు

వివాహితలు, అవివాహితల గౌరవాన్ని వేర్వేరుగా చూడలేమని దిల్లీ హైకోర్టు పేర్కొంది! పెళ్లయినా.. కాకున్నా.. ఇష్టం లేని లైంగిక చర్యను నిరాకరించే హక్కు ప్రతి మహిళకూ ఉంటుందని ఉద్ఘాటించింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్‌ రాజీవ్‌ శక్ధేర్‌, జస్టిస్‌ సి.హరిశంకర్‌ల ధర్మాసనం మంగళవారం ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన.. ఇష్టం లేని శృంగారాన్ని నిరాకరించే హక్కును మహిళలు కోల్పోతారా అని ప్రశ్నించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Deltacron:‘డెల్టాక్రాన్‌’ పట్ల ఆందోళన అక్కర్లేదు

సైప్రస్‌ దీవిలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌ ‘డెల్టాక్రాన్‌’ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) సభ్యుడు డా.వినయ్‌ అగర్వాల్‌ చెప్పారు. డెల్టాక్రాన్‌ తీవ్రత గురించి ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు. దేశంలో ఇప్పటికే కోట్ల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నందున ముప్పు పెద్దగా ఉండకపోవచ్చన్నారు. డెల్టా కారణంగా బాధితులు తీవ్ర అనారోగ్యానికి గురవుతుండగా, ఒమిక్రాన్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని