Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... 

Updated : 03 Oct 2022 09:12 IST

1. సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ అవుతారా!

భారత వాతావరణ శాఖ (India Meteorological Department) లో 990 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. నిర్దేశిత విభాగాల్లో డిగ్రీ/డిప్లొమా పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్షలో చూపిన ప్రతిభతో అభ్యర్థులను ఎంపికచేస్తారు. వీరు సుమారు రూ.60వేల వేతనం పొందవచ్చు. ప్రకటనకు సంబంధించి పూర్తి సమాచారం.. పరీక్షను కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. ఇందులో 200 ప్రశ్నలు వస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అక్కడ అమ్మవారికి కష్టాలు చెప్పుకొని.. చెప్పులు సమర్పిస్తారు!

ఏదైనా ఆలయానికి వెళితే.. చెప్పులు బయటే విడిచి వెళతాం. కానీ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని కోలా ప్రాంతంలోని జిజిబాయ్‌ ఆలయం లేదా పహడా వాలీ మాతా మందిరానికి వెళితే నవరాత్రుల్లో భక్తులే స్వయంగా మాతా రాణి అమ్మవారికి చెప్పులు, బూట్లు వంటివి సమర్పిస్తారు. ఇక్కడ కొలువైన అమ్మవారు రాత్రిపూట చెప్పులు ధరిస్తారనేది భక్తుల విశ్వాసం. అంతేకాదు.. అమ్మవారికి చెప్పులు, బూట్లు సమర్పిస్తే ప్రసన్నురాలు అవుతుందని కూడా నమ్ముతారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ముగిసిన మంగళయాన్‌ ప్రస్థానం!.. నిండుకున్న ఇంధనం, బ్యాటరీ

అంచనాలను మించి పనిచేసిన భారత తొలి అంగారక ఉపగ్రహం మంగళయాన్‌ ప్రస్థానం ముగిసిపోయినట్లు తెలుస్తోంది. ఆ వ్యోమనౌకలో ఇంధనం, బ్యాటరీ స్థాయి.. సురక్షిత పరిమితి కన్నా తక్కువకు పడిపోవడంతో దీని సుదీర్ఘ పరిశోధనలకు తెరపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  రూ.450 కోట్లతో చేపట్టిన మంగళయాన్‌ను 2013 నవంబరు 5న పీఎస్‌ఎల్‌వీ-సి25 రాకెట్‌ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించింది. 2014 సెప్టెంబరు 24న అది విజయవంతంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మావలపై మౌనమేలా..?

స్థలాలు ఖాళీగా ఉన్నాయని గూడులేని నిరుపేదలు అక్కడ తాత్కాలిక పాకలు వేసుకుంటారు. ఆర్థిక స్తోమత లేకున్నా మెల్లిగా అక్కడ రేకులషెడ్లు, సిమెంటు ఇటుకలతో నిర్మాణాలు చేపడతారు. ఇక తమకు గూడు దొరికిందని సంబరపడుతున్న ఆ పేదల సంతోషం అంతలోనే ఆవిరైపోతోంది. అక్రమ నిర్మాణాలంటూ రెవెన్యూ అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా మావల మండలం మావల శివారులోని సర్వే నం.170లో తరచూ జరుగుతున్న ఘటనలు ఇవి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెరాస పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కేటీఆర్‌!

 ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన మేరకు జాతీయ పార్టీగా పేరు మార్పిడి ప్రక్రియ ఈ నెల 5న ప్రారంభమవుతుంది. ఆ రోజు తెరాస విస్తృతస్థాయి సమావేశం ఆమోదం అనంతరం మరుసటి రోజు అంటే ఈ నెల ఆరున దిల్లీకి తెరాస ప్రతినిధుల బృందం వెళ్తుంది. తెరాస పేరును జాతీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీ) దరఖాస్తు చేసుకుంటుంది. దాన్ని ఆమోదిస్తే వెంటనే అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జాబితాలో మారుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అధికారుల ఒత్తిళ్లు... అమ్మకానికి ఇంటి స్థలాలు!

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు కొందరు స్థలాలను వెనక్కి ఇచ్చేస్తుండగా, మరికొందరు అమ్మకానికి పెడుతున్నారు. ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ మంజూరైనప్పటికీ ఇంకనూ నిర్మాణం మొదలుపెట్టని వారు వెంటనే ప్రారంభించాలని లబ్ధిదారులను అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది. వైయస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరు మండల తహసీల్దారు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అంతన్నారు.. ఇంతన్నారు.. తుస్సుమనిపించారు!

ప్రజల దగ్గరకే పలు సేవలు చేరువచేయాలనే సంకల్పంతో ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన గ్రామ సచివాలయాల్లో అక్టోబర్‌ 2 నుంచి రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో 90కు పైగా సచివాలయాల్లో దీనికోసం స్థానికులు ఎదురుచూశారు. చెప్పిన రోజు రానే వచ్చింది కానీ ఒక్క రిజిస్ట్రేషన్‌ కూడా తొలిరోజు బోణీ కాలేదు. కారణం దానికి తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమవ్వడమే. ఏలూరు జిల్లాలో 77, పశ్చిమలో 16 గ్రామ సచివాలయాలను దీనికోసం ఎంపికచేసి రెండు రోజుల కిందటి వరకు హడావుడి చేసిన అధికార యంత్రాంగం చివరలో చేతులెత్తేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భూ సమస్యలకు.. ‘స్పందన ప్లస్‌’తో పరిష్కారం

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ‘స్పందన’లో భూసంబంధిత అర్జీలే ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల సబ్‌ కలెక్టరు భావన, పాలకొండ ఆర్డీవో హేమలత ఆధ్వర్యంలో జరిగిన ‘స్పందన’లోనూ ఈ ఫిర్యాదులే కనిపించాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా కలెక్టర్‌, ఎస్పీ ఆధ్వర్యంలో ‘స్పందన్‌ ప్లస్‌’ అనే కార్యక్రమాన్ని జిల్లాలో త్వరలో ప్రారంభించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సుద్దముక్కకు దిక్కులేదు

పాఠశాలలు తెరిచి మూడు నెలలు గడచినా నిర్వహణ నిధుల విడుదల కాలేదు. దీంతో సుద్ధ ముక్కలు, బోధన ఉపకరణాలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఓవైపు నిధుల్లో కోత మరోవైపు నిధుల విడుదలలో జాప్యం వెరసి పాఠశాల నిర్వహణ కష్టతరంగా మారింది. సుద్ధముక్కలు, రిజిష్టర్ల నిర్వహణకు హెచ్‌ఎంలు జేబు నుంచి సొంత డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇచ్చే నిర్వహణ నిధులతోనే సుద్ద ముక్కలు, డస్టర్లు, స్టేషనరీ, విద్యుత్తు బిల్లులు, రిజిష్టర్లు, క్రీడా సామగ్రి, ప్రయోగశాలలు, దిన పత్రికలు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జగనన్న కాలనీ సొగసు చూడరే!

రేపల్లె 18వ వార్డు శివారు జగనన్న కాలనీలో మౌలిక వసతుల సమస్యలతో ఇంటి నిర్మాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల తరచూ కురుస్తున్న వర్షాలకు ప్రధాన, అంతర్గత రహదారులు చిత్తడిగా మారాయి. దీనికితోడు ఇసుక, ఇటుక లోడు ట్రాక్టర్లు, లారీల రాకపోకలతో రోడ్లపై గుంతలు ఏర్పడి అధ్వానంగా తయారయ్యాయి. తాత్కాలికంగా వేసిన మట్టి, గ్రావెల్‌ రహదారులపై ఇంటి నిర్మాణ సామగ్రి వాహనాలు కూరుకుపోయి అవస్థలు ఎదుర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని