Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Nov 2022 09:11 IST

1. బిల్లులు ఆపింది వివరాల కోసమే

 భాజపా అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్లు అక్కడి ప్రభుత్వాలకు తోడ్పాటుగా ఉండాలని అనుకుంటున్నారని గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలకు పోటీగా వ్యవహరించాలని భావించడంలేదని అన్నారు. తమిళనాట కోయంబత్తూరులోని ఓ కళాశాల స్నాతకోత్సవంలో ఆమె సోమవారం పాలొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో భిన్నంగా ఉన్నది ప్రభుత్వమేనని, గవర్నర్‌ కాదని ఆమె పేర్కొన్నారు. వివరాలు కోరుతూ తన వద్ద కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఆలస్యం చేయాలని అనుకోలేదని ఆమె చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జనవరి 18న నూతన సచివాలయ ప్రారంభోత్సవం!

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి వచ్చే జనవరి 18న ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఆరోజున 6వ అంతస్తులోని సీఎం బ్లాకును ప్రారంభించి.. తన ఛాంబర్లో కేసీఆర్‌ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆ రోజు నుంచి అక్కడే ప్రభుత్వ కార్యకలాపాలు సాగనున్నాయి. ఈ గడువులోగా పనులన్నీ పూర్తిచేసి సర్వాంగసుందరంగా సచివాలయాన్ని సిద్ధం చేయాలని ఆయన అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను సోమవారం ఆదేశించారని తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇంకా ఇసుకలోనే యంత్రాలు!

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్‌ సమీపంలోని మానేరు వరద నష్టం తాలూకు ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో కురిసిన భారీ వర్షాలతో మానేరు ఉప్పొంగింది. అంతకుముందు ఓడేడ్‌ నుంచి భూపాలపల్లి జిల్లా గరిమిళ్లపల్లి వరకు నిర్మిస్తున్న వంతెన పనుల కోసం భారీ యంత్రాలను ఇక్కడికి తీసుకొచ్చారు. పనులు చేసే క్రమంలో యంత్రాలు మానేరులోనే ఉన్నాయి. వర్షాలు అధికంగా కురవడంతో వరద ఉద్ధృతికి యంత్రాలు, వంతెనకు సంబంధించిన దిమ్మెలు కొట్టుకుపోయి ఇసుక మేటల్లో కూరుకుపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జగనన్న.. ఇసుకలేదన్న

ఇసుక డిపోల్లో నిల్వలు నిండుకున్నాయి. జగనన్న కాలనీ లబ్ధిదారులు, వినియోగదారులకు అరకొర అందిస్తున్నారు. సింహభాగం గుత్తేదారు సరిహద్దులు దాటించి జేబులు నింపుకొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇసుక రీచ్‌ల బాధ్యతలు ఉపగుత్తేదారుగా అధికార పార్టీ నేతలు దక్కించుకున్నారు. పల్‌దొడ్డి, ముడుమాల, ఈర్లదిన్నె, కె.సింగవరం, కౌతాళం పరిధిలో నదిచాగి, గుడికంబాల పరిధిలో డ్రెడ్జింగ్‌ విధానంలో ఇసుక తీసి రీచ్‌ల వద్దకు చేరవేస్తున్నారు. అక్కడి నుంచి నిల్వ కేంద్రాలకు తరలించాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. హెచ్‌సీఏలో పే అండ్‌ ప్లే.. అజహర్‌పై శివలాల్‌, అర్షద్‌, వినోద్‌ నిప్పులు

మహ్మద్‌ అజహరుద్దీన్‌ పాలనలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) పే అండ్‌ ప్లేగా మారిపోయిందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్‌యాదవ్‌.. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు అర్షద్‌ అయూబ్‌, జి.వినోద్‌ ఆరోపించారు. ఆటగాళ్ల నుంచి ఒక్కో మ్యాచ్‌కు రూ.15 లక్షలు లంచం తీసుకుంటున్నాడని విమర్శించారు. సెప్టెంబరు 26న అజహర్‌ పదవీకాలం ముగిసినా కుర్చీ వదలడం లేదని సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో శివలాల్‌, అర్షద్‌, వినోద్‌.. హెచ్‌సీఏ మాజీ కార్యదర్శులు శేష్‌నారాయణ, జాన్‌ మనోజ్‌ ఆగ్రహం వ్యక్తంజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నౌకాదళంలో 1500 మంది అగ్నివీరులకు ఆహ్వానం!

ఇండియన్‌ నేవీ అగ్నివీర్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో 1400 పోస్టులకు పోటీ పడవచ్చు. అలాగే అగ్నివీర్‌ (ఎంఆర్‌) 100 పోస్టులకు మరో ప్రకటన వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులు వీటికి అర్హులు. ఈ రెండు పోస్టులకూ మహిళలూ దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు దశల్లో నిర్వహించే పరీక్షలు, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టులతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇలా అవకాశం వచ్చినవారు శిక్షణతో కలిపి నాలుగేళ్లు సేవలు అందించవచ్చు. అనంతరం వీరిలో 25 శాతం మందిని శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమ్మా.. నాన్న క్షమించండి

జీవింతాంతం రక్షణగా ఉండాల్సిన వాడే ఆమె పాలిట భక్షకుడయ్యాడు. 15 ఏళ్లుగా సాగుతున్న పచ్చని సంసారాన్ని అనుమాన భూతం చిదిమేసింది. హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భర్త వేధించడంతో ఆమె బతుకలేనని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులకు భారం కావొద్దనుకుంది. అమ్నానాన్న.. పిల్లలను క్షమించమని కోరుతూ.. తన ఆత్మహత్యకు పాల్పడటానికి కారణాలను లేఖలో వివరించింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని నాగార్జున కాలనీలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. యముండ.. ఇళ్లపై తీగలుండా

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇళ్లపై నుంచి కరెంటు తీగలు వెళ్లడం, స్తంభాలు ఒరిగిపోవడం, కండెక్టర్లు దెబ్బతినడం, తీగలు సాగిపోయి కిందకు వేలాడే పరిస్థితిలో ఉంటూ ప్రమాదాలకు హేతువులుగా మారుతున్నాయి. 15 రోజులుగా తూర్పు విద్యుత్తు పంపిణీ సంస్థ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం, కాకినాడ, జగ్గంపేట, రామచంద్రపురం, రాజమహేంద్రవరం, రంపచోడవరం డివిజన్లలో 33కేవీ, 11 కేవీ ఫీడర్లు, ఎల్‌టీ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల భౌతిక పరిస్థితిపై సర్వే నిర్వహించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పడిన ఇబ్బందులు చాలు.. వైకాపా ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డికి గ్రామస్థుడి ఝలక్‌

నెల్లూరు జిల్లా కందుకూరు మండలం ఓగూరులో స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం గ్రామంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’లో ఎమ్మెల్యేతో కలసి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై గ్రామస్థుడు పి.రఘు ఎమ్మెల్యే ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ‘పథకం సరిగా వస్తే సరే.. లేదంటే అవసరం లేదు’ అంటూ తన ఇంటి గేటు వేసుకున్నారు. ‘నీకు ప్రభుత్వ పథకాలు అవసరం లేదా?’ అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఈ.. వైద్యమేంటో

ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ పేరుతో ఈ-ఆసుపత్రి పథకం కర్నూలు సర్వజన వైద్యశాలలో శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం ఓపీకి భారీగా రోగులు తరలిరావడం.. ఓపీ చీటీ కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి రావడంతో చాలామంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి రోగులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలో మూడు కౌంటర్ల నుంచి ఏడుకు పెంచారు. అయినా ఇవి ఏమాత్రం సరిపోలేదు. చాలామంది మధ్యాహ్నం 2 గంటల వరకు వేచి చూసినా ఓపీ చీటీ అందకపోవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని