Updated : 01 Jul 2022 09:14 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. TSRTC: శ్రీవారి భక్తులకు శుభవార్త.. బస్‌ టికెట్‌తో పాటే దర్శనం టికెట్‌

తెలంగాణ నుంచి తిరుమల వెళ్లనున్న భక్తులకు టీఎస్‌ఆర్టీసీ తీపి కబురు అందించింది. తిరుమల వెళ్లేందుకు ఆర్టీసీ బస్‌ టికెట్‌తో పాటు వెంకటేశ్వరస్వామి దర్శనానికి టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని శుక్రవారం నుంచి వినియోగించుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ప్రతిరోజూ వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ, తితిదే మధ్య అంగీకారం కుదిరిందని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. LPG: భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్‌ ధర

వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు భారీగా తగ్గించాయి. ₹183.50 రూపాయల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2021కి, ముంబయిలో రూ.1981కి, హైదరాబాద్‌లో రూ.2242కు చేరాయి. తగ్గించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రూ.15 లక్షలు ఇస్తేనే మీ నాన్నను వదిలిపెడతాం.. కాళ్లు, చేతులు కట్టేసి కుమారుడికి ఫోన్‌

ముంబయి విమానాశ్రయం నుంచి వస్తున్న సమయంలో ఆ నగర శివార్లలో జూన్‌ 22న అపహరణకు గురైన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరికి చెందిన మత్తమల్ల శంకరయ్య ఇంకా కిడ్నాపర్ల చెర వీడలేదు. ఆగంతకులు గురువారం కాళ్లు, చేతులు కట్టేసి శంకరయ్యను బందీగా ఉంచిన ఫొటోను వాట్సప్‌లో ఆయన కుమారుడు హరీష్‌కు పంపించారు. అనంతరం ‘రూ.15 లక్షలు ఇస్తేనే వదిలిపెడతాం. మీరు ఎక్కడికి డబ్బులు తెచ్చిస్తారో చెప్పండంటూ’ ఇంటర్‌నెట్‌ ఫోన్‌ ద్వారా మాట్లాడుతూ హరీష్‌ను బెదిరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Plastic Ban: నేటి నుంచి ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌పై నిషేధం

ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువులపై దేశవ్యాప్త నిషేధం శుక్రవారం నుంచి అమలులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం అమలుపై ప్రచారం చేపట్టి..తయారీ యూనిట్లు, పంపిణీ సంస్థలు, విక్రయాలు, నిల్వలను అరికట్టాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు కోరారు. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానా, జైలుశిక్ష లేదా రెండూ ఉంటాయన్నారు. ఈ నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!

సబ్‌స్టేషన్‌లో భద్రతా వ్యవస్థలు పని చేయకపోవడమే శ్రీసత్యసాయి జిల్లాలో గురువారం జరిగిన విద్యుత్‌ ప్రమాదానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యుత్‌ తీగలు తెగి రహదారిపై వెళ్తున్న ఆటోపై పడిన ఈ దుర్ఘటనలో.. క్షణాల్లో మంటలు చెలరేగి ఐదుగురు సజీవ దహనమయ్యారు. సాధారణంగా తీగలు తెగిపడితే వెంటనే ఎర్తింగ్‌ అవుతుంది. వెన్వెంటనే 11 కేవీ సబ్‌స్టేషన్‌లోని బ్రేకర్లు వాటంతట అవే పనిచేసి లైన్లకు సరఫరా నిలిచిపోతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. IND vs ENG: ఆఖరి సవాల్‌.. భారత్‌కు బుమ్రా సారథ్యం

ఎన్నోసార్లు ఇంగ్లాండ్‌కు వెళ్లినా టీమ్‌ఇండియా మూడు సార్లు మాత్రమే టెస్టు సిరీస్‌ గెలిచింది. నాలుగోసారి ఆ ఘనత సాధించేందుకు ఇప్పుడో అవకాశం. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్‌.. ఇంగ్లాండ్‌తో ఆఖరి సమరానికి సిద్ధమైంది. నేటి నుంచే చివరిదైన అయిదో టెస్టు. నిరుడు కరోనా కారణంగా వాయిదా పడ్డ టెస్టిది. పరిస్థితుల్లో మార్పులెన్నో! తాజాగా టెస్టు సిరీస్‌లో అదిరే ప్రదర్శనతో కివీస్‌ను ఓడించిన ఇంగ్లాండ్‌, అప్పటికన్నా బలంగా కనపడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)తో ఆధార్‌ను అనుసంధానం చేయాలి. లేకపోతే పాన్‌ చెల్లకుండా పోతుంది. జూన్‌ 30 వరకూ రూ.500 అపరాధ రుసుముతో పాన్‌-ఆధార్‌ అనుసంధానానికి వీలు కల్పించారు. ఇప్పుడు ఈ జరిమానా మొత్తం రెట్టింపు అవుతోంది. నేటి నుంచి ఈ రెండింటినీ జత చేసేందుకు అపరాధ రుసుము రూ.1,000 చెల్లించాలి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకూ అనుమతి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఉద్ధవ్‌ లెక్క తప్పిందెక్కడ?

సీఎం పదవికి రాజీనామా చేసేందుకు రాజ్‌భవన్‌కు ఉద్ధవ్‌ ఠాక్రే తానే స్వయంగా డ్రైవింగ్‌ సీట్లో కూర్చుని కారును నడుపుకొంటూ వెళ్లారు. ఒక రకంగా ప్రభుత్వాధినేతగా కూడా ఠాక్రే అదే పని చేశారు. అన్ని బాధ్యతలను తానే నిర్వహించి, పార్టీలో రగులుతున్న అసంతృప్తిని, తిరుగుబాటును గుర్తించలేకపోయారు. కానీ శివసేన వ్యవస్థాపకుడు.. ఉద్ధవ్‌ తండ్రి బాలాసాహెబ్‌ మాత్రం ఎన్నడూ ఆ పనిచేయలేదు. సీఎం పదవిలో కూర్చొనే అవకాశం వచ్చినా, వెనుక సీట్లోనే కూర్చునే ప్రభుత్వాన్ని నడిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. హిట్టు మాట...గట్టిగా గిట్టుబాట

చిత్రసీమలో ఎప్పుడూ విజయాల శాతం తక్కువే. నిర్మాత మొదలుకొని... ప్రదర్శన కారుడి వరకు అందరికీ లాభాలు తెచ్చిపెట్టే సినిమాలు కొన్నే. ఆ కాసిన్ని ఇచ్చే భరోసాతోనే పరిశ్రమ ముందుకు సాగుతుంటుంది. ఈసారీ అదే వరసే! ఎన్నో ఆశలు... మరెన్నో అంచనాల మధ్య మొదలైన 2022లో ఆరు నెలల కాలం గడిచిపోయింది. అనువాదాలతో కలుపుకొని మొత్తం 115 సినిమాలు విడుదలయ్యాయి. ఎప్పట్లాగే అప్పుడప్పుడే అయినా... ఈసారి హిట్టు మాట కాస్త గట్టిగా వినిపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారత్‌ అప్పు రూ.1,33,22,727 కోట్లు

దేశంపై ఉన్న అప్పు 2022 మార్చి 31 నాటికి రూ.1,33,22,727 కోట్లకు చేరింది. 2021 డిసెంబర్‌ నాటికి రూ.1,28,41,996 కోట్ల మేర ఉన్న రుణభారం మూడు నెలల్లో రూ.4,80,731కోట్ల మేర పెరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ గురువారం విడుదల చేసిన పబ్లిక్‌ డెట్‌ మేనేజ్‌మెంట్‌ నివేదిక వెల్లడించింది. భారత్‌కున్న అప్పులో అంతర్గత రుణం రూ.1,14,62,343 కోట్ల (86.03%) మేర ఉండగా, విదేశీ రుణం రూ.8,32,409కోట్ల మేర ఉంది. పబ్లిక్‌ అకౌంట్‌ లయబిలిటీస్‌ రూ.10,27,976 కోట్లకు చేరాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని