Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Dec 2022 09:25 IST

1. ఐఐటీల్లో జాబ్‌ జోష్‌.. రూ.కోట్లలో వేతన ప్యాకేజీ

ఐఐటీల్లో ఈ నెల ఒకటో తేదీ నుంచి మొదలైన ప్రాంగణ నియామకాలు సరికొత్త రికార్డును స్పష్టిస్తున్నాయి. కొలువుల ఆఫర్లు పెరగడమే కాక వార్షిక వేతనం రూ.కోటి, ఆపై అందుకుంటున్న వారి సంఖ్యా గత ఏడాదితో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటున్నట్లు ఐఐటీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఆగస్టు నుంచే ప్లేస్‌మెంట్ల ప్రక్రియ మొదలవుతుంది. ఐఐటీల్లో మాత్రం అది డిసెంబరు నుంచి ఆరంభమవుతుంది. డిసెంబరు 1న పలు ఐఐటీల్లో ఆ ప్రక్రియ మొదలైంది. మొదటి విడత కింద ఈనెల 15 వరకు ఎంపికలు కొనసాగుతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రుణ విషవలయంలో ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ రుణ విషవలయంలో చిక్కుకుంది. అప్పు తీసుకోనిదే రోజు గడిచే పరిస్థితి లేదు. దాన్ని తీర్చాలన్నా.. వడ్డీ కట్టాలన్నా ఎక్కడో అక్కడ దేహీ అనాల్సిందే. అధిక వడ్డీలకు మళ్లీ మళ్లీ రుణం పుట్టించాల్సిందే. మరో వైపు ఆశించినంత స్థాయిలో రాష్ట్రానికి ఆదాయాలు పెరగడం లేదు. పన్నుల రాబడి అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్రంలో ఆదాయాలు పెంచుకునేందుకు ప్రభుత్వం దీర్ఘ దృష్టితో కృషి చేస్తున్న కార్యక్రమాలు లేవు. కొత్త పరిశ్రమలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పరీక్ష ఇలా.. చదవండి బాగా!

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. నాలుగేళ్ల తర్వాత నియామక నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి మొత్తం 4 దశల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి తొలుత ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్‌) నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం: 200 మార్కులకు 200 బహుళైఛ్చిక (ఆబ్జెక్టివ్‌) ప్రశ్నలుంటాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అటు ఈడీ... ఇటు సీఐడీ

ప్రకాశంలో రాజకీయ పరిస్థితులు రసవత్తరంగా మారాయి. ఒకవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), మరోవైపు నేర పరిశోధన విభాగం(సీఐడీ) జిల్లాపై దృష్టి సారించాయి. దేశ రాజధాని దిల్లీ మద్యం కేసులో భాగస్వామ్యం/అనుమానం ఉన్నట్టు తెలుపుతూ అమిత్‌ అరోడా అనే నిందితుడిని ఈడీ అక్కడి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌ రిపోర్ట్‌ సమర్పించింది. అందులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా చేరింది. తాజాగా జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంటున్న భూకుంభకోణంపై సీఐడీ దృష్టి పెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇంకా అంతుచిక్కలేదు!

2020 డిసెంబరు 5.. ఏలూరు నగర వాసులు ఎప్పటిలాగే దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఇంతలో ఒక్కసారిగా కలవరం. ఉన్నట్టుండి కిందపడిపోతున్నారంట.. కాళ్లూ చేతులూ కొట్టుకుంటున్నారంట.. నోటి వెంట నురగలు వస్తున్నాయంట.. ఎవరి నోటి వెంట విన్నా ఇవే మాటలు. మొదటి విడత కరోనా కోరల్లో చిక్కుకుని అప్పుడప్పుడే కోలుకుంటున్న నగర ప్రజలకిది మళ్లీ అశనిపాతం. మొదట తూర్పువీధిలో ఇద్దరు ముగ్గురు పడిపోయారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఓ పావురమా.. రోగాలు ఆపడం మా తరమా

పావురాలకు తరచూ మేత వేస్తూ.. అక్కడే సెల్ఫీలు దిగుతూ గంటల తరబడి గడిపేస్తున్నారా? అయితే మీరు ప్రమాదం అంచున ఉన్నట్లే. పావురాల కోసం ఇంట్లో గూడుకట్టి వాటిని చూస్తూ మురిసిపోతున్నారా.. ఇది కూడా ప్రమాదమే. అవి నివాసం ఉన్న చోట భారీ ఎత్తున రెట్టలు వేయడం.. వాటి ఈకలు రాల్చడం చేస్తుంటాయి. పక్షులపై ఉన్న ప్రేమ.. భూత దయతో చాలామంది వాటిని శుభ్రం చేస్తుంటారు. కొందరైతే బాల్కనీలో వాటి కోసం ప్రత్యేకంగా గూడు ఏర్పాటు చేసి మేత పెట్టి అక్కడ గుడ్లు, పిల్లలు పెట్టేలా జాగ్రత్తలు తీసుకుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తేల్చుడులేదు.. నాన్చుడే!

‘‘కనిపించే మూడు సింహాలు.. చట్టానికి.. న్యాయానికి.. ధర్మానికి ప్రతిరూపాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా.. పోలీస్‌’’ ..ప్రజాహితాన్ని కాంక్షించి.. నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ.. అక్రమాలు అరికట్టి.. శాంతిభద్రతలు కాపాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అన్యాయాన్ని ప్రతిఘటించే ప్రతి పోలీసుకూ ఈ వ్యాఖ్యలు సరిపోతాయి.. కానీ కాస్తోకూస్తో నిజాయతీగా పని చేద్దామనుకుని బాధ్యతలు చేపట్టిన వారి ముందరి కాళ్లకు రాజకీయ ఒత్తిళ్లతో బంధం వేస్తూ విచారణను నీరుగారుస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పంపిణీ ఉన్నట్టా.. లేన్నట్టా?

‘ఈ నెల 21న సీఎం పుట్టిన రోజు సందర్భంగా గుడివాడలో టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ప్రారంభిస్తారు. బహిరంగ సభకు అక్కడే ఏర్పాట్లు చేయాలి. పక్కనే ఉన్న వరి పొలంలో రెండో పంట సాగు చేయవద్దు..! సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోండి..!’ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు(నాని) గత నెలలో చెప్పిన మాటలు..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బడి బంద్‌.. పరీక్ష రద్దు.. నేడు సీమ గర్జన

పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఒత్తిడి చేశారు. బడి బస్సులను అధీనంలోకి తీసుకున్నారు. పరీక్షలు వాయిదా వేయించారు. ఉదయం 6 నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలంటూ పోలీసులు ప్రకటించారు. దుకాణాలు మూసి వేసి సభకు రావాలని వ్యాపారులకు సూచించారు. సోమవారం జరిగే స్పందన రద్దు అంటూ అధికారులు ప్రకటించారు. ప్రతి సంఘానికి ఇద్దరు చొప్పున సభకు రావాలని డ్వాక్రా సంఘాల లీడర్లకు ఆదేశాలు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎంత కష్టమో జేఈఈ అడ్వాన్స్‌డ్‌!

ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించడమే కాదు.. ఒక్కో సబ్జెక్టులో 120 మార్కులకు 20 దక్కించుకోవడమూ గగనంగా మారింది. ఆ మాత్రం పొందేవారు కూడా మొత్తం విద్యార్థుల్లో అతి స్వల్పంగా ఉంటున్నారు. గణితంలో వారు కేవలం 1200 మందే ఉన్నట్లు స్పష్టమైంది. తాజాగా ఐఐటీ బాంబే జేఈఈ అడ్వాన్స్‌డ్‌, జోసా కౌన్సెలింగ్‌పై సమగ్ర నివేదికను విడుదల చేసింది. గత ఆగస్టు 28న పరీక్ష జరపగా.. జోసా కౌన్సెలింగ్‌ అక్టోబరు 17కి ముగిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని