Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Oct 2022 09:09 IST

1. గులాబీకి కొత్త గుబాళింపు

తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్ర కొత్త మలుపు తిరగనుంది. ఆవిర్భవించిన 21 సంవత్సరాల తర్వాత జాతీయ పార్టీగా  రూపాంతరం చెందనుంది. పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం తెలంగాణ భవన్‌లో తెరాస స్థానంలో ఏర్పాటయ్యే కొత్త పార్టీ పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా ప్రకటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన పార్టీకి ఇది అత్యంత కీలక ఘట్టం. కేసీఆర్‌ నిర్ణయం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అభ్యర్థుల్లో అవతారాలు కొలువై

ఆ జగన్మాత మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించేందుకు తొమ్మిది అవతారాలు ఎత్తింది.. అలుపెరగని పోరాటం చేసి ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు విజయం సాధించడంతో విజయ దశమిగా వేడుక చేసుకుంటున్నాం. చెడుపై మంచి గెలవాలన్నా, అనుకున్న లక్ష్యం సాధించాలన్నా మనుషులూ అనేక అవతారాలు ఎత్తాల్సిందే. ప్రభుత్వం గ్రూప్స్‌, పోలీసు, ఇతర శాఖల్లో పోటీ పరీక్షలకు నోటిఫికేషన్‌ ఇవ్వడంతో అభ్యర్థులు రాత్రింబవళ్లు చదువుతున్నారు. గ్రూప్‌- 1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఈ నెల 16న జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కూతురికి పైలెట్‌ ఉద్యోగం.. సిబ్బంది విమానంలో తిరుమలకు

కూతురికి విమానం నడిపే పైలెట్‌ ఉద్యోగం రావడంతో   ఆనందంతో ఆ తండ్రి తన దగ్గర పని చేసే 15 మంది సిబ్బందిని విమానం ఎక్కించి తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనం చేయించారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన అజీజ్‌ హీరాణి మండల కేంద్రంలో కిరాణా దుకాణం నడిపిస్తున్నారు. కూతురు అఫీనా హీరాణి ఉన్నత చదువులు పైలెట్‌ శిక్షణ పొందారు. పైలెట్‌ శిక్షణలో రాణించడంతో ఇండిగో విమాన సర్వీసులో కొలువు సాధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భూమి అంతర్భాగంలో మహా సముద్రం!

భూమి పైపొర, దిగువ మ్యాంటిల్‌ మధ్యలోని సంధి ప్రాంతంలో పెద్దఎత్తున నీరు ఉన్నట్టు అంతర్జాతీయ అధ్యయనంలో బయటపడింది. భూమి ఉపరితలానికి 660 మీటర్ల లోతున ఏర్పడిన అరుదైన వజ్రాన్ని పరిశోధకులు విశ్లేషించి ఈ విషయాన్ని గుర్తించారు. భూమి లోపల ఫలకాలతో పాటు సముద్రపు నీరు ఉందని చాలాకాలంగా భావిస్తున్నారు. అయితే ఇది కేవలం సిద్ధాంతానికే పరిమితమైంది. తాజా అధ్యయనంలో ఇది నిర్ధరణ అయినట్టయ్యింది. భూమి పైపొర, దిగువ మ్యాంటిల్‌ మధ్యలోని సంధి ప్రాంతంలో రింగ్‌వుడైట్‌ అనే ఖనిజం అధికంగా ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆ సమయంలో స్టోర్‌రూమ్‌లో ఉండమంటున్నారు..!

మాది ప్రేమ వివాహం. కులాలు కూడా వేరు. నా భర్త తరఫు వారు మొదట మా ప్రేమను అంగీకరించలేదు. తను వారికి ఏకైక సంతానం కావడంతో తప్పక ఒప్పుకున్నారు. అయితే, మా అత్తగారు ఆచారాలు, సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తుంటారు. ముఖ్యంగా నెలసరి సమయంలో నరకం చూపిస్తున్నారు. ఆ సమయంలో స్టోర్‌రూమ్‌లో ఉండమంటున్నారు. భోజనం కూడా అక్కడే. ఎప్పుడైనా బయటకు వెళ్లి వస్తే.. రాగానే స్నానం చేయాలంటారు. ఇంటికి ఎవరైనా వస్తే నాతో ఇల్లంతా కడిగిస్తారు. వీటిని తట్టుకోలేక నా భర్తతో వేరు కాపురం పెడదామని చెప్పాను. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. దీపక్‌.. దీప్తిలా చేయబోయి..

భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ బౌలింగ్‌ చేయబోతూ ఆగి ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ చార్లీ డీన్‌ను రనౌట్‌ (మన్కడింగ్‌) చేసిన ఉదంతం తాలూకు వేడి ఇంకా చల్లారక ముందే భారత్‌-దక్షిణాఫ్రికా మూడో టీ20లో అలాంటి ఘటన కొద్దిలో తప్పింది. సఫారీ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్‌ బౌలింగ్‌ చేయడానికి వచ్చిన పేసర్‌ దీపక్‌ చాహర్‌..   నాన్‌స్ట్రైకర్‌ స్టబ్స్‌ను రనౌట్‌ చేయబోయి ఆగిపోయాడు. ఈ ఓవర్లో తొలి బంతి వేయబోతుండగా.. స్టబ్స్‌ క్రీజు దాటేశాడు. ఇది గమనించిన దీపక్‌ బౌలింగ్‌ ఆపేసి బంతితో వికెట్లను కొట్టబోయి ఆగాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. హుజూరాబాద్‌లో ఇదేం పంచాయితీ..?

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రతి నిత్యం ఏదో ఒక వివాదం అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా కొందరు నేతల అత్యుత్సాహం వల్ల పలువురు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇటీవల భూ తగాదాల్లో తలదూర్చే కొందరు సెటిల్‌మెంట్లతో హల్‌చల్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎక్కువగా భూ తగాదాల విషయంలో జోక్యం చేసుకుంటున్నారనేది ఇక్కడ బాహాటంగానే చర్చ జరుగుతోంది. ఓ ముఖ్య నేత సహకారంతో కొన్ని మండలాల్లోని నాయకులు రెచ్చిపోతున్నారని వినిపడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బస్సు ఛార్జీలు 2, 3 రెట్లెక్కువ

తరచూ ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ పోవడం వల్ల బస్సు ఛార్జీలు తడిసిమోపెడవుతున్నాయి. ఇవి సామాన్య, మధ్యతరగతికి ఆర్థిక భారంగా మారుతున్నాయి. తొలిసారి ఏప్రిల్‌లో ఛార్జీలు పెంచినప్పుడు పల్లెవెలుగు, సిటీ బస్సు ప్రయాణికులపై భారంపడింది. ఆ తర్వాత 3 నెలలకు దూర ప్రాంత సర్వీసులన్నింటికీ ఛార్జీలు పెంచారు. సూపర్‌ లగ్జరీల్లో గరిష్ఠంగా రూ.140 వరకు భారం మోపారు. ఏసీ సర్వీసుల్లోనూ దూరం పెరిగే కొద్దీ ఛార్జీలు పెరిగాయి. వీటితో పోలిస్తే రైలు ఛార్జీలు రెండు, మూడు రెట్లు తక్కువగా ఉంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘ఉచితాలు’ సరే.. నిధుల మాటేంటి?

ఉచితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీన్ని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. ఇందుకు వీలుగా రాజకీయపార్టీలు తాము చేసే వాగ్దానాల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తాయో స్పష్టంగా చెప్పేలా ఒక ప్రొఫార్మాను నిర్దేశిస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిలో సవరణలు ప్రతిపాదించాలని నిర్ణయించింది. దీనిపై అన్ని రాజకీయపార్టీలు ఈనెల 19వ తేదీలోపు తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది. ఒకవేళ స్పందించకపోతే ఇక చెప్పడానికి ఏమీలేదని రాజకీయపార్టీలు అనుకుంటున్నట్లు భావించాల్సి వస్తుందని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పెళ్లింట విషాదం.. రోడ్డు ప్రమాదంలో 25 మంది దుర్మరణం

ఉత్తరాఖండ్‌లోని పౌడీ జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. హరిద్వార్‌ జిల్లాలోని లాల్‌ఢాంగ్‌ నుంచి దాదాపు 50 మంది పెళ్లిబృందంతో వెళుతున్న బస్సు బీరోంఖాల్‌ వద్ద 300 మీటర్ల లోతున్న నాయర్‌ నది లోయలో పడింది. ఈ ఘటనలో 25 మంది మృతిచెందారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికుల సహకారంతో చేపట్టిన సహాయక చర్యలకు చీకటి కారణంగా ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రమాదస్థలిలో ఎటువంటి వెలుతురు లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సెల్‌ఫోన్ల ఫ్లాష్‌లైట్‌ వెలుగులో.. బస్సులో చిక్కుకుపోయినవారిని బయటకు తీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని