Updated : 02 Jul 2022 09:16 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ‘దక్షిణ’ బెలూన్లే కరోనాను మోసుకొచ్చాయి

ఉత్తర కొరియాలో కొవిడ్‌ ప్రబలడం వెనుక.. ఆ దేశం ఓ వింతైన కారణాన్ని తెరపైకి తెచ్చింది. పొరుగున ఉన్న దక్షిణ కొరియాను నిందించే ప్రయత్నం చేసింది. ఆ దేశం నుంచి గాల్లో ఎగురుకుంటూ వచ్చిన బెలూన్ల వల్లే తమ దేశంలో కొవిడ్‌ వ్యాప్తి ప్రారంభమై ఉండొచ్చన్న అభిప్రాయాన్ని శుక్రవారం వ్యక్తం చేసింది. ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఈ వాదన వివాదాస్పదంగా మారింది. అయితే ద.కొరియా దీన్ని తోసిపుచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సెల్‌ఫోన్‌తో కరెంటు బిల్లు!

మీ ఇంట్లో వాడిన కరెంటుకు మీరే బిల్లు తీసుకోవచ్చు.. వెంటనే ఆన్‌లైన్‌లో చెల్లించనూవచ్చు.. ఆ సౌకర్యం ఉందని తెలుసా? మీ సెల్‌ఫోన్‌తో మీ ఇంటి విద్యుత్‌ మీటరు రీడింగ్‌ను ఫొటో తీస్తే ఎన్ని యూనిట్లు వినియోగించారో తెలుస్తుంది. నెల పూర్తయితే బిల్లు కూడా వస్తుంది. నెలకోసారి బిల్లు కోసం మీటర్‌ రీడింగ్‌ ఫొటో తీసుకోవడమే కాక, ఏ రోజైనా మీటరును ఫొటో తీస్తే అప్పటివరకూ ఆ నెలలో ఎన్నిరోజులకు ఎన్ని యూనిట్లు కరెంటు వాడారు, నెల పూర్తవడానికి ఇంకా ఎన్ని రోజులుంది, అప్పటివరకూ మీ బిల్లు ఎంత రావచ్చనేది ఏరోజైనా తెలుసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఎప్పుడు?

సర్కారు బడుల్లో ఉపాధ్యాయ ఖాళీలను నింపుతామని మార్చిలో ప్రకటించిన ప్రభుత్వం నేటికీ ఆమోదం తెలపలేదు. ఉపాధ్యాయ నియామకాలకు టెట్‌ను నిర్వహించిన సర్కారు శుక్రవారం వాటి ఫలితాలను వెల్లడించింది. తర్వాతి ప్రక్రియ టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు(టీఆర్‌టీ) గురించి ఏమీ ప్రకటించలేదు. రాష్ట్రంలో 80 వేలకుపైగా ఉద్యోగ ఖాళీలను పూరిస్తామని మార్చి 9న సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అందులో పాఠశాల విద్యాశాఖలో 13,086 కొలువులుంటాయన్నారు. బోధనేతర పోస్టులను పక్కనబెడితే మోడల్‌ పాఠశాలలు, తెలంగాణ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లోని ఖాళీలతో కలిపి సుమారు 11వేల ఉపాధ్యాయ ఉద్యోగాలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వేదికపై ముగ్గురే..!

హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాన వేదికపై ముగ్గురు నాయకులు మాత్రమే ఆసీనులు కానునున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రాజ్యసభలో భాజపా పక్షనేత, కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌లు మాత్రమే వేదికపై కూర్చుంటారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు జాతీయ పార్టీ, అనుబంధ విభాగాలు, రాష్ట్రాల అధ్యక్షులు సహా ఇతర నేతలు కలిపి మొత్తం 345 మందికి అవకాశం లభించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రధాని మేకప్‌ ఖర్చు నెలకు రూ. 70 లక్షలు

5. IND vs ENG: ఐదో టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఆట విశేషాలు..

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తొలిరోజు ఆటముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన పంత్‌(146) సెంచరీ, జడేజా(83 నాటౌట్‌) అర్ధశతకంతో చేలరేగారు. దీంతో భారత్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. తొలిరోజు ఆటకు సంబంధించి హైలైట్స్‌ ఒకసారి చూసేద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అక్టోబర్‌ 1 నుంచి కొత్తరకం టైర్లు..

అక్టోబర్‌ 1 నుంచి ప్రయాణికుల కార్లు, ట్రక్కులు, బస్సులకు నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన కొత్త రకం డిజైన్ల టైర్లు వాడాలని కేంద్ర రహదారి, రవాణాశాఖ నిర్దేశించింది. ఈమేరకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇకపై కొత్త టైర్లు రోలింగ్‌ రెసిస్టెన్స్‌, వెట్‌ గ్రిప్‌, రోలింగ్‌ సౌండ్‌ ఎమిషన్‌ విషయాల్లో ‘ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌ 142:2019’లో నిర్దేశించినట్లుగా ఉండాలని కేంద్రం పేర్కొంది. ప్యాసింజర్‌ కార్లు, లైట్‌ ట్రక్కులు, ట్రక్కులు-బస్సులకూ ఈ నిబంధనలు వరిస్తాయని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు

తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరడానికి బేరం పెట్టారని ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఆరోపించారు. పిల్లల చదువుతోపాటు రూ.30 కోట్లు, మంత్రి పదవి, అమరావతిలో ఇల్లు ఇస్తామన్నారని.. అయితే తమ నాయకుడు జగన్‌పై ఉన్న నమ్మకం, అభిమానంతో పార్టీ మారలేదని పేర్కొన్నారు. శుక్రవారం విజయనగరంలో జిల్లా స్థాయి ప్లీనరీలో ఆయన మాట్లాడారు. తెదేపాలోకి వెళ్లకపోవడం వల్లే తాను ఈ రోజు మంచి పదవిలో ఉన్నానని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చిన్న బడ్జెట్‌.. సొంత గూడు

 స్థలం ఉంది.. ఇల్లు కట్టుకోవాలి.. తక్కువలో తక్కువ పది లక్షల రూపాయలు నిర్మాణానికి ఖర్చు చేయాల్సి వస్తోంది. రూ.2.34 లక్షల్లోనే చిన్న ఇంటిని నిర్మించుకోగలిగితే.. చాలామందికి ఉపయుక్తం. రాజేంద్రనగర్‌ ఎన్‌ఐఆర్‌డీలోని గ్రామీణ సాంకేతిక పార్కులో తక్కువ వ్యయంతో నమూనా గృహాన్ని నిర్మించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద గ్రామీణ ప్రాంత ప్రజల కోసం నమూనా ఇంటిని సిద్ధం చేసినా...  తక్కువ ఖర్చు కావడంతో నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్‌ ఐలాండ్‌ను విడిచిన రష్యా

ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టిన ఆరంభంలో నల్ల సముద్రంలోని ‘స్నేక్‌ ఐలాండ్‌’ను ఆక్రమించిన రష్యా... ఇప్పుడు దాన్ని వదులుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. ఆ ద్వీపం నుంచి కేవలం 35 కిలోమీటర్ల దూరంలోనే కీలకమైన ఉక్రెయిన్‌ తీర ప్రాంతాలు, రేవులు ఉన్నాయి. దీంతో అక్కడి నుంచి వాటిపై దాడులు చేయడం చాలా సులభమని మాస్కో భావించింది. అవసరమైతే, అక్కడి నుంచి నాటో సభ్య దేశమైన రొమేనియాపైనా దాడులు చేసేందుకు అనుకూలంగా ఉంటుందని యోచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!

10. Viral video: వారెవ్వా.. ఏం ట్యాలెంట్‌.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!

ప్రస్తుత ఇంటర్నెట్‌ యుగంలో అనేక ఆసక్తికర వీడియోలు వెలుగులోకి వస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాంటి మరో వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. ఆవు పేడతో ఓ మహిళ గోడపై పిడకలు పెడుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. గోడ భారీ ఎత్తులో ఉన్నప్పటికీ.. అలవోకగా వరుస క్రమంలో అతికేలా పేడ ముద్దలను విసురుతుండటం చూసి పలువురు నెటిజన్లు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె ‘త్రో’కు పైనుంచి కిందకు వరుసగా పేడ ముద్దలు అతుక్కుంటుండటం చూసి నెటిజన్లు వావ్‌.. అంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని