Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Oct 2022 09:07 IST

1. బీఆర్‌ఎస్‌ మొదటి కార్యక్షేత్రం మహారాష్ట్ర, కర్ణాటక: సీఎం కేసీఆర్‌

దేశాన్ని 75 ఏళ్లుగా ఏలిన పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్టు ప్రకటించిన అనంతరం పార్టీ శ్రేణులనుద్దేశించి కేసీఆర్‌ మాట్లాడుతూ.. దేశ ప్రజల ప్రయోజనాల కోసమే భారాస ఆవిర్భవిస్తోందని చెప్పారు. తెలంగాణ కోసం కష్టపడినట్లే దేశం కోసం పనిచేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్‌ అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర తమ మొదటి కార్యక్షేత్రాలని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రోజుకి ఎన్నిసార్లు బ్రష్‌ చేసుకోవాలి? ఎంతసేపు చేసుకోవాలి?

మనం రోజూ ఉదయం నిద్ర లేవగానే చేసే పని పళ్లు తోముకోవడం. దీని ద్వారా రోజంతా దంతాల్ని, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు.. బ్రషింగ్‌ వల్ల మనకు సంపూర్ణ ఆరోగ్యం కూడా సొంతమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం పళ్లు-చిగుళ్ల సమస్యలతో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్‌, డయాబెటిస్‌.. వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడక తప్పదంటున్నారు. అందుకే నోటి ఆరోగ్యమే సంపూర్ణ ఆరోగ్యమని చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. హైదరాబాద్‌ను కోల్పోయిన మనకు మళ్లీ ఆ పరిస్థితి రావొద్దు: కొడాలి నాని

రెక్కాడితే గాని, డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల కోసమే ముఖ్యమంత్రి జగన్‌  3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. 3 రాజధానులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కాంక్షిస్తూ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి ఉద్యమాన్ని దేవుళ్లు, ప్రజలు హర్షించరని  వ్యాఖ్యానించారు. కులాలు, పార్టీల కోసమో కాక, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేయకూడదనే  సీఎం జగన్‌ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ దేవాలయం అద్భుతం..కచ్చితంగా చూసొస్తా: ఆనంద్‌ మహీంద్రా

మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర విషయాలేమైనా తన దృష్టి వస్తే సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంటారు. తాజాగా దుబాయ్‌లోని ఓ అద్భుతమైన హిందూ దేవాలయాన్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు. మంగళవారమే దానిని ప్రారంభించారు. ఇండియన్‌, అరబిక్‌ నిర్మాణశైలి ఉట్టిపడేలా దీనిని తీర్చిదిద్దారు. ‘‘ఈ దేవాలయం అద్భుతంగా ఉంది.ఈసారి దుబాయ్‌ వెళ్లినప్పుడు కచ్చితంగా సందర్శిస్తాను. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బిల్వపత్రం..ఆరోగ్యదాయకం.. ఈ ప్రయోజనాలు తెలుసా?

బిల్వ (మారేడు) పత్రం ఎంతో మేలు చేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే గుణం ఈ బిల్వపత్రంలో ఉందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. ఆకులే కాదు.. కాండం, కాయలు, పూలు, వేర్లు కూడా ఆరోగ్యం బాగుండేందుకు సహకరిస్తాయి. వినాయకునికి చేసే పూజలో ఈ పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ చెట్టు ఔషధ గుణాలతో  ఉందని ఆయుర్వేద ఫిజిషియన్‌ పెద్ది రమాదేవి వివరించారు. మారేడులో మినరల్స్‌, విటమిన్లు అధికంగా ఉంటాయి. కెరోటిన్‌, విటమిన్‌ బి, సి, కాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌ సమృద్ధిగా లభిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మునుగోడు బరిలో ప్రజాగాయకుడు గద్దర్‌

ప్రజాగాయకుడు గద్దర్‌ తొలిసారి ఎన్నికల్లో  పోటీచేయబోతున్నారు. త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతిపార్టీ తరఫున ఆయన బరిలోదిగనున్నారు. ఈమేరకు ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత కేఏ పాల్‌ ప్రకటించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్టు గద్దర్‌ తెలిపారు. ప్రపంచశాంతి కోసం కృషి చేస్తున్న పాల్‌తో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘రామ్‌లీలా’లో దసరా వేడుకలు.. రావణ దహనం చేసిన ప్రభాస్‌

దేశ రాజధాని నగరం దిల్లీలో దసరా వేడుకల్లో ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌ సందడి చేశారు. ఎర్రకోట వద్ద రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఆదిపురుష్‌’ని చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. మరోవైపు, దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ముగింపు ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య కోలాహలంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు దుర్గామాత వివిధ అలంకారాల్లో భక్తులనుంచి విశేష పూజలందుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల టూరిస్ట్‌ బస్సు.. కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. పాలక్కాడ్‌ జిల్లా వడక్కంచేరి వద్ద బుధవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. టూరిస్ట్‌ బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులు, ఆర్టీసీ బస్సులోని ముగ్గురు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం 36 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నా లక్ష్యం మాత్రం వచ్చే ఏడాది ప్రపంచకప్‌: తాత్కాలిక కెప్టెన్‌ ధావన్‌

సఫారీలతో మూడు వన్డేల సిరీస్‌ కోసం శిఖర్ ధావన్‌ నాయకత్వంలోని టీమ్‌ఇండియా సన్నద్ధమైంది. ఇప్పటికే శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే జట్లతో వన్డే సిరీస్‌లను ధావన్‌ నేతృత్వంలో కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే. తాజాగా గురువారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. గత రెండేళ్ల నుంచి వన్డే ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తున్న బ్యాటర్ శిఖర్ ధావన్‌ కావడం విశేషం. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌ కోసం ఫిట్‌గా తయారు కావడంపైనే దృష్టిసారించినట్లు ధావన్‌ వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దేవరగట్టు కర్రల సమరంలో 50మందికి గాయాలు

ఏపీలోని కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టులో ఏటా నిర్వహించే కర్రల సమరంలో భాగంగా 50మంది గాయాలపాలయ్యారు. ఏటా దసరా రోజున శ్రీమాళ మల్లేశ్వర స్వామికి నిర్వహించే వేడుకలలో భాగంగా జరిగే ఈ కర్రల సమరం ఈ ఏడాది వర్షం కారణంగా కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ ఏడాది నిర్వహించిన కర్రల సమరంలో 50మంది భక్తులు గాయాలపాలయ్యారు. అంతేకాకుండా ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని