Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Oct 2022 09:18 IST

1. మలివయస్సుకు చట్టమే అండ

ఖమ్మం నగరానికి చెందిన వృద్ధ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడున్నారు. వారికి పక్కా ఇల్లు ఉంది. కిరాణ దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. కుమారుడు చనిపోయాడు. దీంతో కోడలు ఉన్న ఇల్లు అమ్మాలని వృద్ధులపై ఒత్తిడి తీసుకు వచ్చి అనేక రకాలుగా హింసించేది. పెద్ద మనుషుల్లో పంచాయితీ పెట్టినా వేధింపులకు ఆపలేదు. దీంతో ఆ వృద్ధులు ఖమ్మం న్యాయసేవా సంస్థకు ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తి వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అత్తామామలు, కోడలుతో విడివిడిగా రాజీ కుదిర్చారు. ప్రస్తుతం ఏ సమస్య లేకుండా ఉంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండ

2. బస్సుల జాడ తెలిపేలా బోర్డులు

నగరంలో బస్సు వస్తుందో లేదో తెలియని అయోమయానికి తెరదించే పనిలో టీఎస్‌ఆర్టీసీ పడింది. ప్రధానమైన బస్టాపుల్లో బస్సుల రాకను గమనించి సమాచారం ఇచ్చే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఒక ఎలక్ట్రిక్‌ డివైజ్‌ను ప్రధాన బస్టాపుల్లో ఉంచుతారు. దాని ద్వారా బస్సు ఎంత సమయానికి వచ్చిందో.. తెలుసుకుని తదుపరి స్టాపునకు ఎన్ని నిమిషాల్లో వెళ్తుందో సమాచారం అందిస్తారు. అక్కడ డిజిటల్‌ బోర్డు మీద కనిపించేలా ఏర్పాట్లు చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గ్రూపు-1 ఉద్యోగాలకు మాత్రమే ఇంటర్వ్యూలు!

 గ్రూపు-1 పోస్టుల భర్తీకి మాత్రమే మౌఖిక పరీక్షలను పరిమితంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 28న జారీచేసిన ఉత్తర్వుల్లో గ్రూపు-1 ఉద్యోగాలతోపాటు లెక్చరర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి కూడా ఇంటర్వ్యూలను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే..తాజా గ్రూపు-1 ఉద్యోగాల భర్తీకి మాత్రమే ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మైనర్ల అబార్షన్లను గోప్యంగా ఉంచొచ్చు..

వివాహితులు, అవివాహితులనే వివక్ష లేకుండా దేశంలో మహిళలందరూ 24 వారాల్లో సురక్షిత గర్భవిచ్ఛిత్తి చేసుకోవచ్చంటూ గురువారం చరిత్రాత్మక తీర్పును వెల్లడించిన సుప్రీంకోర్టు..  మైనర్‌ బాలికల విషయంలో కొన్ని కీలకాంశాలను స్పృశించింది. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టపరిధిని మైనర్లకూ విస్తరిస్తూ.. వారు కూడా 24 వారాల్లోపు అబార్షన్‌ చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు.. అందుకు అడ్డుగా ఉన్న  పోక్సో చట్టంలోని సెక్షన్‌ 19(1) నుంచి వైద్యులకు రక్షణ కల్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమెరికాలోనే హెచ్‌1బీ వీసాల స్టాంపింగ్‌

అమెరికాలోనే హెచ్‌-1బీ వీసాల స్టాంపింగ్‌కు వెసులుబాటు ఇవ్వాలన్న సిఫార్సులకు ఆసియన్‌ అమెరికన్లు, పసిఫిక్‌ ద్వీపవాసులకు సంబంధించిన ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఒకవేళ ఈ సిఫార్సుకు అధ్యక్షుడు జో బైడెన్‌ పచ్చజెండా ఊపితే వేలాదిమంది విదేశీ వృత్తి నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు ఎంతో ఊరట లభిస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. వీసా స్టాంపింగ్‌ కోసం ఆయా దేశాల్లోని అమెరికన్‌ కాన్సులేట్‌/ఎంబసీల్లో ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అశోక్‌ గహ్లోత్‌ కొనసాగేనా?

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్‌లో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ పీఠానికి ఎసరు పెట్టొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి! ఆ రాష్ట్ర సీఎం పదవిపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తాజాగా తెలపడం వాటికి బలం చేకూరుస్తోంది. మరోవైపు- తాను పదవిలో కొనసాగడం గురించి విలేకర్లు దిల్లీలో శుక్రవారం అడిగిన ప్రశ్నకు గహ్లోత్‌ నేరుగా సమాధానమివ్వలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సొంతిల్లు కల భారమే

సొంతిల్లు, కారు సమకూర్చుకోవాలనే ఆకాంక్ష, సగటు మధ్యతరగతి వర్గీయులకు మరింత ఆర్థికభారం కానుంది. వీటి కొనుగోలుకు రుణాలపైనే అత్యధికులు ఆధారపడతారు. అయితే వడ్డీరేట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 1.90 శాతం పెరగడంతో ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి నెలవారీ కిస్తీ/కాలావధి పెరగనుంది. కొత్తగా రుణం తీసుకునేవారి సంపాదన కనుగుణంగా ‘రుణ అర్హత మొత్తం’ తగ్గే ప్రమాదం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రెండేళ్లలోపు చిన్నారుల దత్తతకు నూతన నిబంధనలు

చిన్నారులను దత్తత తీసుకోవాలనుకున్న దంపతుల ఉమ్మడి వయసులో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటివరకు 0-4 ఏళ్లలోపు వయసున్న పిల్లలను దత్తత తీసుకోవాలంటే దంపతుల ఉమ్మడి వయసు గరిష్ఠంగా 90 ఏళ్లలోపు ఉండేది. సింగిల్‌ పేరెంట్‌ అయితే 45 ఏళ్లుగా ఉండేది. ఇప్పుడు చిన్నారుల వయసును రెండు కేటగిరీలుగా వర్గీకరించింది. 0-2 ఏళ్లలోపు పిల్లలను దత్తత తీసుకోవాలంటే ఉమ్మడి వయసు 85 ఏళ్లుగా ఉండాలని, సింగిల్‌ పేరెంట్‌ వయసు 40 ఏళ్లుగా ఉండాలని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పోలీస్‌ నియామక మండలి పరీక్ష ఫలితాలు ఎప్పుడో..?

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుళ్లస్థాయి ప్రాథమిక రాతపరీక్ష ఫలితాల వెల్లడి ఆలస్యం కానుంది. ఆగస్టు 7న 554 ఎస్సై స్థాయి పోస్టులకు పరీక్ష జరగ్గా.. 2,47,217 మంది హాజరయ్యారు. 28న 16,321 కానిస్టేబుళ్ల స్థాయి పోస్టులకు 6,03,955 మంది పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి సెప్టెంబరులోనే ఫలితాలను వెల్లడించాలని మండలి నిర్ణయించింది. ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వారసులొద్దు.. ఈసారికి మీరే

‘మీ వారసులను ప్రమోట్‌ చేసుకోండి. కానీ, వచ్చే ఎన్నికల కోసం మాత్రం వద్దు. వచ్చే ఎన్నికల్లో మీరే పోటీ చేయాలి’ అని వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను అంతర్మథనంలోకి నెట్టాయి. వచ్చే ఎన్నికల్లో తమ వారసుల ఆరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకున్న పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక సందిగ్ధావస్థలో పడ్డారు. ఎన్నికల బరిలో దిగేందుకు ఇప్పటికే నియోజకవర్గాల్లో చురుగ్గా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న నేతల వారసులు ఇప్పుడేం చేస్తారనేదీ ఆసక్తికరంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts