Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Dec 2022 09:05 IST

1. ప్రశ్నిస్తే పథకాలు పోయినట్లే..!

‘కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడం.. పారదర్శకంగా పాలన అందిస్తాం’ అంటూ.. సభలు, సమావేశాల్లో ముఖ్యమంత్రి మొదలుకొని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకుల వరకు చెప్పేమాటలివి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. ఉమ్మడి అనంత జిల్లాలో వైకాపా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తిన వారిపై పగ పడుతున్నారు. పశ్నించినవారి పథకాలు తొలగిస్తున్నారు. అభివృద్ధిపై నిలదీస్తే కక్ష సాధింపులకు దిగుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జగనన్న క్రీడల్లో డిష్యుం.. డిష్యుం

గుడివాడ ఎన్టీఆర్‌ స్టేడియంలో ప్రారంభమైన జగనన్న క్రీడా సంబరాలు వివాదాస్పదమయ్యాయి. శనివారం ఉదయం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కొడాలి నాని పోటీలు ప్రారంభించారు. సాయంత్రం జరిగిన కబడ్డీ సెమీ పోటీల్లో గుడివాడ, అవనిగడ్డ జట్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. క్రీడాకారులు రిఫరీపై గొడవకు దిగడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. గుడివాడ, అవనిగడ్డ జట్ల మధ్య సెమీ ఫైనల్స్‌ సాయంత్రం హోరాహోరిగా సాగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సర్కారుకు సర్పంచుల షాక్!

వైయస్‌ఆర్‌ జిల్లాలో ఎన్నికలు జరిగిన గ్రామపంచాయతీలు 553, అన్నమయ్యలో 473 ఉన్నాయి. వీటికి టైడ్‌, అన్‌టైడ్‌ కింద ఆర్థిక సంఘం నిధులొచ్చాయి. వీటి నుంచి బలవంతంగా విద్యుత్తు బిల్లులు చెల్లించడానికి అధికారులు సర్పంచులపై ఒత్తిడి తీసుకొచ్చారు. కొందరు కొంత మేర చెల్లించగా, మరికొందరు పూర్తిగా చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల తిరుపతిలో సర్పంచులు ఆందోళన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అన్నం... పచ్చడి... రూ.20

పచ్చడితో అన్నం పెట్టి,   ఆయాతో కర్రీ తెప్పించుకోమని ₹20 పాఠశాలలకు వెళ్లే పిల్లలకు ఇవ్వడం ఇప్పుడు చాలా ఇళ్లల్లో కనిపిస్తోంది. యూకేజీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు పాఠశాలలకు తెచ్చుకుంటున్న లంచ్‌ బాక్సులను పరిశీలిస్తే దాదాపు 30 శాతం ఇలానే ఉంటున్నాయి. విద్యార్థులు తరచూ అనారోగ్యాలకు గురవుతూ బడులకు డుమ్మా కొడుతున్నారు. మధ్యాహ్న భోజన బెల్‌ కొట్టటానికి ముందు ప్రతి తరగతికి ఆయాలు వెళ్లి ఎవరికి ఏం కూరలు తేవాలో అడిగి పట్టిక తెచ్చుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నచ్చిన కారు.. మెచ్చిన ధర

రెండేళ్లుగా కార్ల కొనుగోళ్లు పెరిగాయి. అన్ని ఫీచర్లు ఉన్న హై ఎండ్‌ మోడళ్లు కావాలంటే ప్రీమియం ధర చెల్లించాల్సి వస్తోంది. కేవలం అదనపు ఫీచర్ల కోసం నాలుగైదు లక్షలు అదనంగా చెల్లించడం ఇష్టం లేనివారు, భరించలేనివారు బేస్‌, మిడ్‌ రేంజ్‌ మోడల్స్‌ కొనుగోలు చేసి షోరూంలోనే ఇంటీరియర్స్‌ చేయించుకుంటున్నారు. తక్కువ ఖర్చులో కోరుకున్న ఫీచర్లను జత చేసుకుంటున్నారు. ప్రతి ఆటోమొబైల్‌ కంపెనీ ఒక్కో కారు మోడల్‌లో పది వరకు వేరియెంట్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సారూ.. హామీలు నెరవేర్చరూ..!

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం ఇక్కడ జరిగే బహిరంగ సభపై అందరిలో ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి పలు హామీలను గుప్పించారు. ఇప్పటికీ చాలా హామీలు అలానే మిగిలిపోయాయి. ప్రధానంగా ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. రెండు పడక గదుల ఇళ్లపై లబ్ధిదారుల్లో అనిశ్చితి నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మరో ఇద్దరు సలహాదారులు

వ్యవసాయ రంగంలో ఇటీవలి వరకు ఒక్కరే సలహాదారు ఉండేవారు. ఇప్పుడు ఇద్దరయ్యారు. వ్యవసాయశాఖకు తిరుపాల్‌రెడ్డిని, ఉద్యానశాఖకు శివప్రసాద్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. వారిద్దరికీ ఆ రంగంలో ఏమైనా అనుభవం ఉందా.. ఆదర్శ రైతులా అంటే అలాంటి చరిత్రా లేదు. వైకాపా నాయకులు కావడమే వారి అర్హత. కొత్తగా నియమితులైన ఇద్దరూ వైయస్‌ఆర్‌ జిల్లా వారే. ముఖ్యమంత్రి జగన్‌కు దగ్గరి బంధువు కావడమే ఒకరికి అదనపు అర్హత. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక వ్యవసాయశాఖకు సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డి ఉండేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అంతా తానై... ఒంటిచేత్తో గుజరాత్‌ బాధ్యత ఎత్తుకున్న మోదీ

అసెంబ్లీ ఎన్నికలంటే ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్రస్థాయి నేతలు ప్రధానం! భాజపా, కాంగ్రెస్‌లాంటి పార్టీల తరఫునైతే జాతీయ స్థాయి ముఖ్యనేతలు ఒకట్రెండు ప్రచార సభల్లో పాల్గొని వెళతారు. కానీ గుజరాత్‌ ఎన్నికల ప్రచారం ఇందుకు పూర్తి భిన్నంగా సాగింది! ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అంతా తానై కలియదిరిగారు. ఎంతగా అంటే తానే ముఖ్యమంత్రి అభ్యర్థా అన్నంతగా! స్వరాష్ట్రంలో భాజపా అధికారాన్ని భారీ మెజార్టీతో నిలబెట్టే బాధ్యతను ప్రధాని నరేంద్రమోదీ ఒంటిచేత్తో తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గుండుపై బంతి రుద్ది!

బంతికి మెరుపు తెప్పించాలంటే ఇది వరకు లాలాజలాన్ని ఉపయోగించేవాళ్లు. ఇప్పుడు దానిపై నిషేధం ఉండడంతో చెమటను వాడుతున్నారు. కానీ పాక్‌తో తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ రూట్‌ సరదాగా ఓ ప్రయోగం చేశాడు. రాబిన్సన్‌ బౌలింగ్‌ చేసే సమయంలో రివర్స్‌ స్వింగ్‌కు బంతి సహకరించేందుకు స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ తలపై టోపీని తీసి నున్నని అతడి గుండుపై బంతి రుద్దాడు. దీంతో వ్యాఖ్యాతగా ఉన్న ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాసర్‌ హుస్సేన్‌కు నవ్వాగలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. గోల్డ్‌ ఏటీఎం.. ఎప్పుడంటే అప్పుడే బంగారం డ్రా చేసుకోవచ్చు..

దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను శనివారం హైదరాబాద్‌ బేగంపేటలో ప్రారంభించారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో కావాల్సిన బంగారాన్ని ఇందులో డ్రా చేసుకోవచ్చు. అశోక్‌ రఘుపతి ఛాంబర్స్‌లోని గోల్డ్‌ సిక్కా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి గోల్డ్‌ ఏటీఎం ఒక ఉదాహరణని ఆమె అభివర్ణించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని