Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Feb 2023 09:10 IST

1. జైల్లో నుంచి పరీక్ష రాసి గోల్డ్‌ మెడల్‌

పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ఓ మాజీ విద్యార్థి నాయకుడు ఎం.ఏలో అగ్రస్థానంలో నిలిచి గవర్నరు నుంచి గోల్డ్‌ మెడల్‌ అందుకున్నాడు. అతడు జైల్లో ఉంటూనే పరీక్ష రాసి ఈ ఘనత సాధించడం విశేషం. 2019లో అస్సాంలోని గువాహటిలో జరిగిన పేలుళ్లకు సంబంధించిన కేసులో సంజీబ్‌ తాలుక్‌దార్‌ అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. గువాహటి జైల్లో విచారణ ఖైదీగా ఉన్న అతడు ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఎం.ఏ సోషియాలజీ కోర్సు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రష్యాను ఎదుర్కోవడం సులువు కాదు..: పుతిన్‌

రణరంగంలో తమను ఓడించాలని చూసేవారికి ఒక విషయం అర్థం కావడం లేదని, ఆధునిక యుగంలో తమ దేశాన్ని ఎదుర్కోవడం సులువు కాదని అమెరికా, జర్మనీలను ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించారు. స్టాలిన్‌ గ్రాడ్‌ యుద్ధం జరిగి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆనాటి పోరాటంలో భాగమైన వారికి పుతిన్‌ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధంలో స్టాలిన్‌ గ్రాడ్‌ వద్ద రష్యా.. 91 వేలమంది జర్మన్‌ బలగాలను బంధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మాటల్లోనే...మెట్రో !

విశాఖ నగరంలో ‘మెట్రో రైలు ప్రాజెక్టు’ ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. ‘మెట్రో’ను పరుగులు పెట్టిస్తామని అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు చెప్పుకొస్తున్నా... ఇప్పటివరకు కేంద్రానికి ప్రతిపాదనలే అందకపోవడం గమనార్హం. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడలోని మెట్రో రైలు కార్యాలయాన్ని ఏకంగా విశాఖకు తరలించేశారు. మొదటి దశ ప్రాజెక్టును 2020లో ప్రారంభించి 2024కు పూర్తి చేస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కళ్లలోనూ క్యాన్సర్‌ ముప్పు!

రకరకాల క్యాన్సర్ల గురించి చాలామందికి అవగాహన ఉండటం సహజమే. అయితే కళ్లకు కూడా క్యాన్సర్‌ సోకుతుందనేది చాలా తక్కువ మందికే తెలుసు. ప్రభుత్వ కంటి ఆసుపత్రి అయిన సరోజనిదేవితో పాటు ఎల్వీప్రసాద్‌ నేత్ర వైద్యశాలకు తరచూ ఇలాంటి కేసులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఎల్వీ ప్రసాద్‌లో ఇప్పటివరకు 25 వేల కేసులకు చికిత్స అందించారు. శనివారం ప్రపంచ క్యాన్సర్‌ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మళ్లీ.. రౌడీలొచ్చేశారు..!

నల్గొండ జిల్లాలో గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న రౌడీషీటర్లు, పాత నేరస్థులు తిరిగి తమ కార్యకలాపాలను చురుగ్గా కొనసాగిస్తున్నారు. నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాల్లో రౌడీషీటర్లు భూ దందాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా క్షేత్రస్థాయిలోని కొంత మంది అధికార పార్టీ నాయకులతో పాటూ పోలీసులతో ములాఖత్‌ అయి వ్యవహారాలు సాగిస్తున్నట్లు  సమాచారం. ఏడాది కాలంగా పోలీసింగ్‌లో నాణ్యత లోపించడం, ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న నిఘా అధికారులు సైతం వీరి వెనుక ఉండటంతో రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమ్మాయి పుడితే.. రూ.5 వేలు

అమ్మాయి పుడితే భారంగా భావిస్తున్న రోజులివి. ఇలాంటి సమాజంలో కుమార్తె పుట్టడం వరమంటున్నారు డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి సర్పంచి పానుగంటి రూప. తల్లిదండ్రుల్లో భయాన్ని దూరం చేసి అభయం ఇచ్చేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆడపిల్ల పుడితే రూ.5 వేల బాండ్‌ ఇస్తానని ప్రకటించారు. గ్రామంలో ఈ నెల 5 నుంచి ఏడాది పాటు అమలు చేస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రోడ్డు సమస్యను విన్నవిస్తే చేయిచేసుకున్న ఎమ్మెల్యే

మదనపల్లె పురపాలక సంఘం పరిధిలోని నీరుగట్టువారిపల్లెలో శుక్రవారం రాత్రి జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం’ ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికంగా నివాసముంటున్న లక్ష్మీనారాయణపై ఎమ్మెల్యే నవాజ్‌బాషా చేయిచేసుకున్నారు. ఘటన జరిగిన కొన్ని నిముషాల్లోనే బాధితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు... మదనపల్లెలోని 32వ వార్డులో శుక్రవారం రాత్రి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గోడలు దాటి స్లాబ్‌ల దాకా వచ్చాయ్‌

ప్రీకాస్ట్‌ గోడలను ప్రహరీ కోసం విరివిగా వాడటం చూస్తున్నాం. రెండు మూడురోజుల్లోనే దీనిని నిర్మించుకునే వెసులుబాటు ఉండటంతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ప్రీకాస్ట్‌ టెక్నాలజీలోని సానుకూలతల దృష్ట్యా భవన నిర్మాణంలో ప్రధానమైన కోర్‌ స్లాబుల్లోనూ వినియోగించడం నగర నిర్మాణ రంగంలో మొదలైంది. ఇటీవల కాలంలో వాణిజ్య నిర్మాణాల్లో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తున్నారు. హాలో కోర్‌ రిబ్బ్‌డ్‌ స్లాబుల వాడకంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిర్మాణదారులు, తయారీదారులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రెండు మూడు రోజుల్లో ఎంసెట్‌ తేదీల వెల్లడి

టీఎస్‌ ఎంసెట్‌ను మే మొదటి లేదా రెండో వారంలో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఏపీలో మే 15 నుంచి 26 వరకు నిర్వహించాలని ఇప్పటికే అక్కడి అధికారులు నిర్ణయించారు. ఎంసెట్‌లకు రెండు రాష్ట్రాల విద్యార్థులు హాజరవుతారు. పరీక్ష కేంద్రాలను కూడా ఏపీ, తెలంగాణలలో ఏర్పాటు చేస్తారు. ఏపీ ఎంసెట్‌ ముగిసిన తర్వాత జరిపితే బాగా ఆలస్యమవుతుంది. అంతేకాకుండా జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఉన్నందున మే 1 నుంచి 14 మధ్యలో టీఎస్‌ ఎంసెట్‌ను జరపాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారత్‌దీ అదే బాట..

 భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌ ఆరంభానికి ఇంకో అయిదు రోజులే సమయం ఉంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో స్పిన్నర్లదే ఆధిపత్యం కాబోతోందని అంచనా. భారత్‌ తొలి టెస్టు నుంచే స్పిన్‌ దాడి మొదలుపెడుతుందన్న అంచనాతో ప్రాక్టీస్‌లో ఆసీస్‌ బ్యాటర్లు స్పిన్నర్లనే ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అశ్విన్‌ శైలికి దగ్గరగా ఉన్న మహీష్‌ అనే బౌలర్‌తో బంతులు వేయించుకుంటున్నట్లు కూడా వార్తలొచ్చాయి. మరోవైపు భారత్‌ సైతం నెట్స్‌లో స్పిన్నర్లకే పెద్ద పీట వేస్తుండడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు