Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Updated : 27 Jan 2022 09:08 IST

1. ఉగాది నాటికి కొత్త జిల్లాలు

ఏపీలో ఉగాది నాటికి కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటవుతాయని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రకటించారు. ఇందులో రెండు ప్రత్యేకంగా గిరిజన ప్రాంత జిల్లాలుగా ఉంటాయని వివరించారు. సుపరిపాలన, పౌరసేవలు మరింత మెరుగ్గా అందించేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మేం ఆ జిల్లాలోకా?
కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త ఆకాంక్షలు, డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఉద్యమానికి సిద్ధమవుతుండగా, కొందరు వివిధ మార్గాల్లో నిరసన తెలియజేస్తున్నారు. కొన్ని రెవెన్యూ డివిజన్ల రద్దుపైనా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మాదకద్రవ్యం  అనే మాటే వినిపించొద్దు

మాదకద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలినవారు ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యం అనే మాటే వినిపించకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని ఉన్నతాధికారులకు సూచించారు. ప్రత్యేక దళం ఏర్పాటు చేసి నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ₹5,375 కోట్లు సర్దుబాటే!

ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త వేతన సవరణ అమలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. తొలి తొమ్మిది నెలల పాటు ఇచ్చిన మధ్యంతర భృతి మొత్తాన్ని కూడా సర్దుబాటు చేస్తోంది. 2019 జులై నుంచి 2020 మార్చి వరకు ఐఆర్‌ రూపంలో ఇచ్చిన మొత్తం సుమారు రూ.5,375 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కేసీఆర్‌ వెళ్లకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే: ఈటల

రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దిన వేడుకలకు వెళ్లకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. సమాఖ్య స్ఫూర్తి గురించి పదేపదే మాట్లాడుతున్న సీఎం ఆ ఫెడరల్‌ స్ఫూర్తిని పాటించారా? అని ప్రశ్నించారు. బుధవారమిక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈ ఏడాదీ పర్యావరణహిత బడ్జెట్‌

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2022-23 బడ్జెట్‌  కూడా పర్యావరణ హితంగానే ఉండనుంది. పన్ను ప్రతిపాదనలు, ఆర్థిక వివరాలు ఉండే బడ్జెట్‌ ప్రతుల ముద్రణను భారీగా తగ్గించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కువ శాతం బడ్జెట్‌ పత్రాలు డిజిటల్‌ రూపంలోనే లభిస్తాయని, భౌతిక ప్రతులను కొన్ని మాత్రమే ముద్రించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. అదిగదిగో.. ఎగిరే కారు

స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎగిరే కారు విషయంలో కీలక ముందడుగు పడింది.  గంటకు 300 కిలోమీటర్ల వేగంతో 8వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దూసుకెళ్లే సామర్థ్యం గల ఎగిరే కారుకు ఎయిర్‌ వర్తీనెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తూ స్లొవేకియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 70 గంటల పాటు టెస్టు ఫ్లైట్‌, 200 సార్లకుపైగా ల్యాండింగ్‌, టేకాఫ్‌ల తర్వాత ఈ కారుకు సర్టిఫికెట్‌ జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రోహిత్‌ వచ్చేశాడు

వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌కు   సెలక్షన్‌ కమిటీ బుధవారం భారత జట్లను ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్లను నడిపించనున్నాడు. రాజస్థాన్‌ హార్డ్‌ హిట్టర్‌ దీపక్‌ హుడాకు వన్డే పిలుపు అందింది. దక్షిణాఫ్రికాలో స్పిన్నర్ల వైఫల్యం నేపథ్యంలో 21 ఏళ్ల లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ తొలిసారి టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. స్పిన్నర్‌ కుల్‌దీప్‌ వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌పై కాపీరైట్‌ ఉల్లంఘన కేసు

గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​పై ముంబయిలో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు కాపీరైట్​ చట్టం ఉల్లంఘన కింద.. సుందర్​ పిచాయ్​ సహా గూగుల్‌ సంస్థలోని మరో ఐదుగురు అధికారులపై కేసు నమోదు చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. బాలీవుడ్‌ దర్శక-నిర్మాత సునీల్ దర్శన్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 319 మంది వలసదారులను రక్షించిన స్పెయిన్‌ అధికారులు

స్పెయిన్‌లోని అట్లాంటిక్‌ మహా సముద్రంలోని కానరీ ద్వీప సమూహానికి ఏడు పడవల్లో బయలుదేరిన దాదాపు 319 మంది వలసదారులను రక్షించినట్లు స్పెయిన్‌ అత్యవసర సేవల విభాగం అధికారులు పేర్కొన్నారు. వీరిలో 59 మంది మహిళలు, 24 మంది పిల్లలు ఉన్నట్లు తెలిపారు. మరో 18 మంది  గల్లంతయ్యారని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని