Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Jan 2023 09:14 IST

1. పరిహారం ఒకటే.. బటన్‌ నొక్కుడు రెండుసార్లు

ఉచిత పంటల బీమా కింద రైతులకు ముఖ్యమంత్రి జగన్‌ గతేడాది జూన్‌లో పరిహారం విడుదల చేశారు. అయినా కొందరు రైతులకు సొమ్ము జమ కాలేదు. ఆరు నెలల తర్వాత డిసెంబరులో సీఎం మరోసారి బటన్‌ నొక్కారు. నెల గడిచినా రైతుల ఖాతాల్లోకి డబ్బు రాలేదు. రూ.187 కోట్ల మొత్తానికి ఇన్నిసార్లు బటన్‌ నొక్కాలా అనే ప్రశ్న రైతుల నుంచి వ్యక్తమవుతోంది. వ్యవసాయాధికారుల్ని సంప్రదించినా త్వరలో వస్తాయనే సమాధానం తప్పితే.. పరిహారం జమ చేయడం లేదు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇసుక కోసం.. నదిలోనే అడ్డంగా దారి

ఇసుక తరలించడానికి ఏకంగా నదిలోనే రోడ్డు వేసుకుంటున్నారు. ప్రవాహం కొనసాగుతున్నా అడ్డంగా పైపులు ఏర్పాటు చేసి మట్టి పోస్తున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా చెన్నూరు, ఖాజీపేట మండలాల పరిధిలోని పెన్నానది మధ్యలో ఇసుక మేటలు ఉన్నాయి. అక్కడికి వాహనాలు వెళ్లడానికి వీలుగా గుత్తేదారులు ప్రత్యేకంగా రోడ్డు వేసుకుంటున్నారు. వంతెనల సమీపంలో తవ్వకాలు జరపకూడదు. కర్నూలు-కడప జాతీయ రహదారి పక్కన నిర్మించిన ప్రధాన వంతెన పక్కనున్న మట్టిని తరలిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రెండు ప్రధాన వంతెనలు వరద తాకిడికి కొట్టుకుపోయాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కిట్టు చూడు.. కిట్టందం చూడు!

విద్యా కానుక కిట్లు అంటే నెలా, రెండు నెలలకే చిరిగిపోతున్న బ్యాగులు, బూట్లు.. అలాంటి వాటి కొనుగోళ్లలోనూ ఎన్ని సిత్రాలో! గత ఏడాది మిగిలి పోయిన వాటిని తర్వాతి ఏడాది వినియోగించుకుంటామని ప్రకటించిన సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) వచ్చే ఏడాదికి కొనే వాటిలో ఆ మేరకు ఎందుకు తగ్గించలేదో స్పష్టత ఇవ్వలేదు. గత రెండేళ్లల్లో 8.50 లక్షల కిట్లు మిగిలినా వచ్చే విద్యా సంవత్సరానికి అదనంగా 5 శాతం ఎందుకు కొంటున్నారు? ఎస్‌ఎస్‌ఏ చెబుతున్నదే వాస్తవమైతే మిగిలిన కిట్లను మినహాయించి కొనాలి కదా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. బడ్జెట్‌కు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్‌

వచ్చే ఆర్థిక సంవత్సర (2023-24) బడ్జెట్‌ను శాసనసభ, మండలిలో శుక్రవారం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా... దానికి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఇంకా ఆమోదం తెలపకపోవడంతో అధికార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో దీనిపై సోమవారం హైకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయనుంది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆకర్షించి.. అడ్డంగా దోపిడీ

‘విమానాశ్రయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇటీవల విజయవాడకు చెందిన 40 మంది యువకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. దీంతో వారంతా సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా తాజాగా కేసు నమోదు చేసి దీనికి బాధ్యుడైన వ్యక్తిని అరెస్టు చేశారు. విమానాశ్రయాల్లో కార్గో మేనేజర్లుగా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి దగ్గర రూ.50వేల నుంచి రూ.లక్షన్నర వరకూ వసూలు చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అభయారణ్యంలో 7 కి.మీ. నడిస్తేనే బడి

చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీలోని రాజుక్యాంపు మారుమూలన ఒడిశా రాష్ట్ర సరిహద్దులో ఉంది. ఇక్కడ 12 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఫోర్‌బే జలాశయం పర్యవేక్షణకు జెన్‌కో సంస్థ ఏర్పాటు చేసిన రహదారి శివారులో గుట్టలపై ఉన్న ఏకైక గిరిజన గ్రామం కావడంతో అటువైపుగా వాహనాల రాకపోకలు ఉండవు. ఇక్కడి ఆదివాసీలంతా పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ గ్రామంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులు 15 మంది వరకు ఉన్నారు. ఈ గ్రామంలో పాఠశాల లేకపోవడంతో ఏడు కి.మీ. దూరంలోని ఫోర్‌బే గ్రామానికి కాలినడకన వెళ్లాలి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సీఎం వద్దకు చేరిన పంచాయితీ!

రెండు ఘటనలు.. అధికార పార్టీలో ఆధిపత్య పోరు.. ఒకటి ఇసుక అక్రమ రవాణా.. రెండు భౌతిక దాడులు.. రెండు ఘటనలపై పోలీసు కేసులు లేవు. కానీ పంచాయితీ తాడేపల్లికి చేరింది. ఇరువర్గాలతో పెద్దలు మాట్లాడేందుకు ఏర్పాట్లు చేశారు. అధికార పార్టీ కావడంతో పోలీసులు కేసులు నమోదు చేయకుండా వేచి చూస్తున్నారు. న్యాయసలహా తీసుకుంటున్నామంటూ నిరీక్షిస్తున్నారు. పెద్దల సూచన మేరకు కేసులు నమోదు చేయాలా వద్దా అనేది నిర్ణయించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇదిగో హార్బర్‌.. అదిగో జెట్టీ!

సువిశాలమైన సముద్రతీరం.. రెండు లక్షల మందికిపైగా మత్స్యకారులు.. వేట సాగించేవారే అక్షరాలా అరవై వేలు.. ఇంతటి అవసరాలున్న జిల్లాలో ఒక్కటంటే ఒక్క జెట్టీ గానీ.. ఫిషింగ్‌హార్బర్‌ గానీ లేదంటే మన నాయకుల తీరునేమనాలి.. మాట్లాడితే ఇదిగో హార్బర్‌ అంటే అదిగో జెట్టీ అంటుంటారు. వీరికి అధికారులు వంతపాడుతుంటారు. ఆరు దశాబ్దాలుగా మాటలే తప్ప చేతల్లేవు. దీంతో జిల్లాలో సగానికిపైగా మత్స్యకారులకు వలసే జీవనాధారమైపోతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. స్మార్ట్‌టౌన్‌ పథకం ఏమైంది?

ధ్యతరగతి వర్గాల వారికి సొంత ఇంటి కలను సాకారం చేస్తామని అందుబాటులోకి తెచ్చిన జగనన్న స్మార్ట్‌టౌన్‌ పథకం ఆదిలోనే ఆగిపోయింది. ఈ పథకంలో ఎన్ని మార్పులు చేసినా ఏదీ ఫలితం ఇవ్వకపోవడంతో చివరిసారిగా రియల్‌ ఎస్టేట్‌ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేసినా అదీ బెడిసి కొట్టింది. ప్రభుత్వం ఇచ్చే ధరకు రైతులు భూములు ఇవ్వకపోవడం వాళ్లు చెప్పిన ధరకు కొని ప్లాట్లు విక్రయించలేమని భావించడంతో ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు.క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు చూస్తే ఈ పథకం ఆగిపోయినట్లే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆ పోస్టులు.. పదే పదే ప్రకటనలు

విద్యాశాఖకు అనుబంధంగా నడుస్తున్న సమగ్రశిక్ష విభాగంలో సెక్టోరల్‌ అధికారుల నియామక అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దాదాపు రెండేళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన జారీ చేశారు. వీటి నియామకం చేపట్టినప్పుడల్లా రాజకీయ ప్రమేయంతో అర్ధంతరంగా నిలిచిపోవడం జరుగుతోంది. గతంలో సంయుక్త కలెక్టర్‌ స్థాయిలో మౌఖిక పరీక్షలు పూర్తిచేసిన తరువాత కూడా ఎంపికైన వారికి ఉత్తర్వులు ఇవ్వకుండా నిలిపివేశారు. ఇప్పుడు అవే పోస్టులకు మళ్లీ ఆహ్వానించడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని