Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Oct 2022 09:06 IST

1. మారుతున్నాం.. మహాత్మా!

స్వచ్ఛత కోసం పరితపించిన బాపూజీ అడుగుజాడల్లో మన నగరాలు, పురపాలికలు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2022 పోటీలో జాతీయ స్థాయిలో మన పట్ణణాలు ముందడుగు వేశాయి. గతం కంటే మెరుగైన ర్యాంకులు సాధించి దేశంలో ఏ నగరానికీ, పట్టణానికీ తీసిపోమని నిరూపించాయి. శనివారం సాయంత్రం దిల్లీలో కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ స్వచ్ఛభారత్‌ ర్యాంకులు ప్రకటించింది.  ఆదివారం మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని మన పట్టణాలు సాధించిన స్వచ్ఛ ప్రగతిపై ప్రత్యేక కథనం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏకధాటిగా కుదిపేసింది

ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా శుక్రవారం నుంచి శనివారం రాత్రి వరకు పడిన వర్షాలతో ఒంగోలు, మద్దిపాడు, టంగుటూరు, సింగరాయకొండ ప్రాంతాలు వణికిపోయాయి. ఎటుచూసినా జల దిగ్బంధమే. ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు, దుకాణాలలోకి నీళ్లు చేరి కార్లు, ద్విచక్రవాహనాలు మునిగాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగు, వాన నీరు ఏకమైపోయాయి. నగరంలో ప్రజలు రోజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కర్నూలు రోడ్డంతా వరదే. గుంటూరు రోడ్డుదీ అదే దుస్థితి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. బావమరిది అక్రమాలు కనపడవా?

 కృష్ణా నదిలో ఇసుక, కొండపల్లిలో అక్రమ మైనింగ్‌, మద్యం షాపులు, పేదలకు అందాల్సిన రేషన్‌ను అక్రమ మార్గాన పక్కదోవ పట్టిస్తోంది ‘నీ బావమరిది’ కాదా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను ప్రశ్నించారు. శనివారం ఆయన జి.కొండూరులోని తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్‌ పేరు మార్పును వ్యతిరేకిస్తూ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడారు.  వైకాపా ప్రభుత్వ అక్రమాలు, చెత్త నిర్ణయాలను ప్రశ్నించిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించి అరెస్టులు చేయించడం దారుణమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దసరాకు రైలెక్కలేం!

పేద, మధ్య తరగతి వర్గాలకు రైలు ప్రయాణం అందుబాటులో ఉంది. బస్సు, ప్రైవేటు వాహనాలతో పోల్చితే సగం ధరకే ఊరెళ్లడానికి వీలవుతుంది. ప్యాసింజర్‌ రైలులో ఛార్జీ తక్కువగా ఉంటుంది. అయితే మూడు, నాలుగు నెలల ముందే రిజర్వు చేసుకుంటేనే సీటు లభిస్తుంది. ముంబయి, న్యూదిల్లీ రైళ్లకు మూడు నెలలు ముందుగా రిజర్వేషన్‌ చేసుకోవాల్సిందే. హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరు వైపు వెళ్లాలంటే కనీసం నెల రోజులు ముందుగా రిజర్వు చేసుకోవాలి. ఇక సెలవు రోజుల్లో పరిస్థితి దయనీయంగా ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 127 మంది దుర్మరణం

ఇండోనేషియాలో ఘోరం చోటుచేసుకుంది. ఫుట్‌బాల్‌ మైదానంలో తొక్కిసలాట జరగడంతో 127 మంది దుర్మరణం పాలయ్యారు. తూర్పు జావా ప్రావిన్స్‌లో శనివారం రాత్రి నిర్వహించిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మరో 180 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో అరెమా జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల అభిమానులు ఘర్షణకు దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఊబకాయం.. పెళ్లికి భారం

ఊబకాయం పెళ్లికి ఆటంకంగా మారింది. మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. తక్కువ వ్యవధిలో చికిత్సల ద్వారా బరువు తగ్గొచ్చని వస్తున్న ప్రకటనలకు ఆకర్షితులై మోసపోతున్నారు. సగటు బరువు కన్నా 10 నుంచి 15 కేజీల అధిక బరువును తగ్గించుకునేందుకు వేలు ఖర్చు చేస్తున్నారు. బరువు తగ్గడం మాట అటుంచితే.. శస్త్ర చికిత్సలు విఫలమై తీవ్ర అనారోగ్యంతోపాటు అప్పులపాలవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. శుభ్రం చేసుకో.. సంపాదించుకో

 బహిరంగ మూత్ర విసర్జనకు, చెత్తకుప్పలకు నిలయంగా మారుతోన్న ట్రాన్స్‌ఫార్మర్లపై జీహెచ్‌ఎంసీ దృష్టిపెట్టింది. కాలిబాటపై అడ్డుగోడలా, చెత్తకుప్పలకు ప్రతిరూపంలా, ముళ్ల పొదలకు మరోపేరులా ఉండే విద్యుత్తు నియంత్రికలను అందంగా తీర్చిదిద్దేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేసింది. ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఉండే దుర్భర పరిస్థితులను చక్కదిద్ది, ఆ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దే సంస్థలకు.. ఆయా ప్రాంతాల్లో పదేళ్లపాటు ప్రకటనలు ఏర్పాటు చేసుకునేలా అనుమతి ఇస్తామంటోంది. అందులో భాగంగా ఇంజినీర్లు ఇప్పటికే టెండరు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కొవిడ్‌-19తో గుండె దెబ్బతినేది ఇలా..

కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ వల్ల కొందరిలో గుండె దెబ్బతింటున్న వైనాన్ని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెలుగులోకి తెచ్చారు. కొవిడ్‌, ఇన్‌ఫ్లూయెంజాలు తీవ్రస్థాయి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు కలిగించే వైరస్‌ల వల్లే వస్తున్నప్పటికీ గుండె కండజాలంపై ప్రభావం చూపే విషయంలో వాటి తీరు భిన్నంగా ఉంటోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తమ పరిశీలనల్లో కొవిడ్‌ బాధితుల గుండె కణజాలాల్లో వైరస్‌ రేణువులు కనిపించలేదన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విజన్‌ ఉన్న నేత కేసీఆర్‌: ప్రకాశ్‌రాజ్‌

తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్‌ దేశంలో గొప్పనాయకుడని, విజన్‌ ఉన్న వ్యక్తి అని, రాష్ట్రంపై ప్రేమ ఉన్న నేత అని సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ కొనియాడారు. శనివారం రాత్రి కరీంనగర్‌లో నిర్వహించిన కళోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి.. జానపద కళాకారులను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన ఆటపాటలను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా, ప్రతి ఒక్కరి హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు కేసీఆర్‌ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సభనుంచి వెళ్లిపోతున్న ఆ నలుగురి పేర్లు రాసుకోండి

కృష్ణాజిల్లా పెడనలో నిర్వహించిన వైఎస్సార్‌ చేయూత కృతజ్ఞత సభలో రాష్ట్ర మంత్రి జోగి రమేష్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పెడనలోని బస్టాండు సెంటరులో శుక్రవారం నిర్వహించిన ఈ సభకు చేయూతలో లబ్ధిపొందిన 1906 మంది మహిళలను తరలించారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో ముందు వరుసలో ఉన్న నలుగురు మహిళలు అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకోసం నేను వస్తే కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారా అంటూ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని