Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Nov 2022 09:11 IST

1. వడ్డీ 8 శాతం మించేలా..

ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు ఆర్‌బీఐ రెపో రేటును పెంచింది. ఫలితంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అనేక బ్యాంకులు ఇప్పుడు 7 శాతానికి మించే వార్షిక వడ్డీని ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు 8 శాతాన్నీ దాటాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీలను ఎంచుకునే వారు ఏం చేయాలో చూద్దాం.ధిక రాబడి ఆశించేవారు.. అధిక నష్టభయానికి సిద్ధంగా ఉండాలి. హామీతో కూడిన రాబడిని అందించే వాటిలో ఎఫ్‌డీలు ముందుంటాయి. కొన్ని బ్యాంకులు అత్యంత సురక్షితం అనే భావన ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కివీస్‌‌తో తొలి వన్డే.. ఓపెనర్లు ఔట్‌.. 

ఎంతో ఓపికగా ఆడిన ఓపెనర్లు శిఖర్ ధావన్ (72), శుభ్‌మన్‌ గిల్ (50) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. తొలి వికెట్‌కు 124 పరుగులను జోడించిన వీరిద్దరూ వరస ఓవర్లలో ఔటయ్యారు. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో (23.1వ ఓవర్) షాట్‌ కొట్టిన గిల్ బౌండరీ లైన్‌ వద్ద కాన్వే చేతికి చిక్కాడు. అలాగే సౌథీ వేసిన బంతిని (24.3వ ఓవర్‌) ఆడే క్రమంలో ధావన్‌ ఆన్‌సైడ్‌ హెన్రీకి దొరికిపోయాడు. ప్రస్తుతం 27 ఓవర్లు ముగిసేసరికి టీమ్‌ఇండియా స్కోరు 140/2. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మెట్రో మార్గం పైనుంచి తొలి పైవంతెన..

హైదరాబాద్‌లో మూడు మార్గాల్లో ప్రయాణికులకు సేవలు అందిస్తున్న మెట్రో రైళ్లు.. పంజాగుట్ట, నల్గొండ క్రాస్‌ రోడ్ల వద్ద పైవంతెనల పైనుంచి వెళుతూ కనువిందు చేస్తాయి. త్వరలో మెట్రో రైలు మార్గం పైనుంచి సైతం వాహనాలపై దూసుకెళ్లవచ్చు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద నిర్మిస్తున్న పై వంతెనతో ఇది సాధ్యం కానుంది. వీఎస్‌టీ- ఇందిరా పార్కు పైవంతెనను ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద మెట్రో రైలు మార్గంపై నుంచి వెళ్లేలా నిర్మాణం చేపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇది మనందరి ఖర్మ!.. వైకాపా ప్రజాప్రతినిధుల ఆవేదన

‘గ్రామాల్లో రోడ్లు, కాలువలు నిర్మించుకుందామన్నా నిధులు లేవు. గతంలో తీర్మానించిన పనులకూ అతీగతీ లేదు. ఇలాగైతే ఈ సమావేశాలకు విలువ ఎలా ఉంటుంది? ఇది అందరు సర్పంచులు అనుభవిస్తున్న ఖర్మ.. దీనిపై తీర్మానించి అందరూ సంతకాలు పెడితే పైకి పంపిద్దాం’ అని వైకాపాకు చెందిన జడ్పీటీసీ సభ్యుడు కాయల రమణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండల సర్వసభ్య సమావేశం గురువారం ఎంపీపీ మీసాల సత్యవతి అధ్యక్షతన జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. యాపిల్‌కు సెకనుకు రూ.1.5 లక్షల లాభం

ఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌ సెకనుకు రూ.1.48 లక్షల లాభాన్ని (1,820 డాలర్లు) ఆర్జిస్తోందట. అంటే రోజుకు సంస్థ ఆర్జన సుమారు రూ.1,282 కోట్లు (157 మిలియన్‌ డాలర్లు). దీంతో ప్రపంచంలోనే అత్యధిక లాభదాయకత సంస్థల్లో యాపిల్‌దే మొదటి స్థానమని ఓ పరిశోధనా నివేదిక వెల్లడించింది. అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న టిపాల్టీ ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం.. మైక్రోసాఫ్ట్‌, ఆల్ఫాబెట్‌ (గూగుల్‌ మాతృసంస్థ), బెర్క్‌షైర్‌ హాథ్‌వే (వారెన్‌ బఫెట్‌ సంస్థ) కూడా సెకనుకు 1000 డాలర్లకు పైగానే ఆర్జిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. గుట్టకాయ స్వాహా

కొండలు, గుట్టలు, వాగులు, వంకలు.. ఏవైనా కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. తొలుత కొండలు, గుట్టల్లో మట్టిని తరలించి, ఆపై చదును చేసి పక్కా ప్రణాళికతో ఆక్రమించుకుంటున్నారు. ఏదో ఒక వంక పెట్టేసి సాగులో ఉన్నట్లు చూపి, డి.పట్టాల కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేస్తున్నారు. వైకాపా ముఖ్య నాయకుల అండతోనే ఇదంతా చేస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. అధికారంలో ఆధిపత్య పోరు

అధికార పార్టీలో ఆధిపత్య పోరు రగులుతోంది. నియోజకవర్గాల్లో పెత్తనం కోసం ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. తాజాగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని కర్నూలు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం ఆధిపత్య పోరే కారణమని తెలుస్తోంది. ఇసుక, మద్యం, భూ దందాలు, పదవులు.. ఇలా ప్రతిదాంట్లో ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. కర్నూలు, నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో ఇద్దరేసి నాయకులుండటం.. వారి మధ్య సఖ్యత కుదరడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జోరుగా బేరాలు.. పట్టాల అమ్మకాలు

నిరుపేదల సొంతింటి కల సాకారానికి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా లేఅవుట్లలో ఈ అమ్మకాల వ్యవహారం చాప కింద నీరులా జరుగుతోంది. ఒప్పందాలతో విక్రయాలు సాగిపోతున్నాయి. ఈ వ్యవహారం రాజకీయ నాయకుల అండతో స్థిరాస్తి వ్యాపారులే చేస్తున్నట్లు తెలుస్తోంది. కైకలూరులోని జగనన్న గ్రీన్‌ విలేజ్‌లో చాలా స్థలాలు ఇప్పటికే అమ్మకాలు జరిగిపోయాయి. అదే ప్రాంతానికి చెందిన ఓ మట్టివ్యాపారి ఒక్కో పట్టా రూ.2 లక్షల చొప్పున ఏకంగా ఆరు   కొనుగోలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నిర్మాణం మొదలెడుతున్నారా..గద్దలొచ్చేస్తాయ్‌!

కొత్తగా ఎవరైనా భవన నిర్మాణం చేపడితే చాలు.. వెంటనే వచ్చేస్తారు. అనుమతిఉంటే ఒక రేటు.. లేకపోతే మరో రేటు.. అంతస్తుల సంఖ్యబట్టి వసూలు మొత్తం మారుతుంది. నగర శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొందరు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు నిర్మాణదారులను జలగల్లా పీడిస్తున్నారు. వీరితీరుతో యజమానులు  హడలెత్తిపోతున్నారు. తాజాగా మణికొండలో ఓ నిర్మాణదారును  డబ్బులు డిమాండ్‌ చేసిన ఘటనలో కౌన్సిలర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎవరి వెలుగులకీ విద్యుత్‌ బస్సులు?

ఆర్టీసీలో కొత్తగా 4 వేల విద్యుత్‌ ఏసీ బస్సులు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాలం చెల్లిన వాటి స్థానంలో కొత్తగా అవసరమైన బస్సులన్నింటినీ విద్యుత్‌ బస్సులే తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాత బస్సుల స్థానంలో తక్షణమే కొత్తవి అవసరమని ప్రభుత్వానికి ఆర్టీసీ కొంతకాలం కిందట తెలిపింది. దీనిపై ఇటీవల సీఎం వద్ద సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ని బస్సులు అవసరమన్నది చర్చకు రాగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts