Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Sep 2022 09:48 IST

1. మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూత

ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబు (Mahesh Babu)కు మాతృవియోగం కలిగింది. సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ తల్లి ఇందిరాదేవి (Indira Devi)(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం వేకువజామున హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, సూపర్‌స్టార్‌ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విద్యుత్తు అవసరం లేని ఫ్రిజ్‌!

ఎలాంటి విద్యుత్తు అవసరం లేదు. కొద్దిపాటి నీరుంటే చాలు. చల్లబరిచేస్తుంది. ఇలాంటి వినూత్న శీతలీకరణ వ్యవస్థనే రూపొందించారు ఎంఐటీ పరిశోధకులు. ఒకరకంగా దీన్ని కొత్తరకం ఫ్రిజ్‌ అనుకోవచ్చు. ఇది ఆహార పదార్థాలు చెడిపోకుండా చూడటమే కాదు.. ఇళ్లలో సంప్రదాయ ఏసీలకు ప్రత్యామ్నాయంగానూ ఉపయోగపడగలదని భావిస్తున్నారు. చూడటానికి సౌర ఫలకం మాదిరిగా కనిపించే దీనిలో మూడు పొరలుంటాయి. పైపొరను ఏరోజెల్‌, మధ్యపొరను రంధ్రాలతో కూడిన హైడ్రోజెల్‌, అడుగు పొరను అద్దంలాంటి పదార్థంతో తయారుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ముఖ్యమంత్రి వస్తున్నారని తిరుపతిలో అన్నీ బంద్‌

ముఖ్యమంత్రి జగన్‌ తిరుపతి పర్యటన సందర్భంగా పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఆయన పర్యటించే ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 6.35 గంటల వరకు రాకపోకలను నిలిపివేశారు. అసలే శ్రీనివాస సేతు పనులు జరుగుతుండగా ఉన్న మార్గాల్లో కూడా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో సామాన్యులకు కష్టాలు తప్పలేదు. తొలుత ఎంఆర్‌పల్లి నుంచి బాలాజీ కాలనీ, ఎన్టీఆర్‌ కూడలి, గాంధీ రోడ్డు, మున్సిపల్‌ కార్యాలయ కూడలి ప్రాంతాల్లో గంటకు పైగా రాకపోకలు నిలిపివేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. PFI: పీఎఫ్‌ఐపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం

పీఎఫ్‌ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)పై కేంద్రం నిషేధం విధించింది. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. యూఏపీఏ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.  ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను అందించడంతోపాటు యువతకు శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలపై పీఎఫ్‌ఐ కార్యాలయాలపై దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్‌ను కేంద్ర హోంశాఖ చేపట్టిన విషయం తెలిసిందే.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వీడియోలు చేస్తోందని భార్యను చంపేశాడు!

సోషల్‌ మీడియాలో వీడియోలు చేస్తోందని ఆగ్రహించిన ఓ భర్త.. తన భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన బిహార్‌ భోజ్‌పుర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నూ ఖాతూన్‌, అనిల్‌కు 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. సోషల్‌ మీడియాలో అన్నూ వీడియోలు(రీల్స్‌) చేస్తుండేది. భార్య అలా చేయడం భర్తకు నచ్చలేదు. వీడియోలు చేయొద్దని ఆమెను కోరాడు. ఇందుకు అన్నూ నిరాకరించింది. దీంతో ఉద్రేకానికి గురైన అనిల్‌ భార్యను గొంతు నులిమి హత్యచేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఒళ్లు బలిసిన వారి పాదయాత్ర: మంత్రి అంబటి

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఒళ్లు బలిసిన వారు చేస్తున్న పాదయాత్ర అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా కోడూరులో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్‌ చేయూత మూడో విడత పంపిణీలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికే సీఎం జగన్‌ మూడు రాజధానులను కొనసాగించాలని చూస్తున్నారన్నారు. కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని, తన పార్టీపై నమ్మకం లేక మిగిలిన పార్టీలతో కలిసి వెళ్లేందుకు ఆయన చూస్తున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మరో అరశాతం పెంపు తప్పదా?

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కూడా సిద్ధం అవుతోంది. బుధవారం ప్రారంభమయ్యే ద్రవ్య పరపతి సమీక్షలో తీసుకునే నిర్ణయాలను శుక్రవారం వెల్లడిస్తారు. అమెరికా, ఐరోపా దేశాల్లో ద్రవ్యోల్బణ నియంత్రణకు వడ్డీరేట్లు పెంచుతున్నందున, మాంద్యం చుట్టుముడుతుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌లోనూ 8 నెలలుగా ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్షిత 6 శాతానికి మించే కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నీమన్‌ చాలాసార్లు మోసం చేశాడు

మెరికా టీనేజీ గ్రాండ్‌మాస్టర్‌ నీమన్‌ బహిరంగంగా ఒప్పుకున్న దానికంటే ఆటలో ఎక్కువ మోసాలే చేశాడని ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఆరోపించాడు. అలాంటి ఆటగాడితో ఆడనని స్పష్టం చేశాడు. ఇటీవల జులియస్‌ బేర్‌ జనరేషన్‌ కప్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో ఒక్క ఎత్తు వేయగానే నీమన్‌తో గేమ్‌ నుంచి కార్ల్‌సన్‌ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ తాజాగా ట్విటర్‌లో లేఖ పోస్టు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కోటి కొలువులిచ్చే విద్యుత్‌ వాహనాలు!

కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వశాఖ తాజా అంచనాల ప్రకారం 2030 నాటికి విద్యుత్‌ వాహనాల తయారీ పరిశ్రమ మన దేశంలో ప్రత్యక్షంగా కోటి, పరోక్షంగా 5 కోట్ల ఉద్యోగాలను సృష్టించనుంది! ఇందులో అత్యధికం ఇంజినీరింగ్‌ అభ్యర్థులకే అందనున్నాయి. మరి ఈ ఉద్యోగాలను అందుకోవాలంటే ఎలాంటి నైపుణ్యాలు కావాలో, ఈ పరిశ్రమ గురించి పూర్తి వివరాలేంటో చూద్దామా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చూస్తే రూ.40.. లెక్కిస్తే రూ.కోట్లు!

గ్యాస్‌ సిలిండర్‌ పేరు వింటేనే సామాన్యుడి గుండెల్లో దడ మొదలవుతోంది. ప్రభుత్వం రోజురోజుకూ గ్యాస్‌ ధర పెంచుతోంది. మరోవైపు డెలివరీ బాయ్స్‌ దందా సాగిస్తున్నారు. కంపెనీలు నిర్ణయించిన ధరకు అదనంగా డెలివరీ సమయంలో వసూలు చేస్తున్నారు. ఒక్కో సిలిండర్‌పై సరాసరిన రూ.40 వరకు లబ్ధిదారులపై భారం వేస్తున్నారు. ఇక పల్లెల్లో రూ.100 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఈ దందాపై ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. పౌర సరఫరాల విభాగం అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని