Updated : 25 May 2022 09:18 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. అగ్నికీలల్లో అమలాపురం

అడుగడుగునా ఉద్రిక్తత.. అంతటా ఉత్కంఠ.. ఓవైపు లాఠీలు ఝుళిపించిన పోలీసులు.. ప్రతిగా రాళ్ల దాడులకు దిగిన ఆందోళనకారులు.. కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా రణరంగంగా మారింది. కోనసీమ జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చొద్దంటూ ఆరంభమైన ఆందోళన హింసకు దారితీసింది. మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌ నివాసాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చిత్రా రామకృష్ణకు రూ.3.12 కోట్ల నోటీస్‌

స్టాక్‌ ఎక్స్ఛేంజీలో పాలనా పరమైన అవకతవకలకు సంబంధించిన కేసులో రూ.3.12 కోట్లు  కట్టాలంటూ ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ చిత్రా రామకృష్ణకు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ నోటీసు పంపింది. 15 రోజుల్లోగా చెల్లింపులు జరపడంలో విఫలమైతే అరెస్టుకు ఆదేశాలివ్వడంతో పాటు; ఆస్తుల, బ్యాంకు ఖాతాల అటాచ్‌మెంట్‌ జరుగుతుందని హెచ్చరించింది. ఎన్‌ఎస్‌ఈకి చిత్ర కంటే ముందు అధిపతిగా వ్యవహరించిన రవి నరేన్‌, సుబ్రమణియన్‌, ఇతరులపైనా అపరాధ రుసుమును సెబీ గతంలో విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇళ్ల ధరలు పెరిగాయ్‌

3. ‘ఇరవయ్యేళ్లలో కేటీఆర్‌ ప్రధాని అవుతారేమో’..

రాబోయే ఇరవయ్యేళ్లలో మంత్రి కేటీఆర్‌ భారతదేశానికి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అమెరికాలోని ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్టు, మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని మంగళవారం ప్రశంసల జల్లు కురిపించారు. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న ఇలాంటి యువ రాజకీయ నాయకుడిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్‌ బృందం తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో అద్భుతమైన కృషి చేస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఉద్యోగం చేయాలని ఉందా.. లేదా?.. పిచ్చి వేషాలు వేస్తున్నావా..

అరకులోయ, న్యూస్‌టుడే: అసంపూర్తిగా నిలిపివేసిన భవన నిర్మాణం తిరిగి ప్రారంభించమన్నందుకు ఓ సచివాలయ ఉద్యోగిని వైకాపా నేత నోటికొచ్చినట్లు మాట్లాడారు.. దీనికి సంబంధించిన ఆడియో వైరల్‌ అవుతోంది. భీంపోల్‌ పంచాయతీలో రాజ్‌కుమార్‌ సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే పంచాయతీలో సగం నిర్మించి వదిలేసిన సచివాలయ భవనం పనులు ప్రారంభించాలని గుత్తేదారు, వైకాపా నాయకుడు, మాజీ సర్పంచి భర్త వీరమళ్ల ఈశ్వరరావుకు సెల్‌ఫోన్లో సందేశం పంపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అపార్ట్‌మెంట్‌ సెల్లార్లో 200 శవాలు

యుద్ధంలో ఎంతగా మారణహోమం జరిగిందో తెలిపే మరో ఘటన మంగళవారం ఉక్రెయిన్‌లో వెలుగుచూసింది. పూర్తిగా ధ్వంసమైపోయిన మేరియుపొల్‌ నగరంలో శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్న కార్మికులకు ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్లో దాదాపు 200 మృతదేహాలు కనిపించాయి. వాటిలో చాలావరకు కుళ్లిపోయే స్థితిలో ఉన్నాయని, తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నాయని ఉక్రెయిన్‌ అధికార వర్గాలు తెలిపాయి. ఈ నగరంలో దాదాపు 21,000 మంది చనిపోయారనీ, ఈ ఘోరాలు బయటపడకుండా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇంటికెవరు.. ముందుకెవరు?

టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర సమరానికి వేళైంది. బుధవారం జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్‌ బెంగళూరు జట్టు లఖ్‌నవూను ఢీకొంటుంది. గత మ్యాచ్‌తో కోహ్లి ఫామ్‌లోకి రావడం బెంగళూరుకు పెద్ద సానుకూలాంశం.  గుజరాత్‌పై అతడు 54 బంతుల్లో 73 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దినేశ్‌ కార్తీక్‌ ఫినిషర్‌గా రాణిస్తుండడం, హేజిల్‌వుడ్‌, హర్షల్‌ పటేల్‌ రూపంలో నాణ్యమైన పేసర్లు ఉండడం, డుప్లెసిస్‌ చక్కని కెప్టెన్సీ.. తొలి టైటిల్‌ కోసం ఆరాటపడుతోన్న బెంగళూరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Gujarat: మిల్లర్‌ దంచేయగా.. ఫైనల్‌కు దర్జాగా

7. టెక్సాస్‌లోని పాఠశాలలో దుండగుడి కాల్పులు.. 21 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 మంది చిన్నారులతో పాటు మొత్తం 21 మంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన విద్యార్థుల వయసు 4 నుంచి 11 ఏళ్ల మధ్య ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. గత కొన్నేళ్లలో ఇది అత్యంత ఘోరమైన ఘటన అని ఆ రాష్ట్ర గవర్నర్‌ గ్రేగ్‌ అబాట్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మంకీ పాక్స్‌పై అప్రమత్తం

మశూచిని పోలిఉండే వైరల్‌ వ్యాధి మంకీపాక్స్‌పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. 80 దేశాల్లో ఈ కేసులు నమోదవుతుండడం, వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి రాకపోకలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అన్ని జిల్లాల వైద్యాధికారులకు పలు సూచనలు చేసింది. ప్రస్తుతం ఈ కేసులు మన వద్ద నమోదు కాకపోయినా, ముందు జాగ్రత్తల ద్వారా వైరస్‌ వ్యాప్తిని నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వంటగదికి తీపి కబురు

డాదికి 20 లక్షల మెట్రిక్‌ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ఫ్లవర్‌) నూనె, మరో 20 లక్షల మెట్రిక్‌ టన్నుల సోయాబీన్‌ నూనెల దిగుమతిపై కస్టమ్స్‌ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌లను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ముడి సోయాబీన్‌ నూనె, ముడి పొద్దుతిరుగుడు పువ్వు నూనెల దిగుమతికి ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పోలీసుల వాదనపై అనుమానాలెన్నో?

దళిత యువకుడు, డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా నేత, ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ (అనంతబాబు) పాత్రకు సంబంధించి పోలీసులు వినిపించిన వాదన పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితుడు వాంగ్మూలంలో చెప్పిన విషయాల్నే ఎస్పీ ప్రెస్‌మీట్‌లో వివరించారే తప్ప.. తమ దర్యాప్తులో ఏం తేలిందనే దానిపై స్పష్టమైన ఆధారాలతో వివరాలు చెప్పలేదన్న విమర్శలొస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని