Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 May 2022 09:18 IST

1.  తెర వెనుక ఎవరు?

కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మంగళవారం నాటి విధ్వంసం మూలాల శోధనలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఉద్యమం హింసాత్మకంగా మారడం వెనుక కుట్రకోణం ఉందనే వ్యాఖ్యలు రావడంతో ఆ దిశగానూ దర్యాప్తు ముమ్మరం చేశారు. తెదేపా, జనసేన ద్వితీయశ్రేణి నాయకులు వైకాపా బీసీ కౌన్సిలర్‌తో మంతనాలు జరిపారని మంత్రి విశ్వరూప్‌ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతవరకూ కోనసీమ సాధన సమితి ఆందోళనలోకి రౌడీషీటర్లు చొరబడ్డారని భావించిన పోలీసులకు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రయాణానికి 15 నిమిషాల ముందూ రిజర్వేషన్‌!

దూర ప్రాంతాలకు సంబంధించి బస్సు బయల్దేరడానికి 15 నిముషాల ముందు కూడా టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునే విధానాన్ని త్వరలో తీసుకురానున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం బస్సు బయల్దేరడానికి గంట ముందుగానే రిజర్వేషన్‌ సదుపాయ సమయం ముగుస్తుంది. బస్సులో సీట్లు ఖాళీ ఉన్న పక్షంలో డ్రైవర్‌/కండక్టర్‌ను సంప్రదించి నగదు రూపంలో చెల్లించి టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. BMW Car: ఒక ఛార్జింగ్‌తో 590 కి.మీ. ప్రయాణం

ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 590 కిలోమీటర్లు ప్రయాణించే విద్యుత్‌ సెడాన్‌ ఐ4ను జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూ భారత విపణిలోకి ప్రవేశ పెట్టింది. దీని ప్రారంభ ధర రూ.69.9 లక్షలు. 340 హెచ్‌పీ సామర్థ్యంతో, 5.7 సెకన్లలోనే 100 కి.మీ. గరిష్ఠ వేగం అందుకుంటుంది. 80.7 కిలోవాట్‌ అవర్‌ లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీతో దీన్ని తయారు చేశారు. బీఎండబ్ల్యూ ఐ4లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. జులై నుంచి డెలివరీలు ప్రారంభిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇంటికెళ్లి వంట చేసుకో!

నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియాసూలేను ఉద్దేశించి మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ‘నీకు రాజకీయాలు ఎందుకు..ఇంటికి వెళ్లి వంటచేసుకో’ అని బుధవారం ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాల నేతలు మండిపడ్డారు. దీంతో చంద్ర కాంత్‌ పాటిల్‌ గురువారం ఒక ప్రకటన చేస్తూ... తాను చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచే ఉద్దేశంతో చేసినవి కావని వివరణ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దాన లక్ష్ములు!

‘నా సంపదలో సగం దానం చేస్తా’ రెండేళ్ల క్రితం మెకంజీ స్కాట్‌ మాట ఇది! అన్నట్టుగానే ఏటా ఆమె దానాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వచ్చారు. తాజాగా రూ.954 కోట్ల వితరణతో ఇప్పటివరకూ ఆమె దానం చేసిన మొత్తం రూ.93 వేల కోట్లకు పైమాటే! సంపద నలుగురికీ పంచినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నది ఆమె ఉద్దేశం. మాదీ ఇదే మాట అంటూ దాతృత్వంలో పోటీపడుతున్న వారిలో కొందరు వీళ్లు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. స్కోరుంటే... తగ్గేను వడ్డీ భారం

రుణాలపై వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో బ్యాంకులు వడ్డీ రేటును క్రెడిట్‌ స్కోరుకు అనుసంధానిస్తున్నాయి. అధిక క్రెడిట్‌ స్కోరున్న వారికి వడ్డీ రేట్లలో 5-10 బేసిస్‌ పాయింట్ల వరకూ రాయితీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రుణం తీసుకోవాలనుకునే వారు తమ క్రెడిట్‌ స్కోరు ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రాజస్థాన్‌ రాజసమా.. బెంగళూరు ప్రతాపమా?

టీ20 లీగ్‌ చివరి అంకంలో మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. మేటి బ్యాట్స్‌మెన్‌కు, నాణ్యమైన బౌలర్లకు నెలవైన రెండు జట్ల మధ్య రెండో క్వాలిఫయర్‌ పోరు శుక్రవారమే. తొలి క్వాలిఫయర్‌లో పోరాడి ఓడిన రాజస్థాన్‌ ఎలిమినేటర్‌లో కష్టం మీద గట్టెక్కిన బెంగళూరు ఫైనల్‌ బెర్తు కోసం అహ్మదాబాద్‌లో తలపడబోతున్నాయి. మరి టైటిల్‌ పోరులో గుజరాత్‌ను ఢీకొనబోయే జట్టేదో?పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మళ్లీ కోతలు

రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. దీంతో అనధికార విద్యుత్‌ కోతలు మళ్లీ వచ్చాయి. బుధవారం రాత్రి గంటల తరబడి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. ఉష్ణోగ్రతలూ పెరగడంతో ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం 198.21 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) డిమాండ్‌ ఉంటే.. దీనికి అనుగుణంగా సరఫరా చేయలేక అత్యవసర లోడ్‌ సర్దుబాటు పేరిట 5.68 మిలియన్‌ యూనిట్ల మేరకు కోత విధించాల్సి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మహిళా ఉద్యోగి నగ్న చిత్రాలు తీసిన ఆఫీస్‌ బాయ్‌

తాను పనిచేసే ప్రాంతంలోని వాష్‌రూంలో కెమెరా పెట్టాడో ఉద్యోగి. మహిళా ఉద్యోగుల ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తర్వాత పని మానేసిన ఆ ఉద్యోగి.. ఓ మహిళా ఉద్యోగి సెల్‌ఫోన్‌కు ఆమె నగ్న చిత్రాలను పంపాడు. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని ఓ బొటిక్‌లో ఓ మహిళ(32) గతంలో ఉద్యోగిగా పనిచేసి 2021లో మానేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఆమె సెల్‌ఫోన్‌కు ఒక సంక్షిప్త సందేశం వచ్చింది. గుర్తుతెలియని నంబర్‌ నుంచి వచ్చిన ఆ సందేశంలో ఆమె శరీర భాగాలపై అసభ్యంగా వివరణ ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మలేరియా నివారణకు జన్యుమంత్రం

అనాదిగా మానవాళిని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో మలేరియా ఒకటి. పరిశోధకులు దశాబ్దాలుగా కృషిచేస్తున్నా దాని వ్యాప్తికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ సగటున నిమిషానికి ఓ చిన్నారి మలేరియా దెబ్బకు ప్రాణాలు కోల్పోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో ‘జీన్‌ డ్రైవ్‌’ అనే సరికొత్త జన్యుమార్పిడి సాంకేతికత మలేరియా వ్యాప్తి నివారణకు ఆశాకిరణంలా కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని